తెలంగాణాలోని ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. కాంగ్రెస్ బరిలో నుంచి తప్పించుకోవడంతో వార్ వన్‌సైడ్‌గా మారింది. పోటీలో ఉన్న అభ్యర్థుల గెలుపు లాంఛనమే. మొత్తం ఐదు స్థానాలకు టీఆర్ఎస్ నుంచి నలుగురు, ఎమ్ఐఎమ్ నుంచి ఒకరు పోటీ చేస్తున్నారు. కాగా.. సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరగనుంది. అనంతరం కౌంటింగ్ ప్రారంభమౌతుంది. అసెంబ్లీ కమిటీ హాల్ నెంబర్ వన్‌లో పోలింగ్ జరుగుతోంది.
అయితే.. ఈ ఉదయం తెలంగాణ భవన్‌లో మాక్ పోలింగ్ జరిగింది. అనంతరం టీఆర్ఎస్ ఎమ్మెల్యేలంతా బస్‌లో నేరుగా అసెంబ్లీ భవన్‌కు చేరుకున్నారు. టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ బస్సులో వచ్చి తన ఓటును వేశారు. ఆయనతో పాటు యువ ఎమ్మెల్యేలు కలిసి వచ్చారు. ఎన్నికలకు కాంగ్రెస్ బహిష్కరించింది. ఎవరూ ఓటు వేయవద్దని టీ కాంగ్రెస్ తమ ఎమ్మెల్యేలకు విప్ జారీ చేసింది. కాంగ్రెస్ పోటీలో లేకపోవడంతో ప్రథమ ప్రాధాన్య క్రమంలోనే టీఆర్ఎస్, మజ్లిస్ సభ్యులు గెలవడం ఖాయమైంది.