శ్రీశైలం దేవస్థాన అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఆర్జీత సేవలు, సర్వదర్శనం టికెట్ల జారీ విషయంలో మార్పులు దిశగా అడుగులు వేస్తున్నారు. ఇందులో భాగంగానే దేవస్థానంలో ఆన్‌లైన్ సేవలకు ప్రాధాన్యతనిస్తూ కీలక నిర్ణయం తీసుకున్నారు. మే 31 నుంచి అన్ని ఆర్జితసేవలు, స్పర్శ దర్శనం టికెట్లు ఆన్‌లైన్‌లో మాత్రమే జారీ చేయాలని అధికారులు నిర్ణయించారు. ఇందులో భాగంగానే ఈనెల 25 నుంచి దేవస్థానం టికెట్లను ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంచనుంది.
మే 1వ తేదీ నుంచి కరెంటు బుకింగ్‌లో కౌంటర్ల ద్వారా ఇచ్చే టికెట్లకు అధికారులు స్వస్తి పలికారు. పర్వదినాలు,సెలవులలోనే కాకుండా సాధారణ రోజులలో కూడా భక్తులు అధిక సంఖ్యలో వస్తుండడంతో దేవస్థానం ఈ నిర్ణయం తీసుకుంది. ఆన్‌లైన్‌లో సేవ టికెట్లు పొందిన భక్తులు ప్రవేశ ద్వారం వద్ద 15 నిమిషాల ముందు రిపోర్ట్ చేయాలని దేవాలయం వర్గాలు తెలిపారు. ఆన్‌లైన్‌లో సేవ ,స్పర్శ దర్శన టికెట్లు పొందిన వారికి టికెట్ పై సూచించిన సమయంలో మాత్రమే ఆలయంలోకి అనుమతించనున్నారు. సేవా, స్పర్శ దర్శనం టికెట్లు పొందిన భక్తులు ఆన్‌లైన్ ప్రింట్ కాపీ, ఆధార్ కార్డు తప్పనిసరి ఉండాలని దేవస్థానం నిర్ణయించింది. ఆన్‌లైన్‌లో పొందిన టికెట్లు స్కానింగ్ జరిపిన తరువాత ఆలయంలోకి అనుమతిస్తామని అధికారులు తెలిపారు.
ఇదిలా ఉంటే శ్రీశైలం క్షేత్రంలో ఆన్‌లైన్ విధానాన్ని కరోనా సమయంలోనూ అందుబాటులోకి తీసుకొచ్చిన విషయం తెలిసిందే. గతేడాది జనవరిలో కరోనా వ్యాప్తి నేపథ్యంలో శ్రీశైలం మహాక్షేత్రంలో ఆన్‌లైన్ విధానం అమలు చేశారు. ఇందులో భాగంగా ఉచిత దర్శనం, రూ.150, రూ.300 దర్శనం టిక్కెట్లు.. వీటితో పాటు ఆర్జిత సేవల టిక్కెట్లు కూడా ఆన్ లైన్‌లో అందించారు.
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం క్లిక్ చేయండి..