Kakani: చంద్రబాబు చతికిలపడితే… జగన్ వచ్చి చకచకా చర్యలు తీసుకున్నారు : కాకాణి

రైతులకు పంట బీమా ఇవ్వలేక గత టీడీపీ ప్రభుత్వం చతికిలపడితే... పంట దిగుబడి తగ్గినా బీమా వచ్చేలా జగన్ చర్యలు తీసుకున్నారని వైసీపీ ఎమ్మెల్యే కాకాణి గోవర్థన్ రెడ్డి అన్నారు..

Kakani: చంద్రబాబు చతికిలపడితే... జగన్ వచ్చి చకచకా చర్యలు తీసుకున్నారు : కాకాణి
MLA Kakani

Updated on: Jul 09, 2021 | 8:32 PM

Crop Insurance: రైతులకు పంట బీమా ఇవ్వలేక గత టీడీపీ ప్రభుత్వం చతికిలపడితే… పంట దిగుబడి తగ్గినా బీమా వచ్చేలా జగన్ చర్యలు తీసుకున్నారని వైసీపీ ఎమ్మెల్యే కాకాణి గోవర్థన్ రెడ్డి అన్నారు. చంద్రబాబు హయాంలో మిల్లర్లతో చేతులు కలిపి రైతులను టీడీపీ నేతలు ముంచేశారని కాకాణి ఆరోపించారు. పంట బీమా గురించి మాట్లాడే అర్హత కూడా చంద్రబాబుకు లేదని కాకాణి గోవర్ధన్ రెడ్డి మండిపడ్డారు. తమ ప్రభుత్వం చేస్తున్న రైతు సంక్షేమంపై టీడీపీ అధినేత చంద్రబాబు అవాకులు చెవాకులు పేలుతున్నారని కాకాణి నెల్లూరులో మీడియాతో మాట్లాడుతూ ఆగ్రహం వ్యక్తం చేశారు.

తన అద్భుతమైన పరిపాలనతో దివంగత ముఖ్యమంత్రి వైయస్సార్ నిలిచిపోయారని… అందుకే వైయస్సార్ జయంతిని రైతు దినోత్సవంగా నిర్వహించామని కాకాణి చెప్పుకొచ్చారు. రైతులకు రుణమాఫీ చేయకుండా చంద్రబాబు దగా చేశారని విమర్శించారు. సీఎం వైయ‌స్ జగన్ మాత్రం రైతులను అన్ని విధాలా ఆదుకుంటున్నారన్నారు. రైతులను మోసం చేసిన చరిత్ర టీడీపీదని చెప్పిన వైసీపీ ఎమ్మెల్యే, వైసీపీ ప్రభుత్వంపై అసత్యాలను ప్రచారం చేయడాన్ని ఇకనైనా మానుకోవాలని హిత‌వు ప‌లికారు.

కాగా, రైతు సమస్యలపై ఏపీ ప్రభుత్వ విధానాలను తప్పుబడుతూ తెలుగుదేశం అధినేత చంద్రబాబు నిన్న ప్రకటన విడుదల చేసిన సంగతి తెలిసిందే. సాగునీటి ప్రాజెక్టులకు నిధులు పెంచాలని, రైతుభరోసా కింద 15వేల ఇవ్వడంతోపాటు రుణమాఫీ బకాయిలు చెల్లించాలని బాబు సదరు ప్రకటనలో డిమాండ్ చేశారు. గత ఏడాది నుంచి వరుసగా ఏడు విపత్తులు రావటంతో 37లక్షల ఎకరాల్లో పంట నష్టం జరిగి, 15వేల కోట్ల మేర రైతులు నష్టపోయారని చంద్రబాబు అన్నారు. పంటల బీమా ప్రీమియం చెల్లింపుపై అసెంబ్లీలో అసత్యాలు చెప్పి, తెలుగుదేశం నిలదీయడంతో అదేరోజు రాత్రి 590 కోట్ల ప్రీమియం చెల్లిస్తూ జీవో విడుదల చేశారని చంద్రబాబు విమర్శలు గుప్పించారు.

Read also: AP BJP: స్వార్థ ప్రయోజనాల కోసమే జల వివాదాల్ని సృష్టిస్తున్నారు : కర్నూలు సమావేశంలో బీజేపీ నేతల మండిపాటు