Idol Ganesha: 1700 కొబ్బరికాయలతో భారీ గణేశా.. దర్శనానికి పోటెత్తిన భక్తులు

| Edited By: Surya Kala

Sep 21, 2023 | 8:30 AM

పార్వతీపురం మన్యం జిల్లాలో వినాయక చవితి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. విభిన్న రూపాలతో నిర్వాహకులు ఏర్పాటు చేసిన వినాయక విగ్రహాలు, గణేష్ మండపాలు కనువిందు చేస్తున్నాయి. మన్యం జిల్లాలో ఏర్పాటు చేసిన నారికేళ వినాయకుడు అందరినీ ఆకర్షిస్తున్నాడు. ఆ నారికేళ వినాయకుడిని దర్శించుకునేందుకు భక్తులు బారులు తీస్తున్నారు. 

Idol Ganesha: 1700 కొబ్బరికాయలతో భారీ గణేశా.. దర్శనానికి పోటెత్తిన భక్తులు
Narikela Ganesha
Follow us on

పార్వతీపురం మన్యం జిల్లా కొత్తవలస, పెద్ద వీధిలో ఏర్పాటుచేసిన నారికేళ గణపతిని దర్శించుకునేందుకు భక్తులు పోటెత్తుతున్నారు. గత నలభై ఏళ్లుగా ప్రతి ఏటా ఒక్కో వినూత్న వినాయకుడిని ఏర్పాటు చేసే కొత్తవలస గ్రామస్తులు ఈ ఏడాది నారికేళ వినాయకుడిని ఏర్పాటు చేశారు. ప్రస్తుత పరిస్థితుల్లో కాలుష్యం పెరిగి పర్యావరణం దెబ్బతింటున్న పరిస్థితుల్లో ప్రకృతికి హని కలిగించవద్దనే సందేశం ఇస్తూ, మరో వైపు సృష్టిలో భగవంతుడికి ఇచ్చే పవిత్రమైన ప్రసాదంలో కొబ్బరికాయ కూడా ఒకటి కావడంతో ఈ ఏడాది ఇలా నారికేళ వినాయకుడిని ఏర్పాటు చేశారు నిర్వాహకులు. ఈ వినాయకుడిని ఏర్పాటు చేసేందుకు దాదాపు ఇరవై మంది యువకులు ఎంతో కష్టపడ్డారు. సుమారు 1700 కొబ్బరి కాయలతో పదిహేను అడుగుల ఎత్తుతో దాదాపు ఇరవై రోజుల పాటు నిరంతరం పనిచేసి నారికేళ గణపతిని సుందరంగా తీర్చిదిద్దారు. ఈ విగ్రహ తయారీ కోసం స్థానిక యువకులు అనేక ఇబ్బందులు పడ్డారు.

సుమారు 1700 కొబ్బరికాయలను ఒకదానికొకటి అమర్చి వినాయక రూపంగా మలిచేందుకు తల ప్రాణం తోకకు వచ్చింది. ఈ విగ్రహ తయారీ సమయంలో ఏ ఒక్క కొబ్బరికాయ విగ్రహం నుండి విడిపోయిన పూర్తి రూపం మారే అవకాశం ఉండటంతో చాలా జాగ్రత్తలు యువకులు చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సి వచ్చింది. అంతేకాకుండా విగ్రహాన్ని తయారు చేసిన ఇరవై రోజులు పాటు యువకులు అత్యంత నిష్ఠతో, భక్తిభావంతో పనిచేసి నారికేళ వినాయక విగ్రహన్ని దిగ్విజయంగా నిర్వహించారు. అలా కొత్తవలస పెద్ద వీధి యువకులు తయారుచేసిన నారికేళ వినాయక విగ్రహం జిల్లాలో ప్రత్యేక ప్రాధాన్యత సంతరించుకుంది.

ఈ వినాయకుడిని దర్శించుకునేందుకు పార్వతీపురం పట్టణంతో పాటు చుట్టు ప్రక్కల ప్రాంతాల నుండి కూడా భక్తులు పెద్దఎత్తున తరలివచ్చి నారికేళ గణపతిని భక్తి శ్రద్ధలతో దర్శించుకుంటున్నారు. అలా పెద్దఎత్తున వస్తున్న భక్తులకు ఎలాంటి ఇబ్బందులు జరగకుండా పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేశారు ఉత్సవ కమిటీ నిర్వాహకులు.

ఇవి కూడా చదవండి

అయితే ఎంతో సుందరంగా తయారుచేసిన నారికేళ గణపతికి సుమారు 21 రోజులపాటు ప్రత్యేక పూజలు చేయనున్నారు నిర్వాహకులు. అభిషేకంతో పాటు ప్రతి రోజు ఒక్కో రకమైన పూజలు నిర్వహిస్తున్నారు.. వినాయక దర్శనానికి వచ్చే భక్తులకు పూజలు అనంతరం తీర్థ ప్రసాదాల ఏర్పాట్లు చేస్తున్నారు కమిటీ సభ్యులు.. అంతేకాకుండా వినాయక నిమజ్జన కార్యక్రమాన్ని కూడా భారీ ఎత్తున జరపడానికి సిద్ధమవుతున్నారు నిర్వాహకులు. అందుకోసం తీన్మార్ డప్పులతో పాటు పెద్ద ఎత్తున కార్యక్రమాలు నిర్వహించారు. ఈ నారికేళ వినాయకుడిని దర్శించుకుంటే సకల శుభాలు జరుగుతాయని భక్తులు విశ్వసిస్తున్నారు.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..