Council Polls: ఏపీ, తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికలు ఆసక్తికరం.. మండళ్ళలో నెమ్మదిగా మారుతున్న సమీకరణాలు

తెలుగు రాష్ట్రాల్లో ఇపుడు ఎమ్మెల్సీ ఎన్నికల హడావిడి కనిపిస్తోంది. ఏపీలో మునిసిపల్ ఎన్నికల సందడి డామినేట్ చేస్తుండగా.. ఎమ్మెల్సీ ఎన్నికల హవా పెద్దగా లేదు.

Council Polls: ఏపీ, తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికలు ఆసక్తికరం.. మండళ్ళలో నెమ్మదిగా మారుతున్న సమీకరణాలు
Follow us
Rajesh Sharma

|

Updated on: Mar 10, 2021 | 5:53 PM

MLC elections in Telugu states raising curiosity: తెలుగు రాష్ట్రాల్లో ఇపుడు ఎమ్మెల్సీ ఎన్నికల హడావిడి కనిపిస్తోంది. ఏపీలో మునిసిపల్ ఎన్నికల సందడి డామినేట్ చేస్తుండగా.. ఎమ్మెల్సీ ఎన్నికల హవా పెద్దగా లేదు. కానీ తెలంగాణలో ప్రధాన రాజకీయ పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం రక్తి కడుతోంది. ఏపీలో రెండు ఉపాధ్యాయ నియోజకవర్గాల ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరుగుతుండగా.. రాజకీయ పార్టీల ప్రమేయం పెద్దగా లేదు. దాంతో ఏపీలో మునిసిపల్ ఎన్నికల సందడే ఎక్కువగా కనిపిస్తోంది. అయితే.. రెండు రాష్ట్రాల్లో రెండేసి ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరుగుతుండడంతో శాసన మండళ్ళలో ఏ మేరకు బలాబలాల్లో మార్పు వస్తుందన్నది ఇపుడు చర్చగా మారింది.

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో 80వ దశకంలో రద్దైన శాసన మండలి.. దివంగత వైఎస్ రాజశేఖర్ రెడ్డి సీఎంగా వున్నప్పుడు పునరుద్దరణ జరిగింది. 2007లో ఉమ్మడి ఏపీలో శాసన మండలి తిరిగి ఏర్పాటైంది. ఆ తర్వాత దాదాపు ఏడేళ్ళ తర్వాత ఉమ్మడి ఏపీ శాసనమండలి రెండుగా విభజితమై ఏపీ, తెలంగాణ శాసన మండళ్ళుగా ఏర్పడ్డాయి. ఏపీ మండలిలో మొత్తం స్థానాలు 58 కాగా.. తెలంగాణలో ఈ సంఖ్య 40. ఏపీలో ఆరు సీట్లు ఖాళీ అవుతుండగా.. ఆరుగురు వైసీపీ నేతలు ఎమ్మెల్యే కోటాలో పోటీ చేయడంతో వారి ఎన్నిక ఏకగ్రీవం అయినట్లు ప్రకటించింది ఎన్నికల సంఘం. అదే సమయంలో తెలంగాణలోని రెండు పట్టభద్రుల నియోజకవర్గాల ఎమ్మెల్సీ ఎన్నికలు హోరాహోరీగా జరుగుతున్నాయి.

మహబూబ్ నగర్ – రంగారెడ్డి – హైదరాబాద్ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థాన ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతోంది. మాజీ ప్రధాని పివి నరసింహరావు కుమార్తె వాణిదేవి టీఆర్ఎస్, కాంగ్రెస్ సీనియర్ నేత చిన్నారెడ్డి. బీజేపీ నేత రామ చంద్రరావు, వామపక్షాలు బలపరిచిన అభ్యర్థిగా ప్రొ. నాగేశ్వర్, కాంగ్రెస్ రెబల్ గా హర్షవర్దన్ రెడ్డి, టీఆర్ఎల్డీ నేతగా కపిలవాయి దిలీప్ కుమార్ ఒక సీటులో పోటీ చేస్తుండటం ఉత్కంఠను పెంచుతోంది. ఖమ్మం- నల్లగొండ-వరంగల్ స్థానానికి గులాబీ పార్టీ నుంచి పల్లా రాజశ్వేర్ రెడ్డి, కాంగ్రెస్ నుంచి రాములు నాయక్, బీజేపీ నుంచి ప్రేమేందర్ రెడ్డి, తెలంగాణ జన సమితి నుంచి ప్రొపెసర్ కోదండరామ్, యువ తెలంగాణ పార్టీ నేత రాణి రుద్రమదేవి, తీన్మార్ మల్లన్న, తెలంగాణ ఇంటి పార్టీ నేత చెరుకు సుధాకర్, జర్నలిస్టు జయసారధి రెడ్డి పోటీ చేస్తున్నారు. ఎవరు గెలుస్తారనేది ఇప్పుడు ఆసక్తిని పెంచుతోంది.

