భక్తులకు అలర్ట్! అరుణాచలం ఆలయంలోకి వీటిపై నిషేధం.. సెప్టెంబర్ 1 నుంచి కొత్త రూల్స్

Tiruvannamalai Temple Darshan Rules: తిరువణ్ణామలై అన్నామలైయార్ ఆలయంలో సెప్టెంబర్ 1 నుంచి భక్తులు మొబైల్ ఫోన్లు తీసుకెళ్లడంపై నిషేధం అమల్లోకి రానుంది. ఫోన్‌ను రూ.5 రుసుముతో భద్రతా కేంద్రాల్లో డిపాజిట్ చేసుకునే సౌకర్యం కల్పించారు. నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకోనున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు.

భక్తులకు అలర్ట్! అరుణాచలం ఆలయంలోకి వీటిపై నిషేధం.. సెప్టెంబర్ 1 నుంచి కొత్త రూల్స్
Tiruvannamalai Temple Darshan Rules

Updated on: Aug 21, 2026 | 3:31 PM

Tiruvannamalai Temple Darshan Rules Telugu: తమిళనాడు రాష్ట్రం తిరువణ్ణామలైలోని ప్రసిద్ధ అన్నామలైయార్ (అరుణాచలం) ఆలయానికి వచ్చే భక్తులకు ఆలయ యంత్రాంగం కీలక సూచనలు జారీ చేసింది. సెప్టెంబర్ 1, 2026 నుంచి ఆలయం లోపలికి మొబైల్ ఫోన్లను తీసుకురావడాన్ని నిషేధిస్తున్నట్లు ప్రకటించింది. ఆలయ పవిత్రతను కాపాడటంతో పాటు, గర్భగుడి పరిసరాల్లో ఫొటోలు, వీడియోలు, రీల్స్ చిత్రీకరణను నియంత్రించడమే ఈ నిర్ణయం ఉద్దేశమని అధికారులు తెలిపారు.

తమిళనాడులోని ఆలయాలకు కొత్త నిబంధనలు

తమిళనాడులోని దేవాలయాల్లోకి మొబైల్ ఫోన్లను తీసుకురావడంపై హిందూ మత, ధార్మిక దానాల శాఖ ఇప్పటికే నిబంధనలు జారీ చేసింది. ఆలయాల పవిత్రత, ఆగమ సంప్రదాయాలను పరిరక్షించడంతో పాటు, భక్తులు దర్శన సమయంలో ఫొటోలు, వీడియోలు, రీల్స్ తీసుకోవడాన్ని అరికట్టేందుకు ఈ చర్యలు చేపట్టినట్లు అధికారులు పేర్కొన్నారు. అదేవిధంగా ప్రముఖులు లేదా వీఐపీలు ఆలయానికి వచ్చిన సమయంలో వారి ఫొటోలు, వీడియోలు చిత్రీకరించకుండా కూడా ప్రత్యేక ఆంక్షలు విధించారు. వీఐపీల దర్శనానికి సంబంధించిన సమాచారాన్ని ముందుగానే వారికి తెలియజేయాలని సూచించారు.

సెప్టెంబర్ 1 నుంచి అన్నామలైయార్ ఆలయంలో అమలు

తమిళనాడులోని ప్రముఖ శైవ క్షేత్రాల్లో ఒకటైన తిరువణ్ణామలై అన్నామలైయార్ ఆలయానికి ప్రతిరోజూ పెద్ద సంఖ్యలో భక్తులు వస్తుంటారు. పౌర్ణమి, ప్రత్యేక పర్వదినాల్లో భక్తుల రద్దీ మరింత పెరుగుతుంది. ఈ నేపథ్యంలో మొబైల్ ఫోన్ల నిషేధ నిబంధనలను ఆలయ యంత్రాంగం కఠినంగా అమలు చేయనుంది. ఈ నేపథ్యంలో అరుణాచలేశ్వరుడి దర్శనం కోసం వెళ్లే తెలుగు రాష్ట్రాలకు చెందిన భక్తులు తాజా నిబంధనలను పరిగణిలోకి తీసుకోవాల్సి ఉంటుంది.

ఇవి కూడా చదవండి

ఆలయ పరిపాలన విభాగం ప్రకటన ప్రకారం ముఖ్యమైన నిబంధనలు ఇవే..

