కొత్త పార్టీ ఏర్పాటులో బిజీగా ఉన్న వైయస్ షర్మిల.. కొంత కాలంగా తన కార్యాచరణలో స్పీడ్ పెంచారు. తెలంగాణలో రాజన్న రాజ్యం తెస్తామంటూ ప్రతినభూనిన షర్మిల ఆ దిశగా వేగంగా అడుగులు వేస్తున్నారు. వివిధ జిల్లాల్లోని వైయస్ అభిమానులతో నిత్యం భేటీ అవుతూ కొత్తపార్టీ ఏర్పాటు అభిప్రాయాలు సేకరిస్తున్నారు. వివిధ రంగాల్లో మేధావులతో చర్చలు జరుపుతూ పార్టీ విధివిధానాలను ఖరారు చేసే పనిలో పడ్డారు. పార్టీ జెండా, ఎజెండా తుది దశకు వచ్చినట్లు తెలుస్తుంది. ఈ నేపథ్యంలో పార్టీ ప్రకటనకు సంబంధించిన ఏర్పాట్లు కూడా ఓ వైపు వేగంగా సాగుతున్నాయి.
ఈ క్రమంలో వైఎస్ షర్మిల కడప జిల్లా పులివెందులలో పర్యటిస్తుండటం ప్రాధాన్యతను సంతరించుకుంది. కొత్త పార్టీ ఏర్పాట్లలో క్షణం తీరిక లేకుండా ఉన్న షర్మిల.. పులివెందుల వెళ్లడం చర్చనీయాంశంగా మారింది. పులివెందులలో తన బాబాయ్ వైఎస్ వివేకానందరెడ్డి వర్దంతి సభకు ఆమె హాజరుకానున్నారు షర్మిల.
అయితే సొంత కుంపటి ఏర్పాట్లలో సిద్దమైన తర్వాత తొలిసారిగా పులివెందులకు రానున్న షర్మిలపై స్థానిక వైసీపీ నాయకుల వైఖరి ఎలా ఉండబోతుందనే అంశం చర్చనీయాంశంగా మారింది. ఇక వివేకానందరెడ్డి వర్దంతి సభకు ఏపీ సీఎం వైయస్ జగన్ హాజరవుతారా లేదా అనే సందిగ్దత నెలకొంది. ఒక వేళ అన్నా చెల్లెళ్లు ఒకే చోట కలిస్తే ఇరువురి హావభావాలు ఎలా ఉండబోతున్నాయనే అంశం రాజకీయ వర్గాల్లో ఆసక్తిగా మారింది.
తను చేయబోయే ప్రతి పనికి తన తల్లి విజయమ్మ మద్దతు ఉందని షర్మిల స్పష్టం చేశారు. జగన్ ఆంధ్రప్రదేశ్ సంక్షేమాన్ని కోరితే.. తెలంగాణ కోడలిగా తాను తెలంగాణ సంక్షేమాన్ని కోరుతున్నానని గతంలోన ప్రకటించారు షర్మిల. తన సోదరుడు జగన్‌కు, తనకు మధ్య పార్టీపరమైన విభేదాలు తప్ప.. వ్యక్తిగతమైన విభేదాలు లేవని ఆమె క్లారిటీ ఇచ్చారు.
షర్మిల కొత్త పార్టీని వ్యతిరేకిస్తున్న వైసీపీ
అయితే ఆమె కొత్తపార్టీ పెట్టాలన్న నిర్ణయానికి వైఎస్ జగన్ మద్దతు ఉందా..? లేదా? అనే సస్పెన్స్ కు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గతంలోనే క్లారిటీ ఇచ్చింది. షర్మిల పెట్టబోయే పార్టీకి తమకు ఎలాంటి సంబంధం లేదని వైసీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి స్పష్టం చేశారు. పార్టీ ఏర్పాటు అనేది షర్మిల వ్యక్తిగత నిర్ణయమని సజ్జల తెలిపారు. తెలంగాణలో వైసీపీని విస్తరించాలన్న ఆలోచన జగన్ కు లేదని.. ఈ క్రమంలోనే ఇద్దరి మధ్య అభిప్రాయభేదాలు వచ్చాయన్నారు. పార్టీ వద్దని జగన్ చెప్పినా వినకుండా షర్మిల పార్టీ ప్రయత్నాలు చేస్తున్నారని క్లారిటీ ఇచ్చారు సజ్జల.
షర్మిల పార్టీ పెట్టాలని కొంతకాలంగా ప్రయత్నాలు సాగిస్తున్నారని.. ఈ క్రమంలో సీఎం జగన్ తో పాటు కుటుంబ సభ్యులు, సన్నిహితులు వద్దని వారించినా షర్మిల తన వ్యక్తిగత నిర్ణయానికి అనుగుణంగా నిర్ణయం తీసుకున్నారని సజ్జల రామకృష్ణారెడ్డి వెల్లడించారు. తెలంగాణలో ఏ రాజకీయ పార్టీకి తమ మద్దతు ఉండబోదని కుండబద్దలు కొట్టారు. పార్టీ ఏర్పాటులో వచ్చే లాభనష్టాలు, లోటుపాట్లు, ఇతర పార్టీల నుంచి వచ్చే ఒత్తుడులు ఇలా అన్ని అంశాలకు షర్మిలే బాధ్యత వహించాల్సి వస్తుందన్నారాయన. షర్మిల పార్టీ పెట్టినా ఏపీ ప్రయోజనాలే సీఎంకు ముఖ్యమని చెప్పారు.
పదవుల విషయంలో వైఎస్ జగన్ తో వచ్చి విభేదాల కారణంగానే షర్మిల పార్టీ పెడుతున్నారన్న వార్తలను సజ్జల కొట్టిపారేశారు. షర్మిలకు పదవి ఇస్తే కుటుంబ పాలన సాగుతోందన్న విమర్శలు వచ్చే అవకాశముందన్నారు. రాజకీయపరంగా ఇద్దరి మధ్య భిన్నాభిప్రాయాలు ఉండటం వల్లే ఈమె ఈ నిర్ణయం తీసుకున్నారన్నారు. కొత్తపార్టీ పెడితే వచ్చే అనవసర ఇబ్బందులెందుకని జగన్ అన్నారని.. తెలంగాణలో పాదయాత్ర చేసిన కారణంగా అక్కడ ప్రజల మద్దతుంటుందని వెళ్తానని షర్మిల స్పష్టం చేసినట్లు వెల్లడించారు.
Read More: కాసేపట్లో ఏపీ మున్సిపల్ ఎన్నికల లెక్కింపు.. 10 గంటల కల్లా తొలి ఫలితం వెలువడే అవకాశం
కొనసాగుతున్న మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్.. ఏపీ పురపాలికల్లో వైసీపీదే హవా..