Andhra Pradesh: అదొక మత్స్యకార పల్లె.. ప్రతీ ఏటా శివరాత్రి సందర్భంగా అక్కడ వింత జాతర చేస్తారు. అదే నూకతాత జాతర. విగ్రహాలకు సముద్ర స్నానాలు చేయించి.. భక్తులు రోడ్డుపై వరుసగా పడుకుంటారు. విగ్రహాలు పట్టుకున్న వాళ్ళు పడుకున్న వారిపై నుంచి తొక్కుకుంటూ వెళ్లడం అక్కడ సంప్రదాయం. అలా చేస్తే ఆ ఏడాదిలో కష్టాలన్నీ గట్టెక్కుతాయట..?! ఇంతకీ ఆ గ్రామమేక్కడ..? ఆ వింత జాతర విశేషాలు ఏంటి..? ఇప్పుడు తెలుసుకుందాం..
విశాఖపట్నం జిల్లా నక్కపల్లి మండలం మత్యకార గ్రామమైన రాజయ్యపేటలో నూకతాత జాతరను మత్యకారులు ఘనంగా నిర్వహించారు. ప్రతిఏటా శివరాత్రి తరువాత రోజున ఈ పండుగను ఎంతో భక్తిశ్రద్దలతో జరుపుకోవడం ఆనవాయితీ. పూర్వీకుల నుండి అక్కడి మత్స్యకారులు నూకతాతను కులదైవంగా భావిస్తారు. గ్రామంలో నూకతాతకు ప్రత్యేకంగా ఆలయం నిర్మించి విగ్రహాన్ని కూడా ఏర్పాటు చేశారు. పూజలు చేస్తారు. శివరాత్రి తరువాత ఆలయంలోని విగ్రహాలను సముద్రస్నానానికి తీసుకువెళ్తారు. స్నానం అనంతరం విగ్రహలను పూజారులు తీసుకువచ్చే క్రమంలో వేలాదిమంది రోడ్డుపై పడుకుంటారు. దీన్నే సపం అని కూడా అంటారు. పడుకునే వారిపై నుంచి పూజారులు విగ్రహాలు పట్టుకుని తొక్కుకుంటూ వెళతారు. ఇలా చేస్తే ఈ ఏడాది అంతా తమ కష్టాలు గట్టెక్కుతాయని వారికి ప్రగాఢ విశ్వాసం.
కిలోమీటరు వరకు రోడ్డుపై పడుకుంటారు..
బోయపాడు సముద్రతీరం నుంచి రాజయ్యపేట ఆలయం వరకు భక్తులు పోటీ పడుతుంటారు. సుమారు 1 కిలోమీటరు మేర అన్ని వయసులవారు రోడ్డుపై పడుకుంటారు. తొలుత తీరంలో నూకతాత, నూకాలమ్మ, దుర్గాలమ్మ, సత్తెమ్మతల్లి, గంగమ్మతల్లి, శ్రీరాముల దేవతామూర్తులకు పుణ్యస్నానాలు జరిపిస్తారు. అనంతరం నిర్వహించే ‘సపం’ వారి సంప్రదాయానికి అద్దంపడుతుంది. భక్తులు తమ వెంట తెచ్చుకున్న వస్ర్తాలను రోడ్డుపై పరిచి, వాటిపై సాష్టాంగ పడతారు. మహిళా పూజారి వీరిపై నుంచి నడుచుకుంటూ వెళాతారు. మహిళా పూజారి పాదాలు తమ శరీరాన్ని తాకితే సముద్రంలో చేపల వేటకు వెళ్లినప్పుడు తమకు, తమ కుటుంబ సభ్యులకు ఆపద రాదని గంగపుత్రుల నమ్మకమని అంటున్నారు అక్కడి భక్తులు.
జాతరలో జంతుబలి నిషేధం..
ఇదే ఈ గ్రామంలో పెద్దపండుగ. వేర్వేరు చోట్ల ఉపాధి, విద్య కోసం వెళ్లినవారు సంక్రాంతికి వచ్చిన రాకపోయినా ఈ పండుగకు ఖచ్చితంగా వస్తారు. గ్రామాల్లో జంతుబలి సహజం. అయితే ఇక్కడ మాత్రం జంతుబలి నిషేధం. కేవలం పండ్లు, శెనగపప్పు నైవేద్యంగా సమర్పిస్తామని మత్స్యకారులు చెబుతారు. మూడురోజుల పాటు ఈ పండగను జరుపుకుంటారు. ఇదండీ రాజయ్యపేటలోని నూకతాత విశేష జాతర.
– ఖాజా, టీవీ9 తెలుగు, వైజాగ్.
Also read:
Suriya Sivakumar : గ్రాండ్‌గా సూర్య సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్.. గెస్ట్‌లుగా ఎవరంటే..
Radhe Shyam Trailer: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న రాధేశ్యామ్ ట్రైలర్..