షర్మిల ఎంట్రీతో తమ పార్టీకే ఎక్కువ నష్టమని గ్రహించిన కాంగ్రెస్‌ నేతలు! షర్మిల వర్గంపై విమర్శలు డోసును పెంచిన రేవంత్‌ వర్గం!

తెలంగాణలో వైఎస్‌ షర్మిల పార్టీ ఇంకా పురుడు పోసుకోనేలేదు.. దాని రూపురేఖలు ఎలా ఉండబోతున్నాయో తెలియదు... ఎవరెవరు చేరబోతున్నారో అసలే తెలియదు.

షర్మిల ఎంట్రీతో తమ పార్టీకే ఎక్కువ నష్టమని గ్రహించిన కాంగ్రెస్‌ నేతలు! షర్మిల వర్గంపై విమర్శలు డోసును పెంచిన రేవంత్‌ వర్గం!
Follow us
Balu

| Edited By: Anil kumar poka

Updated on: Mar 03, 2021 | 4:12 PM

తెలంగాణలో వైఎస్‌ షర్మిల పార్టీ ఇంకా పురుడు పోసుకోనేలేదు.. దాని రూపురేఖలు ఎలా ఉండబోతున్నాయో తెలియదు… ఎవరెవరు చేరబోతున్నారో అసలే తెలియదు. సంప్రదింపుల దశలోనే ఉన్నప్పటికీ కొందరు ఉలిక్కిపడుతున్నారు. కొందరు గుంభనంగా ఉంటున్నారు. కొందరు గంభీరమైన ప్రకటనలు చేస్తున్నారు. తెలంగాణ ప్రజలు షర్మిల పార్టీని హృదయపూర్వకంగా స్వాగతిస్తారా అన్నది కూడా సంశయంగా ఉన్న ఇలాంటి సమయంలో కాంగ్రెస్‌పార్టీలోని కొందరు మాత్రం ఏదో జరగబోతున్నదనే ఆందోళనలో ఉన్నారు. అధికారపార్టీ టీఆర్‌ఎస్‌ మాత్రం షర్మిల పార్టీపై మొదట్లో కాసింత స్పందించినప్పటికీ ఇప్పుడసలు ఒక్క మాట కూడా మాట్లడటం లేదు.. వై.ఎస్‌. షర్మిల పార్టీ వల్ల తమకు వచ్చిన నష్టమేమీ ఉండదని తెలుసుకున్నరో ఏమో కానీ టీఆర్‌ఎస్‌ నేతలు పెద్దగా పట్టించుకోలేదు.. అలా ఇగ్నోర్‌ చేయడం చిన్న చితక పార్టీలను చూసి గులాబీదళం భయపడదన్న సంకేతం కావొచ్చు. అయితే కాంగ్రెస్‌ నేతలు మాత్రం విమర్శలతో దాడి చేస్తున్నారు. ఎప్పుడైతే జిల్లాల నేతలతో షర్మిల సమావేశాలు మొదలు పెట్టారో అప్పట్నుంచే కాంగ్రెస్‌ నేతలు విమర్శలు మొదలు పెట్టారు. తెలంగాణలో తమరి పెత్తనమేమిటని కాంగ్రెస్‌ ఎంపీ రేవంత్‌రెడ్డి సూటిగా, మరింత ఘాటుగా షర్మిలను ప్రశ్నించారు. ఇంతకు ముందు వీరిద్దరి మధ్య శత్రుత్వం ఉందా అంటే అదీ లేదు.

అలాగని నిన్నమొన్నటి వరకు షర్మిల, రేవంత్‌ మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేంత గొడవలేమీ లేవు. తెలంగాణలో షర్మిల పార్టీ పెడుతున్నట్టు ప్రకటించిన వెంటనే రేవంత్‌ స్వరం పెంచారు. తెలంగాణలో రాజన్న రాజ్యం తెస్తానంటూ రోజుకో జిల్లా నేతలతో సమావేశం పెడుతున్నారు షర్మిల. ఆమె పార్టీ పెడితే ఎవరికి నష్టం? ఎవరికి లాభం? అసలు షర్మిల నిజంగానే రాజన్న రాజ్యం తేవడానికే పార్టీ పెడుతున్నారా? లేక మరొకరి ప్రయోజనాల కోసమా? అన్నది ఇప్పటికైతే అంతుపట్టకుండా ఉంది. ఎవరికి వారు వ్యాఖ్యానాలు చేసుకుంటున్నారు. టీఆర్‌ఎస్‌ నేతలు మొదట్లో షర్మిల పార్టీపై ఎకసెక్కాలు చేశారు. తెలంగాణలో ఆంధ్రుల పార్టీనా అంటూ విమర్శలు చేశారు.. ఆ తర్వాత ఎందుకో సైలెంటయ్యారు.. ఇప్పుడు గులాబీనేతలెవ్వరూ షర్మిలమ్మను ఏమనడం లేదు.. కాంగ్రెస్‌ పార్టీలో కూడా మొదట చాలా మంది చాలా రకాలుగా విమర్శలు చేసినా వారు కూడా మౌనంగా ఉంటున్నారు. కానీ రేవంత్‌రెడ్డి వర్గం మాత్రం షర్మిల్‌పై దాడికి దిగుతోంది.. రేవంత్‌రెడ్డి కూడా సందర్భం వచ్చిన ప్రతీసారి షర్మిల పార్టీపై విమర్శలు ఎక్కుపెడుతున్నారు. ప్రస్తుతం తెలంగాణ రాజకీయాలలో రేవంత్‌రెడ్డి క్రియాశీల పాత్ర పోషిస్తున్నారన్నది నిజం! అయితే అనాదిగా కాంగ్రెస్‌పార్టీకి రెడ్డి సామాజికవర్గం అండగా నిలుస్తున్నది. నిజానికి ఆ పార్టీ నుంచి ముఖ్యమంత్రులైనవారిలో అత్యధికులు రెడ్డి సామాజికవర్గానికి చెందినవారే! దామోదరం సంజీవయ్య, పీ.వీ.నరసింహారావు, రోశయ్య వంటివారిని మినహాయిస్తే సీఎం పదవి చేపట్టినవారంతా రెడ్డి సామాజికవర్గానికి చెందినవారే! టీఆర్‌ఎస్‌ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి తెలంగాణలో రాజకీయంగా ప్రాధాన్యం తగ్గిందనే భావన రెడ్డి సామాజికవర్గానికి వచ్చింది.. కాంగ్రెస్‌లో ఫైర్‌బ్రాండ్‌ నేతలు కరువయ్యారనుకుంటున్న సమయంలో రేవంత్‌రెడ్డి వారికో ఆశాదీపంలా కనిపించారు. రేవంత్‌ కూడా ఈ సపోర్ట్‌ను బాగానే సద్వినియోగం చేసుకుంటున్నారు. షర్మిల తెలంగాణలో పాలిటిక్స్‌లో అడుగుపెడుతుండటంతో రేవంత్‌రెడ్డి వర్గంలో ఓ రకమైన ఆందోళన మొదలయ్యింది. రెడ్డి సామాజికవర్గంలో సింహభాగం షర్మిల వెంట వెళతారేమోనన్న అనుమానం మొదలయ్యింది. ఇప్పటికే రెడ్డి సంఘాల జేఏసీ షర్మిలకు మద్దతు ప్రకటించింది.. కొందరు ప్రముఖులు కూడా షర్మిలకు బాహాటంగానే మద్దతు పలికారు. ఇదంతా గమనించిన రేవంత్‌ రెడ్డి వర్గం అప్రమత్తమయ్యింది. తెలంగాణలో షర్మిలకు ఏం పని అంటూ దాడికి దిగడం మొదలు పెట్టింది. దీంతో తెలంగాణలో రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి.. ఇదే సమయంలో కొందరు కాంగ్రెస్‌ నేతలు షర్మిల పార్టీలో చేరడానికి ఉత్సాహపడుతుండటం కూడా రేవంత్‌వర్గంలో కలవరం పుట్టిస్తోంది. టీపీసీసీ అధికార ప్రతినిధి