Sabarimala: ఈ నెల 16న తెరచుకోనున్న శబరిమల ఆలయం.. అయ్యప్ప భక్తులకు ఇన్సూరెన్స్.. కేరళ సర్కారు కీలక నిర్ణయం

|

Nov 04, 2024 | 8:50 AM

కార్తీక మాసం వచ్చిందంటే చాలు అయ్యప్ప దీక్షల సీజన్ మొదలవుతుంది. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో అయ్యప్ప స్వామి మాలధారణ చేసే భక్తుల దర్శనం ఇస్తారు. హరిహర సుతుడు అప్పయ్యను కీర్తిస్తూ మండల దీక్షని చేపట్టి తమ ఇడుములను స్వామివారికి సమర్పించడానికి శబరిమల చేరుకుంటారు. అయితే ప్రతి సంవత్సరం ఈ అయ్యప్ప స్వామి దర్శనం కోసం వెళ్ళే భక్తుల సంఖ్య పెరిగిపోతోంది. ఈ నేపధ్యంలో కేరళ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.

Sabarimala: ఈ నెల 16న తెరచుకోనున్న శబరిమల ఆలయం.. అయ్యప్ప భక్తులకు ఇన్సూరెన్స్.. కేరళ సర్కారు కీలక నిర్ణయం
Sabarimala Pilgrims
Follow us on

అయ్యప్ప దీక్షల సీజన్ ప్రారంభమైన నేపథ్యంలో, కేరళ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. శబరిమల వచ్చే అయ్యప్పస్వాములకు ఉచితంగా జీవిత బీమా సదుపాయం కల్పించాలని నిర్ణయించింది. సీఎం పినరయి విజయన్ అధ్యక్షతన జరిగిన సమీక్ష సమావేశంలో ఈ కీలక అంశంపై చర్చించారు. ఈ నెలాఖరులో ప్రారంభం కానున్న మండలం-మకరవిళక్కు తీర్థయాత్ర సీజన్‌లో అయ్యప్ప స్వామిని దర్శించుకునే శబరిమల యాత్రికులు ఐదు లక్షల రూపాయల ఉచిత బీమా కవరేజీని పొందనున్నారు. ఈ ఏడాది శబరిమలకు వచ్చే యాత్రికులందరికీ ట్రావెన్‌కోర్ దేవస్వం బోర్డు (టీడీబీ), పుణ్యక్షేత్రం నిర్వహించే అపెక్స్ టెంపుల్ బాడీ ఇన్సూరెన్స్ కవరేజీని ప్రవేశపెట్టిందని రాష్ట్ర దేవస్వం మంత్రి వీఎన్ వాసవన్ తెలిపారు.

అయ్యప్ప దీక్షలో ఉన్న స్వాములు శబరిమల యాత్ర సందర్భంగా మరణిస్తే, వారి కుటుంబానికి రూ.5 లక్షలు అందించనున్నారు. అంతేకాదు, ఆ భక్తుడి మృతదేహాన్ని స్వస్థలానికి తరలించడానికి ప్రభుత్వమే ఏర్పాట్లు చేస్తుంది.

యాత్రికులందరికీ సాఫీగా దర్శనం కల్పించేందుకు కొండ గుడి వద్ద ఏర్పాట్లు పూర్తి ఆ రాష్ట్ర దేవస్వం మంత్రి వీఎన్ వాసవన్ చేసినట్లు తెలిపారు. వార్షిక పాదయాత్రకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని, ముఖ్యమంత్రి పినరయి విజయన్ అధ్యక్షతన జరిగిన ఉన్నతస్థాయి సమావేశం తుది దశ ఏర్పాట్లను పరిశీలించిందని చెప్పారు. తీర్థయాత్ర సందర్భంగా శబరిమలలో 13,600 మంది పోలీసు అధికారులు, 2,500 మంది అగ్నిమాపక, రెస్క్యూ సిబ్బంది, 1,000 మంది పారిశుద్ధ్య సిబ్బందిని మోహరించనున్నారు. యాత్రికులు చేరుకునే అన్ని ప్రాంతాలకు సరిపడా తాగునీటి సరఫరా అయ్యేలా జలమండలి విస్తృత ఏర్పాట్లు చేసింది.

ఇవి కూడా చదవండి

పంబ, అప్పాచిమేడు, సన్నిధానం, సమీపంలోని ఆసుపత్రుల్లో ప్రత్యేక కార్డియాలజీ చికిత్స సౌకర్యాలు కూడా ఏర్పాట్లు చేశారు. అంతేకాదు ఎవరైనా అనుకోని విధంగా పాము కాటుకు గురైతే వారికి యాంటీ-వెనమ్ చికిత్స అందించేందుకు ఏర్పాట్లు చేశారు. వన్యప్రాణి విభాగం ఆధ్వర్యంలో 1,500 మంది ఎకో-గార్డులు, ఏనుగు స్క్వాడ్‌లను కూడా నియమించనున్నారు. గత ఏడాది 15 లక్షల మందికి అన్నదానం (ఉచిత భోజనం) అందించగా.. ఈ ఏడాది 20 లక్షల మంది అయ్యప్ప భక్తులకు సన్నిధానంలో అన్నదానం చేయనున్నట్లు మంత్రి తెలిపారు.

అయ్యప్ప ఆలయంతో పాటు కేరళలోని దక్షిణ ప్రాంతంలోని అన్ని ఆలయాలను పర్యవేక్షించే ట్రావెన్ కోర్ దేవస్వోమ్ బోర్డు ఈ సరికొత్త బీమా పథకానికి ప్రీమియం చెల్లిస్తుంది. కాగా, రెండు నెలలకు పైగా కొనసాగే అయ్యప్ప స్వాముల దీక్షల నేపథ్యంలో… శబరిమల ఆలయం నవంబరు 16న తెరుచుకోనుంది.

 

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..