Ayodhya: అయోధ్య రామాలయంలో మరో అద్భుతం.. సూర్యతిలకం

ప్రాణ ప్రతిష్ట జరిగిన మరుసటి రోజునుంచే అయోధ్య రాముడి దివ్యదర్శనం అందరికీ అందుబాటులోకి రానుంది. కానీ.. అన్ని రోజుల్లో కంటే శ్రీరామ నవమి రోజున అయోధ్య రామాలయానికి భక్తకోటి పోటెత్తబోతోంది. ఎందుకంటే ఆ పర్వదినాన రాముడి కల్యాణ మహోత్సవంతో పాటు.. మరో అద్భుతమైన అవకాశం లభించబోతోంది. మూలవిరాట్టు నుదుటిని సూర్య భగవానుడు ముద్దాడే దివ్య సందర్భమది.

Ayodhya: అయోధ్య రామాలయంలో మరో అద్భుతం.. సూర్యతిలకం
Ram Mandir
Follow us
Ram Naramaneni

|

Updated on: Jan 21, 2024 | 9:40 PM

అయోధ్య బాలరాముడి గుడి.. శతాబ్దాలుగా చెక్కుచెదరని ప్రాచీన భారతీయ దేవాలయాల శైలిలో రూపొందుతున్న కట్టడం. వెయ్యేళ్లు వర్థిల్లేలా తీవ్రమైన భూకంపాలొచ్చినా తట్టుకుని నిలబడేంతటి పటుత్వమున్న నిర్మాణం.ఇందులో.. ఎన్నో ప్రత్యేకతలు. అందులో ఒకటి సూర్యతిలకం. అయోధ్య రామాలయం గర్భగుడిలో శ్రీరాముడి విగ్రహం నుదుటిపై సూర్య కిరణాలు ప్రసరించేలా జరిగిన ఏర్పాటు పేరే సూర్యతిలకం. మహాకాళేశ్వర్ మందిరంలో భస్మంతో అభిషేకం చేసినట్టు… బృందావనంలో జన్మాష్టమి రోజున చిన్ని కృష్ణయ్యకు పంచామృతంతో అభిషేకం చేసినట్టు.. అయోధ్యలో బాలరాముడికి సూర్య కిరణాభిషేకం.

శ్రీకాకుళం జిల్లా అరసవిల్లి సూర్య భగవానుడి గర్భగుడిలో మూలవిరాట్టు పాదాల్ని ఏటా రెండుసార్లు సూర్య కిరణాలు స్పృశిస్తాయి. ఇది సహజసిద్ధమైన ఏర్పాటు. అదేవిధంగా అయోధ్య రాముడి నుదుటిని ముద్దాడబోతున్నాడు భానుమూర్తి. సరిగ్గా మిట్టమధ్యాహ్నం భానుడు నడినెత్తి మీదకు వచ్చీ రాగానే.. సూర్య కిరణాల్ని ఒడిసిపట్టి.. నేరుగా మూలవిరాట్టు నుదుటిని స్పృశించేలా ప్రత్యేక ఏర్పాటు జరిగింది.

కానీ.. ఏటా శ్రీరామనవమి రోజు సూర్యకిరణాలు ఒకే రకంగా ప్రసరించవు గనుక విగ్రహం నుదుటిపై సూర్యతిలక స్థానం మారుతూ వస్తుంది. ఈ సమస్యను అధిగమించడమే పెద్ద సవాల్‌. 19 ఏళ్లకు ఒకసారి కలిసే సూర్య, చంద్రరాశుల తిథుల ఆధారంగా సూర్యుడి గమనంలో వచ్చే మార్పుల్ని అధ్యయనం చేస్తూ.. దానికి అనుగుణంగా కిరణాల్ని అనుసరిస్తూ అధునాతన కటకాలు, అద్దాలు, గేర్‌బాక్స్‌లు, గొట్టాలను వాడారు. ఉక్కు, ఇనుము వాడకుండా విద్యుత్‌తో అవసరం లేకుండా రూపొందిన పర్ఫెక్ట్ ఆప్టికో-మెకానికల్ సిస్టమ్ ఇది.

ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఆస్ట్రోఫిజిక్స్‌ సహకారంతో సెంట్రల్‌ బిల్డింగ్‌ రీసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌-CBRI ఈ ప్రత్యేక టెక్నాలజీని రూపొందించింది. ఏటా మహర్నవమి పర్వదినాన మధ్యాహ్నం 12 గంటలకు మొదలయ్యే ఈ ప్రక్రియ గరిష్టంగా 6 నిమిషాల పాటు కొనసాగనుంది.

కానీ… బాల రాముడికి సూర్యాభిషేకం జరగాలంటే కిరణాలు మూడో అంతస్తు పైనుంచి పడాల్సి ఉంది. ఇప్పటికింకా మూడో అంతస్థు నిర్మాణం జరగనేలేదు. ప్రస్తుతం గ్రౌండ్ ఫ్లోర్ పనులు మాత్రమే పూర్తయ్యాయి. వచ్చే ఏడాది డిసెంబర్ నాటికి మొత్తం 3 అంతస్థులు పూర్తవుతాయనేది జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ అంచనా. సో.. మరో రెండేళ్ల తర్వాత అంటే… 2026లో వచ్చే మహర్నవమికి మాత్రమే అయోధ్య గుడిలో బాలరాముడికి సూర్య తిలకం.. సుసాధ్యం.

మరిన్ని అధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…