‘దీదీ వర్సెస్ దాదా’గా మారనున్న బెంగాల్ రాజకీయాలు..?

'దీదీ వర్సెస్ దాదా'గా మారనున్న బెంగాల్ రాజకీయాలు..?

దేశమంతా కాషాయ జెండాను ఎగరేయాలని బీజేపీ నేతలు పక్కా ప్రణాళికలు వేస్తున్నారు. ఆ దిశగా ఇప్పటికే అడుగులు వేసిన వారు.. చాలా శాతం విజయం కూడా సాధించారు. ఇక బీజేపీ స్వాధీనం చేసుకోవాలనుకున్న రాష్ట్రాల్లో పశ్చిమ బెంగాల్ ఒకటి. ఒకప్పుడు కాంగ్రెస్, కమ్యూనిస్టుల కంచు కోటగా ఉన్న పశ్చిమ బెంగాల్‌లో ఇప్పుడిప్పుడే బీజేపీ పుంచుకుంటోంది. ఈ నేపథ్యంలో ఆ రాష్ట్రానికి చెందిన టీమిండియా మాజీ కెప్టెన్ గంగూలి బీజేపీ రంగంలోకి దింపినట్లు ఇటీవల వరుస పరిణామాలతో అర్థమవుతోంది. […]

TV9 Telugu Digital Desk

| Edited By:

Oct 19, 2019 | 6:36 PM

దేశమంతా కాషాయ జెండాను ఎగరేయాలని బీజేపీ నేతలు పక్కా ప్రణాళికలు వేస్తున్నారు. ఆ దిశగా ఇప్పటికే అడుగులు వేసిన వారు.. చాలా శాతం విజయం కూడా సాధించారు. ఇక బీజేపీ స్వాధీనం చేసుకోవాలనుకున్న రాష్ట్రాల్లో పశ్చిమ బెంగాల్ ఒకటి. ఒకప్పుడు కాంగ్రెస్, కమ్యూనిస్టుల కంచు కోటగా ఉన్న పశ్చిమ బెంగాల్‌లో ఇప్పుడిప్పుడే బీజేపీ పుంచుకుంటోంది. ఈ నేపథ్యంలో ఆ రాష్ట్రానికి చెందిన టీమిండియా మాజీ కెప్టెన్ గంగూలి బీజేపీ రంగంలోకి దింపినట్లు ఇటీవల వరుస పరిణామాలతో అర్థమవుతోంది.

అయితే దాదాను లైన్‌లో తీసుకొచ్చేందుకు బీజేపీ ఎప్పటినుంచో ప్రయత్నాలు చేస్తోంది. 2015లో గంగూలీ బీజేపీ మద్దతుతోనే పశ్చిమబెంగాల్ క్రికెట్ అసోషియేషన్ ప్రెసిడెంట్‌గా ఎన్నికయ్యారు. ఈ విషయంలో దివంగత మాజీ ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ కీలక పాత్ర పోషించినట్లు టాక్ ఉంది. అప్పటి నుంచి ఆయన కాషాయ కండువాను కప్పుకోనున్నట్లు వార్తలు వచ్చాయి. ఈ క్రమంలో 2017లో గంగూలీ బీజేపీలో చేరుతున్నారని పెద్ద ఎత్తున ప్రచారం కూడా జరిగింది. దీనిపై చాలా రోజులు ఆయన సైలెంట్‌గా ఉంటూ రాగా.. ఆ తరువాత ఖండించారు. మరోవైపు గంగూలీ విషయంలో పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ కూడా యాక్షన్ ప్లాన్ చేస్తూ.. అతడితో మంచి సాన్నిహిత్యం కొనసాగిస్తూ వస్తోంది.

ఇదిలా ఉంటే ఇటీవల గంగూలీ బీసీసీఐ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. అయితే ఈ ఎన్నికకు ముందు దాదా.. కేంద్ర హోం మంత్రి అమిత్ షాను కలిశారు. ఈ విషయాన్ని అమిత్ షా సైతం ధ్రువీకరించారు. తనను గంగూలీ కలవడం నిజమేనని.. కానీ ఈ భేటికి ఎలాంటి రాజకీయ ప్రాధాన్యత లేదని తెలిపారు. ఇది కేవలం స్నేహపూర్వకమైన సమావేశం మాత్రమేనని అమిత్ షా అన్నారు. ఈ నేపథ్యంలో పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో గంగూలీనే బీజేపీకి ఆ రాష్ట్రంలో నాయకత్వం వహిస్తారనే వార్తలు కూడా జోరుగా వినిపిస్తున్నాయి. బీసీసీఐ అధ్యక్షుడిగా గంగూలీ ఎన్నికైనప్పటికీ.. ఆ పదవి వచ్చే ఏడాది ముగియనుంది. ఇక 2021లో బెంగాల్‌లో అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి. ఆ లోపు గంగూలీకి బెంగాల్ బీజేపీ చీఫ్ బాధ్యతలు ఇచ్చి.. తరువాత సీఎం అభ్యర్థిగా ఎన్నికల బరిలో దింపాలని బీజేపీ అధిష్టానం ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. ఒకవేళ ఇదే జరిగితే.. బెంగాల్‌ రాజకీయాలు దీదీ వర్సెస్ దాదాగా మారనున్నాయి.

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu