పంజాబ్ సీఎం అమరీందర్ సింగ్, కాంగ్రెస్ నేత నవ్‌జ్యోత్ సింగ్ సిద్ధు మధ్య వివాదం మరింత ముదురుతోంది. అమరీందర్ సింగ్‌తో ఢీ అంటే ఢీ అంటున్నారు సిద్ధు. అమరీందర్ సింగ్ తీరుపై ఆయన మరోసారి బహిరంగ విమర్శలు చేశారు. తాను కాంగ్రెస్ పార్టీని వీడి ఆమ్ ఆద్మీ పార్టీలో చేరే ప్రయత్నాల్లో ఉన్నట్లు ఇటీవల అమరీందర్ సింగ్ చేసిన వ్యాఖ్యలను సిద్ధు తిప్పికొట్టారు. కాంగ్రెస్ పార్టీని వీడి మరో పార్టీలో చేరేందుకు తాను ఏ పార్టీ నాయకుడినైనా కలిసినట్లు నిరూపించాలంటూ సిద్ధు సవాల్ చేశారు. పదవుల కోసం పాకులాడే నైతం తనది కాదన్నారు. తాను ఎప్పుడూ ఎవరినీ ఎలాంటి పదవులూ అడగలేదని చెప్పారు. అయితే మంత్రి పదవులు వాటంతట అవే తనను వెతుక్కుంటూ వచ్చాయని..అయితే తాను చాలాసార్లు వాటిని తిరస్కరించినట్లు చెప్పుకొచ్చారు. పంజాబ్ అభ్యున్నతే తనకు ముఖ్యమని అమృతసర్ ఎమ్మెల్యే సిద్ధు వ్యాఖ్యానించారు.
ఇప్పుడు పార్టీ హైకమాండ్ పంజాబ్ కాంగ్రెస్‌లో వ్యవహారాలపై దృష్టిసారించినట్లు సిద్ధూ పరోక్ష వ్యాఖ్యలు చేశారు. హైకమాండ్ దృష్టి సారించింది…కాస్త ఆగండని వ్యాఖ్యానించారు. పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ వాద్రాలతో తాను కలిసున్న ఫోటోలతో కూడిన వీడియోను సిద్ధు ట్వీట్ చేశారు. తద్వారా తాను కాంగ్రెస్ పార్టీని వీడే ప్రసక్తే లేదంటూ సిద్ధు స్పష్టమైన సంకేతాలిచ్చారు.
Prove one meeting that I have had with another Party’s leader ?! I have never asked anyone for any post till date. All I seek is Punjab’s prosperity !! Was invited & offered Cabinet berths many times but I did not accept
Now, Our Esteemed High Command has intervened, Will wait… pic.twitter.com/bUksnEKMxk— Navjot Singh Sidhu (@sherryontopp) May 22, 2021
అమరీందర్ సింగ్, సిద్ధు ఇద్దరి మధ్య చాలాకాలంగానే పొసగడంలేదు. 2019లో అమరీందర్ సింగ్ కేబినెట్ నుంచి వైదొలగిన సిద్ధు…అమరీందర్ సింగ్ వ్యవహార శైలి సరిగ్గా లేదంటూ అవకాశం దొరికినప్పుడల్లా బహిరంగ విమర్శలు చేస్తున్నారు. కాంగ్రెస్ అధిష్టానం వారిద్దరి మధ్య రాజీకుదిర్చేందుకు ప్రయత్నిస్తోందన్న ఊహాగానాల నేపథ్యంలో వారిద్దరు మార్చి మాసంలో భేటీ అయ్యారు. దీంతో సిద్ధును మళ్లీ కేబినెట్‌కు తీసుకోవచ్చన్న ప్రచారం జరిగింది. సిద్ధు తిరిగి రాష్ట్ర మంత్రివర్గంలో చేరుతారని స్వయంగా అమరీందర్ సింగ్ ఆశాభావం వ్యక్తంచేశారు. అయితే సిద్ధు మంత్రి పదవికి దూరంగా ఉంటూనే అమరీందర్ సింగ్‌పై అవకాశం దొరికినప్పుడల్లా విమర్శలదాడిని కొనసాగిస్తున్నారు.
గతంలో బీజేపీలో ఉన్న సిద్ధు..2017 అసెంబ్లీ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ తీర్థంపుచ్చుకున్నారు. కాంగ్రెస్ పార్టీలోనూ సిద్ధు ఇమడలేకపోతున్నారని రాజకీయ పండితులు అభిప్రాయపడుతున్నారు. మరో ఏడాదిలో పంజాబ్ అసెంబ్లీకి ఎన్నికలు వస్తుండటంతో అమరీందర్ సింగ్, సిద్ధు మధ్య వివాదాన్ని ఎలా పరిష్కరించాలో తెలీక కాంగ్రెస్ అగ్రనేతలు తలలు పట్టుకుంటున్నారు.
ఇవి కూడా చదవండి..‘దీదీ లేకుండా బతకలేను,….బీజేపీలో చేరి తప్పు చేశా..’ మాజీ తృణమూల్ కాంగ్రెస్ ఎమ్మెల్యే సోనాలి గుహ ఆవేదన
సీన్‌లోకి ఎంటర్ అయిన ట్రబుల్ షూటర్ మంత్రి హరీష్ రావు.. హుజూరాబాద్ ఆపరేషన్ షురూ..!