న్యూఢిల్లీ : కేంద్ర ఎన్నికల సంఘం పోలింగ్ తేదీలను ప్రకటించడంతో దేశవ్యాప్తంగా ఎన్నికల వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. తెలుగు రాష్ట్రాల్లో పోలింగ్ తొలిదశలోనే పూర్తవుతుందని ఎన్నికల సంఘం ప్రకటించింది. ఆంధ్రప్రదేశ్ లో ఏప్రిల్ 11న అసెంబ్లీ ఎన్నికలతో పాటు లోక్ సభ ఎన్నికలు కూడా జరగనున్నాయి. ఇదే దశలో తెలంగాణలో కూడా లోక్ సభ ఎన్నికలు పూర్తవుతాయి. మార్చి 18న ఏపీ, తెలంగాణ రాష్ట్రాల ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కానుంది. మార్చి 25 నామినేషన్లకు చివరిరోజు కాగా, మార్చి 26న నామినేషన్లు పరిశీలిస్తారు. మార్చి 28వ తేదీన నామినేషన్ల ఉపసంహరణకు అవకాశం ఇచ్చారు. ఫలితాలు మాత్రం దేశవ్యాప్తంగా అన్ని దశల పోలింగ్ పూర్తయిన తర్వాత మే 23న విడుదల చేస్తారు. అయితే, తెలుగు రాష్ట్రాల్లో తొలి దశలోనే పోలింగ్ జరగనుండడంతో పార్టీలకు మిగిలింది నెలరోజుల సమయం మాత్రమే! ఇప్పటికే అభ్యర్థుల ఎంపికలో తలమునకలుగా ఉన్న ప్రధాన పార్టీలు వెనువెంటనే పూర్తిస్థాయిలో ప్రచారపర్వంలో దిగడానికి సమాయత్తం అవుతున్నాయి.