బీజేపీలోకి ఈటల రాజేందర్ చేరుతున్నరనే వార్తలపై తెలంగాణ గోషామహాల్ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ తనదైన తరహాలో కామెంట్ చేశారు. ఈటలతోపాటు మరికొందరు టీఆర్ఎస్ నేతలు బీజేపీలో చేరుతున్నారని అన్నారు. ఎవరైన పార్టీలోకి వస్తుంటే.. వారి చేరికలను వ్యతిరేకిస్తే వాళ్లకే నష్టమని రాజాసింగ్ అభిప్రాయపడ్డారు. భారతీయ జనతా పార్టీ ఎవరి సొంతంకాదని.. పార్టీలో చేరికలపై అధిష్టానం నిర్ణయం తీసుకుంటుందన్నారు.
తెలంగాణలో బీజేపీ బలపడాలని అధిష్టానం కృషి చేస్తోందని.. ఈ నేపథ్యంలో ఈటల రాజేందర్ వంటి నేత పార్టీలోకి వస్తే బీజేపీకి మంచిజరుగుతుందన్నారు. రాష్ట్రంలో పార్టీ బలపడుతుందని రాజాసింగ్ అభిప్రాయం వ్యక్తం చేశారు. ఎందుకంటే ఈటల బీసీలో ఉన్న బలమైన వ్యక్తి అని అలాంటి వ్యక్తి బీజేపీలోకి వస్తే బాగుంటుందని రాజాసింగ్ అన్నారు.
ఇదిలావుంటే…ఈటల రాజేందర్ టీఆర్‌ఎస్ పార్టీకి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. అసైన్డ్ భూముల వ్యవహారంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఈటెల రాజేందర్ మంత్రి వర్గం నుంచి బర్తరఫ్‌కు గురైన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈటల టీఆర్‌ఎస్‌కు గుడ్‌బై చెప్పేశారు. గ్రామాలు బాగుపడితే బంగారు తెలంగాణ సాధ్యమవుతుందని ఈటల రాజేందర్ అన్నారు. రాజీనామాలు చేయడం నాకు కొత్తేమి కాదు.. ఎప్పుడు రాజీనామా చేసినా గెలిచాను అని అన్నారు.