హుజురాబాద్ ఉపఎన్నికకు షెడ్యూల్ రావటంతో ఆ నియోజకవర్గంలో రాజకీయం వేడెక్కింది. మాజీ మంత్రి ఈటల రాజేందర్ రాజీనామాతో కరీంనగర్ జిల్లా హుజురాబాద్‌లో ఉపఎన్నిక అనివార్యమైంది. ఇక్కడ అక్టోబర్ 30న ఎన్నిక జరగనుంది. నవంబర్ 2న ఫలితాలు రానున్నాయి. అయితే ఇక్కడ ఇప్పటికే బిజెపి, టిఆర్ఎస్ ప్రచారాన్ని ప్రారంభించాయి. రాజీనామా చేసిన ఈటల వెంటనే ప్రచారాన్ని మొదలు పెట్టారు. పాదయాత్ర చేశారు కానీ ఈటల అనారోగ్యానికి గురి కావటంతో మధ్యలోనే ఆపేశారు. కొద్ది రోజుల విశ్రాంతి అనంతరం ప్రచారం పునప్రారంభించారు. ఆయనతోపాటు అయన భార్య ఈటల జమున కూడా ప్రచారం నిర్వహించారు.
ఇటు అధికార పార్టీ నుంచి ముందుగా పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్‌ను రంగంలోకి దింపారు. ఆయన మండలాల వారీగా సమావేశాలు నిర్వహించారు. ఈటల అనుచరులను తమవైపు తిప్పుకున్నారు. గంగులతోపాటు పలువురు మంత్రులు, చుట్టుపక్కల ఎమ్మెల్యేలు కూడా టీఆర్ఎస్ తరఫున ప్రచారం నిర్వహించారు. నియోజకవర్గ బాధ్యులుగా సీఎం కేసీఆర్ ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావును నియమించారు. సీఎం ఆదేశాలతో రంగంలోకి దిగిన హరీష్ రావు కుల సమీకరణలపై దృష్టి పెట్టారు. నియోజకవర్గంలోని అన్ని మండలాల్లో పర్యటిస్తూ ఆత్మీయ సమ్మేళనాలు నిర్వహించారు. తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న దళిత బంధు పథకాన్ని సీఎం కేసీఆర్ హుజురాబాద్ నియోజకవర్గం నుంచి ప్రారంభించారు. దాదాపు నాలుగు నెలల నుంచి టిఆర్ఎస్ నేతలు హుజురాబాద్ నియోజకవర్గంలోనే మకాం వేసి ప్రచారం వేశారు. ఈ క్రమంలోనే టీఆర్ఎస్ అభ్యర్థిగా విద్యార్థి విభాగం నేత గెల్లు శ్రీనివాస్ పేరును ప్రటించారు. హరీష్.. గెల్లు శ్రీనివాస్‌తో కలిసి నియోజకవర్గంలో విస్తృత ప్రచారం చేస్తున్నారు.
బిజెపి కూడా మండలాల వారిగా ఇంచార్జిలను నియమించింది. బూత్ కమిటీకి ప్రచార బాధ్యతలను అప్పగించింది. బిజెపి నేతలు జితేందర్ రెడ్డి, వివేక్ ఇక్కడే మకాం వేశారు. అక్టోబర్ 2న బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పాదయాత్ర హుజురాబాద్‌కు చేరుకోనుంది. ఆ రోజు బహిరంగా సభ నిర్వహించాలని బిజెపి భావిస్తోంది. హుజురాబాద్ కాంగ్రెస్ హడావుడి కనబడటం లేదు. ఆ పార్టీ ఇప్పటి వరకు ప్రచారం నిర్వహించలేదు. అభ్యర్థి ప్రకటించిన తర్వాతనే… ప్రచారం చేస్తామని కాంగ్రెస్ శ్రేణులు చెబుతున్నారు.
Read Also.. Huzurabad-Badvel ByPoll Date: హుజురాబాద్, బద్వేల్ ఉప ఎన్నికల షెడ్యూల్ విడుదల..
Huzurabad By Election: హుజూరాబాద్ నగారా మోగింది.. అంతా రెడీ.. ఏ పార్టీ అభ్యర్థులు ఎవరంటే..