Minister Adi Moolapu Suresh: రాష్ట్రంలో ఉపాధ్యాయులందరికి వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగంగా జరుగుతుందని ఇప్పటి వరకు 94శాతం మందికి వాక్సిన్ వేశామని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి డాక్టర్ ఆదిమూలపు సురేష్ తెలిపారు. కేవలం15,083 మంది అనగా 6 శాతం ఉపాధ్యాయులకు మాత్రమే వాక్సిన్ వేయాల్సి ఉందని త్వరలోనే 100 శాతం పూర్తి చేస్తామన్నారు. రాష్ట్రంలోని 13 జిల్లాల్లో విశాఖపట్నం 100 శాతం వాక్సిన్ ప్రక్రియ పూర్తి కాగా కడపలో 99 శాతం, విజయనగర, చిత్తూరు, నెల్లూరు లలో 98 శాతం, ఉపాధ్యాయులు వాక్సిన్ వేయించుకున్నారన్నారు.
తూర్పుగోదావరి జిల్లాలో మాత్రమే 86 శాతం పూర్తయిందని, ఇక్కడ ఇంకా 4 వేల మందికి వాక్సిన్ వేయాల్సి ఉండగా వేగవంతం చేయాలని అధికారులకు సూచించామన్నారు. రాష్ట్రం మొత్తంలో సగటు 94 శాతం ఉపాధ్యాయులకు వ్యాక్సినేషన్ పూర్తయినట్టు మంత్రి సురేష్ వెల్లడించారు. పాఠశాలలు పునఃప్రారంభమైనప్పటి నుంచి హాజరు శాతం గణనీయంగా పెరిగిందని, 75 నుంచి 85 శాతం మంది విద్యార్థులు పాఠశాలలకు వస్తున్నారని మంత్రి చెప్పుకొచ్చారు.
కరోనా పరిస్థితుల నేపథ్యంలో పాఠశాలలో కోవిడ్ నిబంధనలను, భౌతిక దూరం ఉండేలా చర్యలు తీసుకున్నామని తెలిపారు. ఇక మాస్కుల వినియోగాన్ని కూడా తప్పనిసరి చేశామని పేర్కొన్నారు. రాష్ట్రంలో కరోనా కేసులు నమోదైన కొన్ని పాఠశాలలపై ప్రత్యేక దృష్టిపెట్టామని చెప్పిన మంత్రి.. కరోనా అధికంగా ఉన్న పాఠశాలలో విడతల వారీగా క్లాసులు ప్రారంభిస్తామని వివరించారు. ఇదిలా ఉంటే తెలంగాణలో స్కూళ్ల పునఃప్రారంభంపై సందిగ్ధత నెలకొంది. సెప్టెంబర్ 1 నుంచి తరగతులు ప్రారంభిస్తామని తెలంగాణ ప్రభుత్వం ప్రకటించినా హైకోర్టు అనుకోకుండా మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.