Share Market: ఇదంటేనే ఒడిదొడుకుల వ్యవహారం.. రిస్క్ తీసుకునే ధైర్యం ఉంటే ఈ పని చేయండి
షేర్ మార్కెట్‌లో పెట్టుబడి అనేది వైకుంఠపాళీ ఆట లాంటిది. ఏ సమయంలో మనం పాముకు చిక్కుతామో.. ఏ సమయంలో నిచ్చెన ఎక్కి ఆఖరి మజిలీకి చేరుకుంటామో ఎవ్వరూ చెప్పలేరు..

షేర్ మార్కెట్‌లో పెట్టుబడి అనేది వైకుంఠపాళీ ఆట లాంటిది. ఏ సమయంలో మనం పాముకు చిక్కుతామో.. ఏ సమయంలో నిచ్చెన ఎక్కి ఆఖరి మజిలీకి చేరుకుంటామో ఎవ్వరూ చెప్పలేరు. అలాగే షేర్ మార్కెట్ కూడా.. ఎప్పుడు ఏ షేర్ అధిక లాభాలు తెచ్చిపెడుతుందో.. ఏ షేర్ నష్టాలు అందిస్తుందో.. ఎవ్వరూ అంచనా వేయలేరు. సరిగ్గా ఇదే అనుభవం స్వరూప్ అనే ఓ వ్యక్తికి జరిగింది. మరి అదేంటో చూసేద్దాం పదండి..
షేర్ మార్కెట్‌లో నవంబర్ ర్యాలీ అనంతరం.. స్వరూప్ తాను ఓ మంచి అవకాశాన్ని మిస్ చేసుకున్నానని అనుకున్నాడు. అన్నట్లు చెప్పడం మర్చిపోయాను.. ఒక నిర్ణీత కాలంలో స్టాక్స్, బాండ్స్ లేదా సూచీల ధరలలో నిరంతర పెరుగుదల ఉండటాన్ని ర్యాలీ(Rally) అని అంటారు. ఇలాంటి ధరల హెచ్చుతగ్గులు బుల్ లేదా బేర్ మార్కెట్ సమయంలో జరుగుతుంటుంది.
హా.! మనం అసలు ఏం మాట్లాడుకుంటున్నాం.. అవును! షేర్ మార్కెట్‌లో నవంబర్ ర్యాలీ మిస్ అయిందని బాధపడుతున్న స్వరూప్ కు నిపుణులు ఓ గుడ్ న్యూస్ అందించారు. ‘శాంతా ర్యాలీ’ పేరుతో డిసెంబర్‌లో ర్యాలీ కొనసాగుతుందని చెప్పారు. ఇది తెలిసిన వెంటనే న్యూఇయర్‌ను గ్రాండ్‌గా సెలబ్రేట్ చేసుకునేందుకు తాను దాచిపెట్టిన పొదుపు మొత్తాన్ని నిర్దేశిత సమయానికి షేర్ మార్కెట్‌లో ఇన్వెస్ట్ చేయాలనుకున్నాడు స్వరూప్ . కానీ అంతలోనే సీన్ కాస్తా రివర్స్ అయింది. డిసెంబర్ 23 నాటికి మార్కెట్ ఒక్కసారిగా కుదేలైంది. స్వరూప్ ఆశలను నీరుగార్చింది. సెన్సెక్స్, నిఫ్టీ 2 శాతం మాత్రమే క్షీణించినా.. స్వరూప్ ఇన్వెస్ట్ చేసిన షేర్లు మాత్రం దాదాపుగా 20 శాతం నష్టాలు తీసుకువచ్చాయి.
డిసెంబర్ 4వ వారం చివరి రోజు అంటే 23వ తేది నాటికి దాదాపు 120 షేర్లు 10 శాతం కంటే ఎక్కువ క్షీణించాయి. Nyka, Sona BLW, Aurobindo Pharma, Suntek Realtyతో పాటు సుమారు 25 షేర్లు 52 వారాల కనిష్ట స్థాయికి చేరుకున్నాయి. చైనాలో రోజురోజుకూ పెరుగుతోన్న కోవిడ్ కేసులు, దేశంలోని కరోనా అలెర్ట్ సంకేతాలు షేర్ మార్కెట్‌ను అతలాకుతలం చేశాయి.
2022లో, ప్రభుత్వ రంగ బ్యాంకులు పెట్టుబడిదారులకు అధిక లాభాలు తెచ్చిపెట్టే స్టాక్స్‌గా నిలిచాయి. కానీ ఏడాది చివరికి అవే సెన్సెక్స్ పతనానికి దారి తీశాయి. BSEలో అత్యధికంగా పడిపోయిన టాప్ 10 షేర్లు PSU బ్యాంకులవే.. దీని ద్వారా అవి ఇన్వెస్టర్లకు ఎంతలా నష్టాలు చేకూర్చాయో అంచనా వేయవచ్చు. PNB, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర 19-22 శాతం మేర క్షీణించాయి.
ఇది మాత్రమే కాదు, 2022లో అత్యంత విజయవంతమైన IPO, అదానీ విల్మార్ ఒక వారంలో 22 శాతం నష్టాలు చవి చూసింది. అయితే డిసెంబర్ 26న.. అంటే ఆ నెల చివరి వారం మొదటి రెండు రోజుల్లో మళ్లీ లాభాల బాట పట్టడంతో దాదాపుగా నష్టాల నుంచి బయటపడిందని చెప్పవచ్చు. అయితే ఇప్పుడు అందరిలోనూ 2023లో షేర్ మార్కెట్ పనితీరు ఎలా ఉంటుందన్నదే ప్రశ్న. బుల్స్ అండ్ బేర్స్ మధ్య యుద్ధం ఎలా ఉండబోతోందో.?
వడ్డీ రేట్ల పెరుగుదల, ప్రపంచ ఆర్ధిక మాంద్యం కారణంగా మార్కెట్ అస్థిరతను ఎదుర్కొంటోందని షేర్ ఇండియా వైస్ ప్రెసిడెంట్ రవి సింగ్ అంటున్నారు. అయితే, 2023 ప్రారంభంలో, షేర్ మార్కెట్ తిరిగి పుంజుకోవచ్చు. కానీ ఈ ఏడాది చివరి నాటికి మార్కెట్‌లో మళ్లీ ర్యాలీ ఉంటుందని ఆయన చెప్పారు. బ్యాంకింగ్, ఆటో, పవర్, ఫార్మా, మెటల్ వంటి రంగాలు మంచి పనితీరును కనబరుస్తాయని రవి సింగ్ అంచనా వేస్తున్నారు. అయితే షేర్ మార్కెట్‌లో పెట్టుబడి పెట్టాలనుకుంటున్నప్పుడు.. కచ్చితంగా మీరు ముందుగా మీకు తెలిసిన ఫైనాన్సియల్ ఎక్స్‌పర్ట్‌ను సంప్రదించండి.




