అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా కోల్ కతా లో దీదీ భారీ రోడ్ షో
Women's Day: అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా సోమవారం బెంగాల్ లో తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి, సీఎం మమతా బెనర్జీ ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు.
Women’s Day: అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా సోమవారం బెంగాల్ లో తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి, సీఎం మమతా బెనర్జీ ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. దీన్ని రోడ్ షో గా పార్టీ పేర్కొంటోంది. సెంట్రల్ కోల్ కతా నుంచి సుమారు నాలుగైదు కిలోమీటర్ల దూరం ఈ రోడ్ షో సాగనుంది. బెంగాల్ లో మహిళలకు ఎంతో భద్రత ఉందని నిరూపించడానికి అనువుగా పార్టీ.. వాస్తవ పత్రాన్ని విడుదల చేసే అవకాశం ఉంది. మమత ప్రభుత్వ హయాంలో ఇక్కడ మహిళలకు ఎంత మేరకు రక్షణ, భద్రత ఉందని ప్రధాని మోదీ నిన్న జరిగిన ర్యాలీ సందర్భంగా ప్రశ్నించారు. నగరంలోని డుమ్ డుమ్ ప్రాంతంలో 80 ఏళ్ళ వృధ్ధురాలిపై ఇటీవల జరిగిన దాడిని ఆయన ప్రస్తావించారు.
అయితే అదే సమయంలో మమత కూడా నిన్న సిలిగురిలో జరిగిన రోడ్ షో లో..దేశంలో వంట గ్యాస్, పెట్రో ఉత్పత్తుల ధరల కారణంగా మహిళలు ఎదుర్కొంటున్న ఇబ్బందుల గురించి వివరించారు. కేంద్రం అదేపనిగా వీటి ధరలను పెంచుతున్న కారణంగా.. మహిళలు పడరాని పాట్లు పడుతున్నారని, ఉచితంగా బియ్యం లభిస్తున్నా.. కుకింగ్ గ్యాస్ ధర చూసి వారు బెంబేలెత్తుతున్నారని దీదీ పేర్కొన్నారు. అసలు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి మహిళలంటే, వారి భద్రత అంటే ఏమైనా చిత్తశుద్ది ఉందా అని ఆమె ప్రశ్నించారు.
యూపీలో స్త్రీలకు భద్రత ఎంతవరకు ఉందో అందరికీ తెలిసిందేనని అంటూ మమత.. హత్రాస్ ఘటనను గుర్తు చేశారు. అయితే యూపీతో పోలిస్తే బెంగాల్ లో మహిళలకు భద్రత, రక్షణ ఉందనిఆమె చెప్పారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ఘనంగా జరుపుకొంటున్న మనం మహిళలకు ఏ మాత్రం గౌరవం ఇస్తున్నామని ఆమె ప్రశ్నించారు. ఆకాశంలో సగం అన్న నానుడికి కొత్త నిర్వచనం ఇవ్వలేకపోతున్నామని అన్నారు.
మరిన్ని ఇక్కడ చదవండి:
కొత్తపార్టీపై ఏర్పాటుపై స్పీడ్ పెంచిన షర్మిల.. అంతర్జాతీయ మహిళా దినోత్సవం నాడు మరో కీలక అడుగు