పిల్లల ఆసుపత్రికి 5 ఎకరాలు.. సీనియర్ అధికారుల సమీక్షలో టీటీడీ ఈవో జవహర్‌రెడ్డి
ఇటీవల టీటీడీ బడ్జెట్‌లో తీసుకున్న నిర్ణయానికి అనుగుణంగా అధికారులు కార్యాచరణకు దిగారు. ఈ మేరకు తిరుపతిలో పూర్తిస్థాయిలో చిన్నపిల్లల ఆసుపత్రి నిర్మాణానికి..
ఇటీవల టీటీడీ బడ్జెట్‌లో తీసుకున్న నిర్ణయానికి అనుగుణంగా అధికారులు కార్యాచరణకు దిగారు. ఈ మేరకు తిరుపతిలో పూర్తిస్థాయిలో చిన్నపిల్లల ఆసుపత్రి నిర్మాణానికి అనువైన 5 ఎకరాల స్థలాన్ని గుర్తించాలని టిటిడి ఈవో డాక్టర్ కెఎస్.జవహర్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. తిరుపతిలోని టిటిడి పరిపాలనా భవనంలో గల సమావేశ మందిరంలో సోమవారం సీనియర్ అధికారులతో ఈవో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఈవో మాట్లాడుతూ శ్రీవారి దర్శనార్థం వచ్చే భక్తులకు పార్కింగ్ సమస్య తలెత్తకుండా తిరుపతిలోని అలిపిరిలో, తిరుమలలోని అనువైన ప్రాంతంలో మల్టీలెవల్ కార్ పార్కింగ్ ఏర్పాటు చేయాలని ఆదేశించారు.
తిరుమలలో భక్తులకు కనువిందు చేసేలా ముఖ్య కూడళ్లలో ఎత్తుగా పెరిగే బంతి పూల మొక్కలు పెంచాలన్నారు. అలిపిరి నడకమార్గంలో భక్తులు ఇబ్బందులు పడకుండా పైకప్పు నిర్మాణ పనులు కొనసాగించాలని సూచించారు. టిటిడి పరిధిలోకి తీసుకున్న ఆలయాల్లో రోజువారీ పాలనా వ్యవహారాలు నిర్వహించేందుకు సమగ్రమైన మార్గదర్శకాలు రూపొందించాలన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ధర్మప్రచారం చేసేందుకు వీలుగా నిర్దేశిత వ్యవధిలో ధర్మప్రచార రథాలు సిద్ధం చేయాలని సూచించారు.
టిటిడి విద్యాసంస్థల్లో బయోమెట్రిక్ అటెండెన్స్ అమలుకు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఎస్వీబీసీలో ఒక సంవత్సర కాలానికి అవసరమైన కార్యక్రమాలతో కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేయాలని ఎండిని కోరారు. టిటిడిలోని పాత రికార్డులను డిజిటైజేషన్ చేయాలన్నారు. సప్తగిరి మాసపత్రిక పాఠకాసక్తి పెంచేందుకు వీలుగా మంచి పండితులు, రచయితలతో వ్యాసాలు రాయించాలని సూచించారు. ఈ సమీక్షలో టిటిడి అదనపు ఈవో శ్రీ ఎవి.ధర్మారెడ్డి, జెఈవో శ్రీమతి సదా భార్గవి, సివిఎస్వో శ్రీ గోపినాథ్ జెట్టి, స్విమ్స్ డైరెక్టర్ డాక్టర్ బి.వెంగమ్మ, ఎఫ్ఏసిఏవో శ్రీ ఓ.బాలాజి, చీఫ్ ఇంజినీర్ శ్రీ రమేష్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో మరో భారీ ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే. చిన్నపిల్లలకు మరింత మెరుగైన వైద్య చికిత్సను అందించడానికి ఓ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిని తిరుపతిలో నిర్మించాలని గతంలో టీటీడీ నిర్ణయించింది. ప్రస్తుతం టీటీడీ ఆధ్వర్యంలో నడుస్తోన్న బాలాజీ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సర్జరీ, రీసెర్చ్ అండ్ రిహాబిలిటేషన్ ఫర్ డిజేబిల్డ్ (బర్డ్) ఆసుపత్రి భవనాల్లో తాత్కలికంగా ఈ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిని నిర్వహిస్తున్నారు. ఆసుపత్రి నిర్మాణం పూర్తయిన అనంతరం అందులోకి తరలించేలా గతంలో ప్రాథమికంగా నిర్ణయం తీసుకున్నారు.
చిన్న పిల్లల ఆస్పత్రి కోసం కంచి ట్రస్ట్ చిన్న పిల్లల ఆసుపత్రి వైద్య నిపుణుల సేవలు, సలహాలు తీసుకుంటున్నామని ఆయన వివరించారు. ఉత్తరాంధ్ర, తూర్పుగోదావరి జిల్లాల్లోని గిరిజన ప్రాంతాల పిల్లలకు బోన్ మారో సర్జరీలు ఎక్కువగా అవసరం అవుతున్నాయని గుర్తించినట్లు పేర్కొన్నారు. తిరుపతిలో చిన్న పిల్లల సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మాణం పూర్తయిన తరువాత.. రెండో దశ కింద విశాఖపట్నంలో కూడా అదే తరహా ఆసుపత్రిని నిర్మించేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఆసుపత్రి నిర్మాణం, వైద్య పరికరాలు, ఇతర వసతులకు సంబంధించి డీపీఆర్ రూపకల్పన బాధ్యతను వైద్య మౌలిక సదుపాయాల కార్పొరేషన్‌కు అప్పగించారు.
గతంలో టీటీడీ బోర్డు నిర్ణయం తీసుకున్న మేరకు ఆస్పత్రి నిర్మాణానికి కావాల్సిన ఐదెకరాల స్థలాన్ని వెంటనే గుర్తించాలని ఈవో జవహర్‌రెడ్డి అధికారులను ఆదేశించారు.
Read more:
న్యాయవాద దంపతుల హత్య కేసుపై హైకోర్టులో విచారణ.. మార్చ్ 15 కు వాయిదా వేసిన ధర్మాసనం