ఆదిలాబాద్ జిల్లాలో అద్భుతం చోటు చేసుకుంది. శతాబ్దాల తర్వాత భైరందేవుడి నిజస్వరూపం సాక్షాత్కారమైంది. నిత్యసింధూరం తో నిండుగా కనిపించే మహా శివుడు వందల ఏళ్ల తర్వాత నిజ రూప దర్శనం ఇవ్వడంతో భక్తులు ఆలయానికి భారీ ఎత్తున క్యూ కట్టారు. అడవులజిల్లా ఆదిలాబాద్ లోని ఆదివాసీల కొంగు బంగారంగా కొలువ బడుతున్న కదిలే శివుడి మహత్యం ఇది.
ఆదిలాబాద్ జిల్లా బేల మండలం సదల్ పూర్ లోని భైరందేవ్, మహాదేవ్ ఆలయాన్ని 11వ శత్తాబ్దంలో నిర్మించారు. ఇక్కడ కొలవై ఉన్న భైరందేవ్ దేవుడి నిజస్వరూపం ఉహించుకోవడమే తప్ప ఇన్నేళ్లల్లో నిజరూపాన్ని దర్శించుకున్న వాళ్లు లేరు. 11 వ శతాబ్దంలో శాతవాహునులు ఈ ఆలయాన్ని నిర్మించినట్టు సమాచారం. 9 శతాబ్దాల నుండి సింధూరంతో మాత్రమే దర్శనమిచ్చే మహాదేవుడి నిజరూప దర్శనం కోసం భక్తులు పెద్ద ఎత్తున పూజలు చేస్తూ వచ్చారు. తాజాగా ఆ నిజరూప దర్శనం ఎట్టకేలకు లభించడంతో భక్తులు పెద్ద ఎత్తున ఆలయానికి చేరుకున్నారు.
మహాదేవ్ భైరందేవ్ ఆలయంలోని మూర్తికి భక్తులు ప్రతి ఏడాది జనవరి మాసంలో జరిగే జంగి జాతరలో చందనం పూతగా పూస్తారు. అలా శతాబ్దాల తరబడి చందనం రాయడంతో దేవుడి రూపం సింధూరమయవగా విగ్రహం తలపై భాగం దాదాపుగా మీటరు వరకు ఎత్తు పెరిగిపోయింది. తాజాగా బుధవారం సాయంత్రం సమయంలో ఒక్కసారిగా మీటరు పొడవైనా చందనం ఒక్కసారిగా కిందపడిపోయింది. దీంతో భైరందేవ్ దేవుడి నిజస్వరూపం బయటపడింది. ఇది గమనించిన ఆలయ పూజారి స్థానిక కమిటీ సభ్యులకు తెలియ జేసారు. భైరందేవ్ నిజ రూపం సాక్షాత్కారం అయిందన్న సమాచారం మండలంలోని అన్ని గ్రామాలకు పాకడంతో చుట్టూ పక్కల గ్రామాల నుండి భక్తులు పెద్ద ఎత్తున ఆలయానికి క్యూకట్టారు. నిజరూపాన్ని దర్శించుకుని ముగ్దులయ్యారు భక్తులు. త్వరలో ఆలయ కమిటీ ఆధ్వర్యంలో భైరందేవ్ దేవునికి అభిషేకం నిర్వహిస్తామని ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు.
ఈ భైరందేవ్, మహాదేవ్ ఆలయాలకు ఎంతో విశిష్ఠత ఉంది. ఆదిలాబాద్ జిల్లా కేంద్రం నుంచి సదల్‌పూర్ 42 కిలోమీటర్ల ఉన్న ఈ ఆలయం చుట్టు పచ్చని అడవి మద్య ప్రశాంత వాతవరణంలో కనిపిస్తుంది. ఈ ఆలయంలో శివుడు భైరవునిరూపంలో దర్శనమిస్తాడు. భైరందేవ్ ఆలయంలో ఆదివాసీల దేవతామూర్తులు ఉండగా.. మహదేవ్ ఆలయంలో శివలింగం దర్శనమిస్తుంది. ఈ రెండు ఆలయాలను 11 వ శతాబ్దంలో శాతవాహనులు నిర్మించారని చరిత్రకారులు చెపుతారు. ఈ ఆలయం పూర్తిగా నల్లరాతితో నిర్మించి శాతవాహనుల కళావైభవాన్ని గుర్తుకు తెస్తాయి. ఈ ఆలయాన్ని దర్శించుకున్న భక్తులు మనసులో ఏదైనా కోరుకుని భైరందేవ్ ఆలయంలోని లింగాన్ని పైకి ఎత్తాలి. ఆ కోరిక తీరేదైతే లింగం సులువుగా పైకి లేస్తుందని, లేదంటే కదలదని భక్తుల ప్రగాఢ నమ్మకం.
అటవీ ప్రాంతంలో ప్రకృతి ఒడిలో ఆహ్లాదమైన వాతావరణంలో ఉండే భైరందేవ్ మహాదేవులకు.. ఏటా పుష్యమాసంలో జాతర నిర్వహిస్తారు. అటవీ ప్రాంతంలో ఉండడంతో ఇక్కడ నిర్వహించే జాతరను జంగి జాతరగా పిలుచుకుంటారు ఇక్కడి స్థానికులు. శతాబ్దాలు ఒకే వంశం వారు పూజలు ప్రారంభించడం ఇక్కడి ఆనవాయితీ. అందులో భాగంగానే కొరంగే వంశీయులు తొలి పూజలు చేసి జంగి జాతరను ప్రారంభిస్తారు. వారం రోజుల పాటు జరిగే ఈ జాతరకు మహారాష్ట్ర , తెలంగాణ , చత్తీస్ ఘడ్ నుండి పెద్ద ఎత్తున భక్తులు తరలివస్తారు. వారం రోజుల పాటు కొనసాగి అమావాస్య రోజున ‘కాలదహి హండి’ పూజలతో జాతర ముగిస్తారు.
ఒక కుండలో పెరుగు వేసి.. అనంతరం ఆ కుండను పగలగొట్టి అందులోని పెరుగును కింద అప్పటికే ఉంచిన పాలు, కుడుకలు, అటుకులతో ఉన్న ప్రసాదంలో కలిసే విధంగా ఆలయ పై భాగంలో జెండా ఏర్పాటుచేస్తారు. అలా పెరుగుతో కలిసిన ఈ ప్రసాదాన్ని భక్తుల చేతులకు నేరుగా ఇవ్వకుండా ఆలయంపై నుంచి విసిరి వేస్తారు. అలా విసిరి వేయబడ్డ ప్రసాదాన్ని పోటీ పడి చేతిలో ఒడిసి పట్టి బంగారంగా బావించి స్వీకరిస్తారు భక్తులు. ఆ ప్రసాదం దక్కితే సంతానం లేనివారికి సంతాన భాగ్యం దక్కుతుందని.. కోరిన కోర్కేలు తీరుతాయని భక్తుల ప్రగాఢ నమ్మకం. తాజాగా శతాబ్దాల తర్వాత మహాదేవుడు నిజరూప దర్శనంతో వచ్చే ఏడాది జాతరను మరింత ఘనంగా నిర్వహిస్తామని సంతోషంగా చెప్తున్నారు ఆలయ కమిటి నిర్వహకులు.
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..