ఇక ఈ ఎమ్మెల్సీ ఎన్నికల తర్వాత రెండు రాష్ట్రాల శాసనమండళ్ళలో ఏ పార్టీకి బలం పెరుగుతుంది? ఏ పార్టీకి తగ్గుతుంది? ఈ ప్రశ్న ఇపుడు ఆసక్తి రేపుతోంది. ఇటు తెలంగాణ, అటు ఏపీలో శాసనమండలిలో ఎవరికి ఎంత సంఖ్యాబలం వుందనే అంశం చర్చకొస్తోంది. తెలంగాణ శాసన మండలిలో మొత్తం 40 సీట్లు ఉండగా.. టీఆర్ఎస్ పార్టీకి తిరుగులేని బలం వున్నది. గులాబీ పార్టీకి మండలిలో 30 మంది ఎమ్మెల్సీలున్నారు. నామినేటెడ్ సభ్యులు ముగ్గురు, ఇండిపెండెంట్లు మరో ముగ్గురు మండలిలో వున్నారు. ఎంఐఎం పార్టీకి ఇద్దరు, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు ఒక్కొక్కరు చొప్పున ఎమ్మెల్సీలున్నారు. వీరిలో బీజేపీ సభ్యుడు ఎన్. రామచంద్రరావు (మహబూబ్‌నగర్-రంగారెడ్డి-హైదరాబాద్ గ్రాడ్యుయేట్స్ కాన్సిట్యూయెన్సీ), టీఆర్ఎస్ సభ్యుడు పల్లా రాజేశ్వర్ రెడ్డి (నల్గొండ-వరంగల్-ఖమ్మం గ్రాడ్యుయేట్స్ కాన్సిట్యూయెన్సీ)ల పదవీ కాలం ముగుస్తుండడంతో ఈ రెండు స్థానాలకు ఎన్నిక జరుగుతోంది.

వీరిద్దరు వారి వారి పార్టీల తరపున అవే నియోజకవర్గాలకు తిరిగి పోటీచేస్తున్నారు. ఈ లెక్కన వీరిద్దరు గెలిస్తే.. తెలంగాణ మండలిలో ఏ పార్టీ బలం మారదు. అన్ని పార్టీలకు తమ సంఖ్యాబలం అదే విధంగా వుంటుంది. పల్లా ఓడిపోతే.. టీఆర్ఎస్ బలం ఒకటి తగ్గి 29కి పడిపోతుంది. అదేసమయంలో బీజేపీ సిట్టింగ్ ఎమ్మెల్సీ రాంచంద్రరావు ఓడిపోతే.. మండలిలో బీజేపీకి అసలు ప్రాతినిధ్యమే వుండకుండా పోతుంది. అయితే, దుబ్బాక ఉప ఎన్నిక ఇచ్చిన బలంతో దూకుడు మీదున్న బీజేపీ.. రెండు గ్రాడ్యుయేట్స్ నియోజకవర్గాల్లోను గెలుస్తామన్న ధీమా వ్యక్తం చేస్తున్నారు. అదే సమయంలో పలువురు ఉద్దండులు బరిలో వుండడంతో ఈ రెండు పట్టభద్రుల నియోజకవర్గాల ఎన్నికలు ఆసక్తికరంగా మారాయి.

ఇక ఏపీ శాసన మండలిలో మొత్తం స్థానాలు 58 కాగా ఇటీవల ఏకగ్రీవమైన ఆరుగురు సభ్యులతో కలిసి అధికార వైసీపీ బలం 18కి పెరిగింది. అయితే మండలిలో తెలుగుదేశం పార్టీ ఆధిపత్యం అలాగే కొనసాగుతోంది. తాజాగా టీడీపీ బలం 26కు తగ్గి మెజారిటీకి మూడు అడుగుల దూరంలో నిలిచింది. ప్రోగ్రెసివ్ డెమొక్రటిక్ ఫ్రంట్ -05, బీజేపీ -03, ఇండిపెండెంట్లు-3 వున్నారు. మరో మూడు స్థానాలు ఖాళీగా వుండగా.. అవి కూడా అధికార వైసీపీకి దక్కే అవకాశం వుంది. ఈ మూడు స్థానాలు కలుపుకున్నా కూడా ఏపీ శాసనమండలిలో అధికార పార్టీకి మెజారిటీ రాకపోవడం ప్రభుత్వానికి ఒకింత ఇబ్బందికరమైన అంశమే. నిజానికి ఏపీకి మూడు రాజధానుల ప్రతిపాదన వచ్చిన సందర్భంలో ఎదురైన ప్రతికూలత కారణంగా ఏపీలో శాసనమండలిని రద్దు చేస్తూ జగన్ ప్రభుత్వం తీర్మానం చేసి, కేంద్రానికి పంపింది. ఆ ప్రతిపాదన కేంద్రంలో పెండింగులో వున్న దరిమిలా ఏపీలో మండలి కార్యకలాపాలు ఇంకా కొనసాగుతున్నాయి. ఖాళీలకు ఎన్నికలు కూడా నిర్వహిస్తున్నారు. ఏపీ శాసనమండలిలో అధికార వైసీపీకి ఆధిపత్యం రావాలంటే మరో రెండేళ్ళు పడుతుందన్న అంఛనాలు వున్నాయి.

ALSO READ: 21ఏళ్ళలో 10మంది ముఖ్యమంత్రులు.. పూర్తి టెర్మ్ వున్న సీఎం ఒక్కరే.. ఇదీ ఉత్తరాఖండ్ హిస్టరీ