నరసాపురం ఎంపీ రఘరామ కృష్ణరాజుపై మరోసారి స్పీకర్‌కు ఫిర్యాదు చేసింది వైసీపీ. ఆ పార్టీ ఎంపీలు విజయసాయిరెడ్డి, మిథున్‌రెడ్డి, భరత్ స్పీకర్ ఓంబిర్లాను గురువారం కలిశారు. సవరించిన పిటిషన్‌ను ఆయనకు అందించారు. రఘురామ కృష్ణరాజు పార్టీ వ్యతిరేక కార్యకలాపాలపై ఆధారాలను ఇచ్చారు. వెంటనే అనర్హత వేటు వేయాలని వారు కోరారు. ఈ నెల 19 నుంచి పార్లమెంట్ సమావేశాలు ప్రారంభం కాబోతున్న వేళ వైసీపీ ఫిర్యాదు ప్రాధాన్యత సంతరించుకుంది.
వైయస్ఆర్‌సీపీ టికెట్ మీద నర్సాపురం నుంచి ఎంపీగా ఎన్నికై, పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారని ఫిర్యాదు చేశారు. వెంటనే రఘురామరాజు పార్లమెంటు సభ్యత్వాన్ని రద్దు చేయాలని కోరారు. రఘురామకృష్ణరాజు పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతూ చేసిన వ్యాఖ్యలపై గతంలోనే ఆధారాలను తాము లోక్ సభ స్పీకర్‌కు సమర్పించామని అనేక పర్యాయాలు డిస్ క్వాలిఫికేషన్‌కు సంబంధించి స్పీకర్‌ను కలిసి విజ్ఞప్తి చేశామని వారు పేర్కొన్నారు. రాజ్యాంగంలోని 10వ షెడ్యూల్ ప్రకారం పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టాన్ని అతిక్రమించిన రఘురామకృష్ణరాజును వెంటనే డిస్ క్వాలిఫై చేయాల్సిందిగా ఈరోజు మరోసారి లోక్ సభ స్పీకర్‌ను కలిసి విజ్ఞప్తి చేసినట్లుగా ఎంపీలు తెలిపారు.