ఆ కేసు విచారణ వేగవంతం చేయండి.. తెలంగాణ ప్రభుత్వానికి గవర్నర్‌ తమిళిసై లేఖ

|

Feb 24, 2021 | 2:52 PM

పెద్దపల్లి జిల్లాలో హైకోర్టు న్యాయవాద దంపతులు వామన్ రావు, నాగమణిల హత్యా ఘటన దేశవ్యాప్తంగా సంచలన సృష్టించిన విషయం..

ఆ కేసు విచారణ వేగవంతం చేయండి.. తెలంగాణ ప్రభుత్వానికి గవర్నర్‌ తమిళిసై లేఖ
Follow us on

పెద్దపల్లి జిల్లాలో హైకోర్టు న్యాయవాద దంపతులు వామన్ రావు, నాగమణిల హత్యా ఘటన దేశవ్యాప్తంగా సంచలన సృష్టించిన విషయం తెలిసిందే. ఈ కేసులో నిందితులను అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు తరలించారు పోలీసులు. ఇదే అంశంపై తాజాగా రాష్ట్ర గవర్నర్ తమిళిసై ప్రభుత్వానికి లేఖ రాశారు. ఈ ఘటనపై విచారణను వేగవంతం చేయాలని లేఖలో ప్రభుత్వాన్ని కోరారు. ఈ ఘటనపై సమగ్ర నివేదిక పంపాలని పేర్కొన్నారు.

మరోవైపు ఈ కేసుకు సంబంధించిన దర్యాప్తును పోలీసులు వేగవంతం చేశారు. ఈ కేసులో కారు, కత్తులు సరఫరా చేశారనే ఆరోపణలు ఎదుర్కొంటున్న బిట్టు శ్రీనుకు కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. దీంతో అతన్ని కరీంనగర్‌ జైలుకు పోలీసులు తరలించారు. ఇదే క్రమంలో వామన్ రావు దంపతుల హత్యకు వినియోగించిన కత్తులను తయారు చేసిన ముగ్గురు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

ఈ హత్య కేసులో కత్తులను సరఫరా చేయడంతో పాటు వారికి వాహనం కూడా సమకూర్చాడని, కుంట శ్రీనుతో కలిసి హత్యకు ప్లాన్ వేసినట్లు బిట్టు శ్రీనుపై ఆరోపణలు ఉన్నాయి. మరోవైపు హత్యకు వాడిన కత్తుల ఆచూకీ ఇప్పటికీ లభించలేదు. అయితే ఆ కత్తులను తయారు చేసిన ముగ్గురు వ్యక్తులు శ్రీను, బాబు, రఘులను మంథని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తాజాగా ఈ కేసు విచారణ వేగవంతం చేయాలని ప్రభుత్వానికి గవర్నర్‌ లేఖ రాయడం ప్రాధాన్యతను సంతరించుకుంది.

Read more:

హరీశ్‌రావు బ్యాటింగ్‌ అదుర్స్‌.. కేసీఆర్‌ క్రికెట్‌ టోర్నమెంటులో బ్యాట్‌ ఝలిపించిన ఆర్థిక మంత్రి