(మహాత్మ కొడియార్, టీవీ9 తెలుగు, ఢిల్లీ బ్యూరో చీఫ్)
UP Assembly Election 2022: రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో ఉత్తర్ ప్రదేశ్ ప్రధాన రాజకీయ పార్టీల తీరు ఎవరికి వారే యమునా తీరే అన్న చందంగా మారింది. దేశంలో బీజేపీకి వ్యతిరేకంగా అన్ని పార్టీలను కూడదీసి బలమైన ఫ్రంట్ ఏర్పాటు చేసే దిశగా ఓవైపు ప్రయత్నాలు జరుగుతుంటే, కీలకమైన ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలో మాత్రం అందుకు పూర్తి భిన్నమైన పరిస్థితులు కనిపిస్తున్నాయి. బహుజన్ సమాజ్ పార్టీ(BSP) ఒంటరి పోరాటానికి సిద్ధపడడంతో మొత్తం రాష్ట్రంలో రాజకీయ సమీకరణాలు మారిపోనున్నాయి. ఇవి అంతిమంగా ఏ పార్టీకి లాభం చేస్తాయన్నది ఇప్పుడే కచ్చితంగా చెప్పలేకున్నా, అధికార బీజేపీకి మాత్రం ఈ పరిణామాలు ఊరట కల్గిస్తున్నాయి. ప్రభుత్వ వ్యతిరేక ఓటు ఒకే దిశలో ప్రయాణించకుండా చీలిపోవడం తమకు లాభించే పరిణామమని ఆ పార్టీ నేతలు భావిస్తున్నారు.
మాయావతి ‘సోలో’ రాగం
అసదుద్దీన్ ఓవైసీకి చెందిన ఎఐఎంఐఎం పార్టీతో బహుజన్ సమాజ్ పార్టీ పొత్తు పెట్టుకుంటుందని ప్రచారం జరిగింది. ఉత్తర్ ప్రదేశ్‌లో జనాభాలో ఎక్కువ సంఖ్యలో ఉన్న దళితులు, మైనారిటీలను ఈ పొత్తు ద్వారా ఏకం చేసి, ఓట్లు దండుకునే అవకాశం ఉందంటూ విశ్లేషణలు సైతం వినిపించాయి. కానీ ఈ ఊహాగానాలకు తెరదించుతూ బీఎస్పీ అధినేత్రి మాయావతి ట్వీట్ చేశారు. తాము యూపీలో మాత్రమే కాదు, ఉత్తరాఖండ్‌లో కూడా ఒంటరిగానే పోటీ చేస్తామని ఆమె స్పష్టం చేశారు. కేవలం పంజాబ్‌లో మాత్రమే శిరోమణి అకాలీదళ్ పార్టీతో పొత్తు పెట్టుకున్నామని, 117 స్థానాలున్న పంజాబ్ అసెంబ్లీలో అకాళీలతో పొత్తులో భాగంగా బీఎస్పీ 20 సీట్లలో పోటీ చేస్తామని ప్రకటించారు. ఇది మినహా మరే ఇతర రాష్ట్రంలో ఏ పార్టీతోనూ పొత్తులు లేవని మాయావతి తేల్చిచెప్పేశారు.
అత్త-అల్లుడు, ఓ విఫల ప్రయోగం
2019 లోక్‌సభ ఎన్నికల్లో యాంటీ-కాంగ్రెస్, యాంటీ-బీజేపీ మహా కూటమిని ఏర్పాటు చేసే క్రమంలో బీఎస్పీ-ఎస్పీ, మరికొన్ని చిన్న పార్టీలు కలిసి పోటీ చేశాయి. వీటిలో బీఎస్పీ 10 సీట్లు, సమాజ్‌వాదీ 5 సీట్లు గెలుపొందగా, బీజేపీ 62, మిత్రపక్షం అప్నాదళ్ 2 సీట్లు గెలుచుకుంది. రాహుల్ గాంధీ సీటును కోల్పోయి, కేవలం సోనియా గాంధీ మాత్రమే గెలిచి కాంగ్రెస్ పార్టీ 1 సీటుతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. రాష్ట్రంలో రెండు ప్రధాన రాజకీయ పార్టీలు మరికొన్ని పార్టీలను కలుపుకుని మహా కూటమి ఏర్పాటు చేసినా, బీజేపీని నిలువరించలేకపోవడంతో ఈ కూటమి ఒక విఫల ప్రయోగమని రెండు పార్టీలు ఒకే అభిప్రాయానికి వచ్చాయి. బెహెన్‌జీగా అందరితో పిలుపు అందుకునే మాయావతిని ములాయం సింగ్ యాదవ్ కొడుకైన అఖిలేశ్ యాదవ్ అత్తగా సంబోధిస్తుంటారు. ఈ క్రమంలో వీరిద్దరిని బువ(మేనత్త)-భతీజా(మేనల్లుడు) కాంబినేషన్‌గా వ్యవహరిస్తుంటారు. ఇద్దరు మాజీ ముఖ్యమంత్రుల కలయికతో ఏర్పడ్డ మహాఘట్బంధన్ ఒక తిరుగులేని బలమైన రాజకీయ కూటమి అవుతుందని అందరూ అంచనా వేశారు. కాకపోతే ఈ ప్రయోగం విఫలమవడంతో.. ఇప్పుడు అసెంబ్లీ ఎన్నికల్లో ఈ రెండు పార్టీల కలయిక ప్రస్తావనే లేకుండా పోయింది. పైపెచ్చు ఇప్పుడు ఒకరిపై ఒకరు మాటల దాడికి దిగుతున్నారు.
