మెగా బ్రదర్, సినీ నటుడు నాగబాబు రాజకీయాల్లోకి రానున్నారు. తన తమ్ముడు పవన్ కల్యాణ్ పార్టీ జనసేనలోకి వెళ్లనున్న ఆయన.. నర్సాపురం నియోజకవర్గం నుంచి ఎంపీగా పోటీ చేయబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. పవన్‌ను ఇటీవల కలిసిన నాగబాబు ఈ అంశంపై చర్చించినట్లు తెలుస్తోంది. గతంలో ఈ స్థానం నుంచి జనసేన తరపున కారటం రాంబాబు పోటీ చేస్తారని వార్తలు వచ్చినా.. ఇప్పుడు ఆ స్థానం తన సోదరుడికి ఇచ్చేందుకే పవన్ సముఖత వ్యక్తం చేస్తున్నట్లు సమాచారం. ఆ నియోజకవర్గంలో జనసేన గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తుండగా.. అందుకోసం నాగబాబును పవన్ బరిలోకి దింపనున్నారని టాక్.
ఇదిలా ఉంటే జనసేనను ఏర్పాటు చేసిన తరువాత తొలిసారిగా ఆ పార్టీ తరపున అభ్యర్థులను బరిలోకి దింపబోతున్నారు పవన్ కల్యాణ్. ఇందుకోసం కొంతమంది అభ్యర్థులను ఇప్పటికే ఖరారు చేసినట్లు సమాచారం. కాగా ఏప్రిల్ 11న ఏపీలో ఎన్నికలు జరగబోతున్నాయి. రోజురోజుకు మారుతున్న రాజకీయ సమీకరణాల దృష్ట్యా అక్కడ ఏ పార్టీ అధికారంలోకి వస్తుందోనని అందరిలో ఆసక్తి నెలకొంది.