ప్రతి సంవత్సరం ప్రతి మాసంలో పవిత్రమైన శివరాత్రి పండుగను కృష్ణ పక్షంలోని చతుర్దశి రోజున మాస శివరాత్రిగా జరుపుకుంటారు. ఈ పండుగ శివయ్యకు అంకితం చేయబడింది. శివపార్వతులను ఆరాధించడం, శివరాత్రి రోజున ఉపవాసం చేయడం వలన భక్తులు ఆది దంపతుల నుంచి ప్రత్యేక ఆశీర్వాదాలను పొందుతారని నమ్మకం. అందువల్ల శివపార్వతుల అనుగ్రహం పొందడానికి భక్తులు ఈ రోజున అంటే మాస శివరాత్రిన ప్రత్యేక పూజలు చేస్తారు. రోజంతా ఉపవాసం ఉంటారు. ఈ ఏడాది ఆషాఢ మాస శివరాత్రి ఆగస్టు 2వ తేదీ 2024న వచ్చింది.
మాస శివ రాత్రి ఉపవాసం చాలా ముఖ్యమైనదిగా పరిగణించబడుతుంది. ఈ రోజున ముఖ్యంగా అవివాహితులు శివపార్వతులను వివాహం జరగాలనే కోరికతో పూజిస్తారు. అఖండ సౌభాగ్యం, సంతానం కలగాలని కోరుకుంటూ ఈ ఉపవాసం పాటిస్తారు. ఈ రోజున ఉపవాసం ఉన్న భక్తులకు సుఖం, శాంతి, సౌభాగ్యం లభిస్తాయి. ఈ ప్రత్యేక వ్రతానికి కొన్ని ముఖ్యమైన నియమాలు పాటించాలి. ఆషాడ మాస శివరాత్రి వ్రతాన్ని పాటిస్తున్నట్లయితే.. ఈ రోజున ఏ పనులు తప్పకుండా చేయాలి? ఈ రోజు పొరపాటున కూడా ఏ పనులు చేయకూడదు అనే విషయాలను ఖచ్చితంగా గుర్తుంచుకోవాలి. అవి ఏమిటో తెలుసుకుందాం..
ఆషాడ మాస శివరాత్రి రోజున చేయకూడని పనులు
మాస శివరాత్రి రోజున తెల్లవారుజామున నిద్రలేచి ఇంటిని బాగా శుభ్రం చేసిన తర్వాత స్నానం చేయడం మొదలైనవి చేయాలి. వీలైతే ఈ రోజున ఉపవాసం పాటించాలి. ఇప్పుడు ఏదైనా శివాలయానికి వెళ్లి ముందుగా వినాయకుడిని స్మరించుకుని దర్శనం చేసుకోండి. అనంతరం గంగాజలంతో శివునికి అభిషేకం చేయాలి. దీని తర్వాత పచ్చి పాలతో అభిషేకం చేయాలి.
ఇప్పుడు సాధారణ నీటితో అభిషేకం చేయాలి. దీని కోసం నీటిలో బిల్వ పత్రాన్ని, గంథాన్ని కలిపి శివలింగానికి సమర్పించండి. అంతేకాదు భక్తుల కోరికను అనుసరిస్తూ ఇత్తడి పాత్రలో పాలు, పెరుగు, తేనె, గంగాజలం, నీరు కలిపి పంచామృతాన్ని తయారు చేసి ఈ పంచామృతంతో శివునికి అభిషేకం చేయవచ్చు. అభిషేకం చేస్తున్నప్పుడు ఓం నమః శివాయ మంత్రం లేదా మహామృత్యుంజయ మంత్రాన్ని జపించండి. శివలింగానికి అభిషేకం చేసిన తరువాత, శివలింగంపై జనపనార, ఉమ్మెత్త పువ్వు, బిల్వ పత్రాలు, శమీ ఆకులు, పువ్వులు, పండ్లు మొదలైన వాటిని సమర్పించండి. ఈ సమయంలో కూడా మంత్రాన్ని పఠించండి లేదా శివ చాలీసా పఠించాలి.
మహిళలు పూజ సమయంలో పార్వతీ దేవికి ఆకుపచ్చ రంగు గాజులు, పసుపు, కుంకుమ, జాకెట్టు మొదలైన అలంకరణ వస్తువులను సమర్పించాలి. పార్వతీ దేవికి సింధూరాన్ని నైవేద్యంగా పెట్టిన తర్వాత పెళ్లయిన స్త్రీలు వారి నుదుటిపైన సింధురాన్ని తిలకంగా దిద్దుకోవాలి. పెళ్లికాని అమ్మాయిలు ఈ సమయంలో ‘రామ రక్షా స్తోత్రం’ పఠించాలి. పార్వతీదేవికి పూలు, పండ్లు సమర్పించండి. చివరగా హారతిని ఇచ్చి పూజను ముగించాలి. ఆషాడ మాస శివరాత్రి రోజున బ్రహ్మచర్యం పాటించండి. వీలైతే ఈ రోజు రాత్రంతా మేల్కొని, శివుని సత్సంగం నిర్వహించండి. శివయ్యను కీర్తించండి.
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
గమనిక: పైన పేర్కొన్న అంశాలను మత గ్రంథాల ఆధారంగా ప్రజల సాధారణ ఆసక్తులను దృష్టిలో ఉంచుకుని ఇవ్వడం జరిగింది. దీనిని టీవీ9 తెలుగు ధృవీకరించడం లేదు