బీఎస్పీ సస్పెండ్ చేసిన ఐదుగురు ఎమ్మెల్యేలను అఖిలేశ్ యాదవ్ చేర్చుకోవడంతో, అసహనానికి గురైన మాయావతి, తాను బహిష్కరించిన నేతలను చేర్చుకుంటున్నారని మండిపడ్డారు. వారంతా ఏమాత్రం ప్రభావం చూపని నేతలేనని వ్యాఖ్యానించారు. ఇదే సమయంలో అఖిలేశ్ యాదవ్ కూడా తాము భావసారూప్యత కల్గిన చిన్నపార్టీలతో మినహా మరే పెద్ద పార్టీతోనూ పొత్తు పెట్టుకోవడం లేదని తెలిపారు. కొంత మంది బీఎస్పీ నేతలు తనతో ‘టచ్’లో ఉన్నారని మాయావతిని మరింత రెచ్చగొట్టే ప్రయత్నం చేశారు. ఉప్పు-నిప్పులా చిటపటలాడుతున్న బువా-భతీజాలను చూస్తుంటే మళ్లీ ఇప్పట్లో కలిసే ఛాన్స్ లేదని అర్థమవుతోంది.
కాంగ్రెస్.. గతించిన వైభవం
కాంగ్రెస్ పార్టీకి కంచుకోటలా ఉండే ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలో ఇప్పుడు కాంగ్రెస్ అగ్రనేతలు సొంత సీట్లు కాపాడుకోవడమే కష్టంగా మారింది. 2019 ఎన్నికల్లో రాహుల్ గాంధీ పోటీ చేసిన అమేఠీని కోల్పోయి కేవలం సోనియా గాంధీని గెలిపించిన రాయ్ బరేలీతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ఏ రాష్ట్రానికి లేనట్టు ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రాన్ని తూర్పు-పశ్చిమగా విడగొట్టి ఇద్దరు యువనేతలకు, అందులోనూ గాంధీ-నెహ్రూ కుటుంబ సభ్యురాలు ప్రియాంక గాంధీయే స్వయంగా ఇంచార్జి బాధ్యతలు చేపట్టినా ఏమాత్రం ఫలితం లేకపోయింది. బీజేపీకి వ్యతిరేకంగా ఉన్న రెండు ప్రధాన పార్టీల్లో ఏ ఒక్కటీ కాంగ్రెస్‌ను తమతో కలుపుకోడానికి సిద్ధంగా లేవు. కాంగ్రెస్‌తో పొత్తు గురించి అఖిలేశ్ యాదవ్‌ను ప్రస్తావిస్తే.. ఆ పార్టీ యూపీలో మరీ బలహీనంగా ఉందని, బీజేపీని ఎదుర్కొనే సత్తా లేదని వ్యాఖ్యానించారు. 2017 యూపీ ఆసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి 100 సీట్లు ఇచ్చామని, అయినా గెలవలేకపోయామని గుర్తుచేశారు. ఉత్తర్ ప్రదేశ్ ప్రజలు కాంగ్రెస్ పార్టీని ఎప్పుడో తిరస్కరించారని కూడా వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ పార్టీ నేతలు మాత్రం రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీని ప్రియాంక గాంధీయే నడిపిస్తారని, ఆమెయే తమ కెప్టెన్ అని చెబుతున్నారు. మొత్తమ్మీద యూపీలో ప్రధాన రాజకీయ పార్టీలన్నీ ఎవరికివారుగానే పోటీకి సిద్ధమవుతున్న వాతావరణం కనిపిస్తోంది.
Also Read..
హుజురాబాద్‌లో హీటెక్కిన రాజకీయం.. దూకుడు పెంచిన టీఆర్ఎస్, బీజేపీ.. సైలెంట్‌గా కాంగ్రెస్..!
T.Congress: తెలంగాణ కాంగ్రెస్‌లో పీసీసీ మంటలు.. నిప్పులు చెరుగుతున్న సీనియర్ నేతలు