మొబైల్ ఫోన్లను ఎక్కడ డిపాజిట్ చేయాలి?

భక్తులు తమ మొబైల్ ఫోన్లను ఆలయంలోకి తీసుకెళ్లకుండా భద్రతా కేంద్రాల్లో డిపాజిట్ చేసుకునే సౌకర్యాన్ని అధికారులు ఏర్పాటు చేశారు.

  • ఆలయ తూర్పు వైపున ఉన్న రాజగోపురం సమీపంలో రెండు మొబైల్ భద్రతా కేంద్రాలు ఏర్పాటు చేశారు.
  • ఉత్తర వైపున ఉన్న అమ్మని అమ్మన్ గోపురం సమీపంలో రెండు కేంద్రాలు ఏర్పాటు చేశారు.
  • దక్షిణ వైపున ఉన్న తిరుమంజన గోపురం సమీపంలో ఒక కేంద్రం ఏర్పాటు చేశారు.
  • ఒక్కో మొబైల్ ఫోన్‌కు రూ.5 రుసుము చెల్లించి, టోకెన్ తీసుకుని ఫోన్‌ను భద్రతా కేంద్రంలో అప్పగించవచ్చు.
  • దర్శనం అనంతరం టోకెన్ చూపించి తమ మొబైల్ ఫోన్‌ను తిరిగి తీసుకోవచ్చు.

నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు

ఆలయం లోపలికి మొబైల్ ఫోన్లను అనధికారికంగా తీసుకెళ్లే వారిపై అధికారులు కఠిన చర్యలు తీసుకోనున్నారు. ఆలయ పరిసరాల్లో ఏర్పాటు చేసిన సీసీటీవీ కెమెరాల ద్వారా మొబైల్ వినియోగాన్ని పర్యవేక్షించనున్నట్లు అధికారులు తెలిపారు.
నిబంధనలను ఉల్లంఘించి మొబైల్ ఫోన్‌ను ఆలయంలోకి తీసుకెళ్లినట్లు గుర్తిస్తే, ఆ ఫోన్‌ను స్వాధీనం చేసుకుని పోలీసులకు అప్పగించే అవకాశం ఉంది. సంబంధిత వ్యక్తులపై నిబంధనల ప్రకారం చర్యలు తీసుకుంటామని ఆలయ యంత్రాంగం స్పష్టం చేసింది.

స్వాగతిస్తున్న భక్తులు

అన్నామలైయార్ ఆలయం ఆధ్యాత్మికంగా ఎంతో ప్రాముఖ్యత కలిగిన శైవ క్షేత్రంగా భక్తుల్లో ప్రత్యేక స్థానం సంపాదించుకుంది. శివుని దర్శనం కోసం ఏడాది పొడవునా భక్తులు ఇక్కడికి వస్తుంటారు. పౌర్ణమి రోజుల్లో గిరివలం కోసం వచ్చే భక్తులతో తిరువణ్ణామలై మరింత సందడిగా మారుతుంది. ఆలయంలో భక్తులు మొబైల్ ఫోన్లతో ఫొటోలు, వీడియోలు, రీల్స్ చిత్రీకరించడం వల్ల దర్శనానికి అంతరాయం కలగకుండా, ఆలయ ప్రశాంతత, పవిత్రతను కాపాడేందుకు ఈ నిర్ణయం ఉపయోగపడుతుందని పలువురు భక్తులు అభిప్రాయపడుతున్నారు.

ముఖ్యంగా దర్శన సమయంలో భక్తుల ఏకాగ్రతను పెంచడంతో పాటు, ఆలయ ఆచార సంప్రదాయాలకు మరింత గౌరవం లభిస్తుందని భావిస్తున్నారు. కాబట్టి అన్నామలైయార్ ఆలయాన్ని సందర్శించే భక్తులు సెప్టెంబర్ 1 నుంచి మొబైల్ ఫోన్లను ఆలయంలోకి తీసుకెళ్లకుండా, నిర్దేశించిన భద్రతా కేంద్రాల్లో డిపాజిట్ చేసి దర్శనం చేసుకోవాలని ఆలయ యంత్రాంగం సూచించింది.

Loading...
Unable to load recommendations.
Follow Us