AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Andhra Pradesh: ఇంద్రకీలాద్రిపై VIPలకు ఆ దర్శనం లేనట్లే.. ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం..

పుణ్యక్షేత్రాలు, ఇతర సందర్శనీయ ప్రదేశాల్లో వీఐపీలకు ప్రత్యేక ట్రీట్ మెంట్ ఉంటుంది. వారు ముఖ్యమైన వ్యక్తులు కావడంతో వారి సమయం వృధా కాకుండా వారికి దేవాలయాల్లో వేగవంతంగా దర్శనం పూర్తవడానికి..

Andhra Pradesh: ఇంద్రకీలాద్రిపై VIPలకు ఆ దర్శనం లేనట్లే.. ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం..
Durga Gudi
Amarnadh Daneti
|

Updated on: Sep 17, 2022 | 9:10 AM

Share

Andhra Pradesh: పుణ్యక్షేత్రాలు, ఇతర సందర్శనీయ ప్రదేశాల్లో వీఐపీలకు ప్రత్యేక ట్రీట్ మెంట్ ఉంటుంది. వారు ముఖ్యమైన వ్యక్తులు కావడంతో వారి సమయం వృధా కాకుండా వారికి దేవాలయాల్లో వేగవంతంగా దర్శనం పూర్తవడానికి ప్రత్యేక ఏర్పాట్లు ఉంటాయి. VIPలు దర్శనానికి వస్తే సామాన్య భక్తులకు దర్శనం కొంత ఆలస్యం అవుతుంది. ఇక ఉత్సవాల సమయంలో అయితే వీఐపీల తాకిడి మరీ ఎక్కువుగా ఉంటుంది. దీంతో భగవంతుడి దర్శనం కోసం వచ్చిన సామాన్య భక్తులు గంటల కొద్దీ క్యూ లైన్లో వేచి ఉంటూ ఎన్నో ఇబ్బందులు పడుతుంటారు. మరి కొద్ది రోజుల్లో దసరా పండుగ రానుంది. దసరా మహోత్సవాలను విజయవాడలోని ఇంద్రకీలాద్రి శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానం(కనక దుర్గమ్మ గుడి)లో ఘనంగా నిర్వహించనున్నారు. 9 రోజుల పాటు అంగరంగ వైభవంగా వేడుకలు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. అయితే ఈసారి ఉత్సవాల్లో సామాన్య భక్తులకు ఇబ్బందులు కలగకుండా.. త్వరగా దర్శనం పూర్తయ్యే విధంగా అవసరమైన ఏర్పాట్లు చేస్తుంది.

దసరా మహోత్సవాల్లో భాగంగా VIPల దర్శనంలోనూ మార్పులు చేసింది. గతంలో వీఐపీలకు అంతరాలయ దర్శనం కల్పించేవారు. ఒక మూల నక్షత్రం తప్పితే మిగతా రోజుల్లో ముఖ్యమైన వ్యక్తులు వస్తే అంతరాలయ ప్రవేశం కల్పించి.. దర్శన ఏర్పాట్లు చేసేవారు. అయితే ఈసారి కేవలం VVIPలు అంటే గవర్నర్, సీఎం, ప్రధాన న్యాయమూర్తులు వంటి మరీ ముఖ్యమైన వ్యక్తులు మినహిస్తే మిగతా వారికి దసరా మహోత్సవాల 9రోజులు అంతరాలయ దర్శనం నిలిపివేయాలని దేవదాయ శాఖ నిర్ణయించింది. ఇదే నిర్ణయాన్ని దేవదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ మీడియాకు స్పష్టం చేశారు. VIPలకు, రూ.500 టికెట్లు కొన్న భక్తులకు అంతరాలయ దర్శనాన్ని రద్దు చేసినట్లు వెల్లడించారు. వారికి నిర్దేశించిన క్యూ లైన్‌ మార్గాన్ని ఏర్పాటు చేస్తామన్నారు. దసరా ఉత్సవాలు జరిగే 9 రోజులూ ఇదే విధానం కొనసాగుతుందని తెలిపారు. భక్తులను ఘాట్‌ రోడ్డు నుంచి దర్శనానికి అనుమతిస్తామని చెప్పారు. రూ.500 టికెట్‌ కొన్న VIPలకు మూడు ప్రదేశాల్లో పికప్‌ పాయింట్లు ఏర్పాటుచేసి వాహనాల్లో కొండ పైకి తీసుకెళ్తామని మంత్రి కొట్టు సత్యనారాయణ తెలిపారు. రూ.300, రూ.100 టికెట్‌తో దర్శనం చేసుకునే భక్తులకు, ఉచిత దర్శనానికి ప్రత్యేక క్యూ లైన్‌ను ఏర్పాటు చేస్తామన్నారు. క్యూ లైన్‌లో రద్దీకి అనుగుణంగా టికెట్లను విక్రయిస్తామని మంత్రి స్పష్టం చేశారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం చూడండి..