తెలంగాణలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల వేడి రాజుకుంది. ఇక రేపో మాపో నాగార్జున సాగర్ ఉపఎన్నికకు నోటిఫికేషన్ రానుంది. నాగార్జునసాగర్ ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య అకాల మరణంతో అక్కడ ఉపఎన్నిక అనివార్యమయ్యింది. ఈ నేపథ్యంలో ప్రధాని రాజకీయ పార్టీలకు వరుస ఎన్నికలు సవాల్‌గా మారాయి. నాగార్జున సాగర్ ఉప ఎన్నికకు షెడ్యూల్ రాకముందే.. అన్ని పార్టీలు వ్యూహల రచనలో బిజీ అయ్యాయి. బలమైన అభ్యర్థుల కోసం కసరత్తు చేస్తున్నాయి. దుబ్బాక ఉపఎన్నిక, జీహెచ్‌ఎంసీ ఫలితాలతో ఊపు మీదున్న బీజేపీ నాగార్జునసాగర్ ఉప ఎన్నికపై స్పెషల్ ఫోకస్ పెట్టింది. సాగర్‌లో కాషాయ జెండా ఎగిరేసేందుకు పావులు కదుపుతోంది. తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ కి నాగార్జున సాగర్ ఉపఎన్నిక అసల సిసలు పరీక్ష కానుంది.
ఇటీవల జరిగిన దుబ్బాక ఉపఎన్నికల్లో బీజేపీ విజయానికి అభ్యర్థి రఘునందన్ రావు చెమటోడ్చారు. ఆయనకున్న యూత్ ఫాలోయింగ్, వాగ్దాటి.. ప్రజా సమస్యలపై ఉన్న పట్టుతో దుబ్బాకలో విజయం సాధించారు. ఇక జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకతే బీజేపీకి ప్లస్‌గా మారింది. అందుకే 48 డివిజన్లలో విజయం సాధించిందని రాజకీయ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. కానీ నాగార్జున సాగర్‌లో పరిస్థితి పూర్తిభిన్నమైనది. అక్కడ బీజేపీలో పేరు మోసిన నేతలెవరూ లేరు. దుబ్బాకలో గెలిచినంత ఈజీగా.. హైదరాబాద్‌లో కారు ఢీకొట్టినంత అలవోకగా.. సాగర్ ఎన్నికలు ఉండబోవు. అందుకే ఈ ఎన్నిక బండి సంజయ్ నాయకత్వానికి అసలు సిసలు పరీక్షగా ఉండబోతోందనే చర్చ బీజేపీలోనూ సాగుతుంది.
అయితే సాగర్ ఉప ఎన్నికలో పోటీ చేసేందుకు బీజేపీలో అప్పుడే టికెట్ల లొల్లి మొదలయింది. ఆ పార్టీ నుంచి నలుగురు నేతలు టికెట్‌ను ఆశిస్తున్నారు. జిల్లా బీజేపీ అధ్యక్షుడు శ్రీధర్ రెడ్డి భార్య కంకణాల నివేదితా రెడ్డి, బీసీ నేత కడారి అంజయ్య యాదవ్, ఇటీవలే పార్టీలో చేరిన ఇంద్రసేనా రెడ్డితో పాటు మరో నేత కూడా రేసులో ఉన్నట్లు తెలుస్తుంది. నోటిఫికేషన్ రాకపోయినప్పటికీ టికెట్ మీద ఆశతో ఎవరికి వారు పాదయాత్రలతో ప్రచారంలో బిజీగా ఉన్నారు. వీరిలో టికెట్ ఎవరికి వస్తుందో క్లారిటీ లేక, ఎవరికి మద్దతు ఇవ్వాలో తెలియక బీజేపీ కార్యకర్తలు తలలు పట్టుకుంటున్నారట.. ఇప్పటికే బీజేపీ అధిష్టానం నేతల బలాలు, బలహీనతలపై సర్వే కూడా చేయించినట్లు తెలుస్తుంది.
ఈ నేపథ్యంలో తమకు టికెట్ రాకపోతే బీజేపీకి గుడ్‌బై చెబుతామని నివేదితా రెడ్డి దంపతులు తమ అనుచరులతో చెప్పారట. స్వార్థపరులకు టికెట్ ఇస్తే.. ఆ మరుక్షణమే పార్టీ నుంచి బయటకొస్తామని స్పష్టం చేసినట్లు తెలిసింది. ఈ క్రమంలోనే బండి సంజయ్ రంగంలోకి పరిస్థితిని చక్కదిద్దేందుకు ప్రయత్నిస్తున్నారు. పాదయాత్రలతో బిజీగా ఉన్న ఆశావహులకు ఫోన్ చేసి.. ఇక చాలు.. ఆపేయమని చెప్పినట్లు తెలుస్తోంది. అభ్యర్థి పేరును ప్రకటించే వరకు ఆగాలని ఆదేశించినట్లు సమాచారం. ఒకవేళ మీకు టికెట్ కన్ఫర్మ్ అయ్యాక.. మిగతా అభ్యర్థులు మద్దతుగా ఉండాలంటే.. వెంటనే ఈ పనులు అపాలని గట్టిగా చెప్పినట్లు ప్రచారం జరుగుతోంది.
ఇక కాంగ్రెస్ నుంచి జానారెడ్డి బరిలోకి దించాలని ఆ పార్టీ నిర్ణయించింది. టీఆర్ఎస్ పార్టీ ఇంకా అభ్యర్థిని ప్రకటంచలేదు. నోముల నర్సింహయ్య తనయుడు నోముల భగత్‌కు టికెట్ ఇస్తారని ప్రచారం జరుగుతోంది. కానీ ఆయన అభ్యర్థిత్వంపై టీఆర్ఎస్ పెద్దలు ఆసక్తి చూపడం లేదని సమాచారం. ఇక స్థానికంగా ఉంటున్న కోటిరెడ్డికి ఇవ్వాలని మంత్రి జగదీష్ రెడ్డి ప్రయత్నాలు చేస్తున్నారట. మరోవైపు నోములకు బంధువైన ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి సంఘం నేత బాలరాజు యాదవ్ సైతం తన ప్రయత్నాలు మెదలు పెట్టినట్లు సమాచారం.
అయితే అభ్యర్థులపై ఇప్పటికే సర్వే చేయించిన అధిష్టానం ఎవరికి టికెట్ ఇస్తుంది? అనే అంశంపై స్పష్టత రావాలంటే మరికొద్ది రోజులు ఆగాల్సిందే.
Read More:
తెలంగాణ సంక్షేమ పథకాలు ఆ రాష్ట్రాల్లో ఎందుక లేవో అడగండి.. ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో మంత్రులు