ఇందిరాశోభన్‌ కూడా కాంగ్రెస్‌కు రాజీనామా చేశారు. ఆమె షర్మిలను కలిసి వచ్చారు కూడా ! షర్మిల పార్టీ వల్ల ఎక్కువగా నష్టపోయేది తమ పార్టీనేనని కాంగ్రెస్‌ నేతలు గ్రహించారు. ఈ నేపథ్యంలోనే రెండు వర్గాల మధ్య మాటల యుద్ధం మొదలయ్యింది. విమర్శలు కూడా చేసుకుంటున్నాయి. ఎంత వరకు వెళ్లాయంటే తమ నాయకురాలు రాజకీయంగా ఎదుగుతుండడాన్ని రేవంత్‌ తట్టుకోలేకపోతున్నారని షర్మిల అనుచరుడు తూడి దేవేందర్‌రెడ్డి మండిపడేంత వరకు..! షర్మిలపై రేవంత్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తూనే రేవంత్ కాంగ్రెస్‌లో ఎన్ని రోజుల క్రితం చేరారో అందరికీ తెలుసంటూ విమర్శించారు దేవేందర్‌రెడ్డి. ఇక వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి పేరును రేవంత్‌ వాడుకోవాలని చూస్తున్నారంటూ షర్మిల వర్గం ఆరోపిస్తోంది. రేవంత్‌ రెడ్డి సైన్యం ఏమైనా తక్కువ తిందా! షర్మిల ప్రధాన అనుచరుడు కొండా రాఘవరెడ్డి కేంద్రంగా విమర్శల దాడి కొనసాగిస్తోంది రేవంత్‌ వర్గం. సోషల్‌ మీడియాలో కొండాకు వ్యతిరేకంగా పోస్టులు పెడుతూ టార్గెట్‌ చేస్తోంది. అంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి జన్‌ కృష్ణా జలాల విషయంలో తెలంగాణకు అన్యాయం చేస్తున్నారని, ఆ అన్యాయాన్ని తాను ఎదుర్కొంటానని కర్నూలు కొండారెడ్డి బురుజు దగ్గర మాట ఇచ్చి తెలంగాణలో అడుగు పెట్టాలంటూ రేవంత్‌ వ్యాఖ్యానించారు. ఇదే సమయంలో రేవంత్ సైన్యం పేరిట తనకు బెదిరింపు ఫోన్‌ కాల్స్, మెసేజ్‌లు వస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు కొండా రాఘవరెడ్డి. భౌతిక దాడులు తప్పవంటూ వాట్సాప్‌లో తనకు వచ్చిన మెసేజ్‌ను మీడియాకు చూపించారు. తనకు వస్తుందన్న బెదిరింపులపై కొండా రాఘవరెడ్డి సీరియసవుతున్నారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి పేరును వాడుకోవాలని కాంగ్రెస్‌ నేత రేవంత్ అనుకున్నారని, అయితే షర్మిల రాకతో ఇబ్బందిగా మారిందని పరోక్షంగా కొండా వ్యాఖ్యానించారు. టీడీపీలో ఉన్నప్పుడేమో వైఎస్ రాజశేఖర్ రెడ్డిని దూషించి.. ఇప్పుడు పొగుడుతున్నారని అన్నారు. రాబోయే రోజుల్లో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఉండదని కొండా అన్నారు. కాంగ్రెస్‌ను దెబ్బతీయడానికి కేసీఆర్‌ వదిలిన బాణమే షర్మిల అని రేవంత్‌ అనడం, అందుకు ప్రతిగా షర్మిల వర్గం గట్టిగానే జవాబివ్వడం చూస్తుంటే రాబోయే రోజుల్లో రెండు వర్గాల మధ్య మాటలయుద్ధం మరింత పెరిగే అవకాశం కనిపిస్తోంది.

మరిన్ని ఇక్కడ  చదవండి :

ఎమర్జెన్సీ పై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ వ్యాఖ్య, అపహాస్యం చేసిన బీజేపీ, ఇన్నాళ్లకు నోరు విప్పారని విమర్శ

AMMK-BJP Friendship: తమిళనాట రంజుగా రాజకీయం.. అన్నా డిఎంకేపై బీజేపీ గుస్సా.. చిన్నమ్మతో చెలిమికి ఛాన్స్!