TDP Leader Dulipalla Narendra : అస్వస్థకు గురైన టీడీపీ మాజీ ఎమ్మెల్యే దూళిపాళ్ళ నరేంద్రను రాజమంఢ్రి సెంట్రల్ జైలు నుంచి కోవిడ్ పరీక్షల కోసం ప్రభుత్వ కోవిడ్ ఆసుపత్రికి జైలు అధికారులు తరలించారు. గత రాత్రి నుంచి నరేంద్ర జ్వరం, దగ్గుతో బాధపడుతున్నారని సన్నిహితులు చెబుతున్నారు. మరోవైపు సంగం డెయిరీ అక్రమాలపై నమోదైన కేసులో రిమాండ్‌లో ఉన్న సహకార శాఖ మాజీ అధికారి గురునాధంను కూడా కోవిడ్ పరీక్షలు కోసం ఆసుపత్రికి తరలించారు.
అయితే ఇటీవల గుంటూరు జిల్లా చింతలపూడిలోని ఆయన నివాసం వద్ద నరేంద్రను ఏసీబీ అధికారులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ధూళిపాళ్ల ప్రస్తుతం సంగం డెయిరీ ఛైర్మన్‌గా కొనసాగుతున్నారు. ఆ సంస్థలో అక్రమాలు జరిగాయనే ఆరోపణలతో ఆయనపై 408, 409, 418, 420, 465 సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు ఏసీబీ అధికారులు తెలిపారు. అంతేకాకుండా సీఆర్‌పీసీ సెక్షన్ 50(2) కింద నరేంద్ర సతీమణికి ఏసీబీ నోటీసులు జారీ చేసి, నాన్ బెయిలబుల్ కేసు చేశారు.
ఇదిలా వుంటే, తెలుగు దేశం పార్టీలో క్రియాశీలక నేతగా ఎదిగిన ధూళిపాళ్ల నరేంద్ర.. టీడీపీ పార్టీ నుంచి 5 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. పొన్నూరు నియోజకవర్గం నుంచి 1994 నుంచి 2019 వరకు ఎమ్మెల్యేగా సేవలందించారు. 2019 అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ నేతల కిలారి వెంకట రోశయ్య చేతిలో ఆయన ఓడిపోయారు. 1112 ఓట్ల తేడాతో పరాజయం పాలయ్యారు. అంతేకాదు 2010 నుంచి సంగం డెయిరీకి ఛైర్మన్‌గా ఉన్నారు.