వారి బస్సులు సీజ్ చేయడానికి కారణం.. అదేనా?

ఏపీలో రాజకీయాల్లో జేసీ బ్రదర్స్ రూటే సెపరేటు. రాయలసీమ పాలిటిక్స్‌లో వీరొక బ్రాండ్. స్వపక్షం విపక్షం అనే తేడా లేకుండా మైండ్‌లో ఎదుంటే అది వెంటనే బయటకు చెప్పాల్సిందే. గత టీడీపీ హాయంలో ఎంపీగా కొనసాగిన జేసీ దివాకర్‌రెడ్డి .. వైసీపీపై చేసిన వ్యాఖ్యలు అన్నీ ఇన్నీకావు. అదే సమయంలో ప్రత్యేక హోదా అంశంలో కూడా ఆయన స్టాండ్ డిఫరెంట్ కూడా. ప్రత్యేక హోదా రాదని తెలిసినా మా బాస్( చంద్రబాబు) పార్టీ అధ్యక్షునిగా చేయాల్సిన పని […]

వారి బస్సులు సీజ్ చేయడానికి కారణం.. అదేనా?
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By:

Updated on: Oct 19, 2019 | 6:01 PM

ఏపీలో రాజకీయాల్లో జేసీ బ్రదర్స్ రూటే సెపరేటు. రాయలసీమ పాలిటిక్స్‌లో వీరొక బ్రాండ్. స్వపక్షం విపక్షం అనే తేడా లేకుండా మైండ్‌లో ఎదుంటే అది వెంటనే బయటకు చెప్పాల్సిందే. గత టీడీపీ హాయంలో ఎంపీగా కొనసాగిన జేసీ దివాకర్‌రెడ్డి .. వైసీపీపై చేసిన వ్యాఖ్యలు అన్నీ ఇన్నీకావు. అదే సమయంలో ప్రత్యేక హోదా అంశంలో కూడా ఆయన స్టాండ్ డిఫరెంట్ కూడా. ప్రత్యేక హోదా రాదని తెలిసినా మా బాస్( చంద్రబాబు) పార్టీ అధ్యక్షునిగా చేయాల్సిన పని తాను చేస్తున్నాడు.. అంటూ స్వపక్షంలో కాకపుట్టించిన వ్యక్తి జేసీ. అదే సమయంలో వైసీపీ అధినేత జగన్‌పై చేసిన ఎన్నో ఆరోపణలు, విమర్శలు అంత ఈజీగా మర్చిపోయేవి కాదు. ఈసారి ఎన్నికల్లో జేసీ బ్రదర్స్ పోటీ నుంచి తప్పుకుని తమ కుమారులను రంగంలోకి దించారు. అయినా ఓటమి తప్పలేదు. వైసీపీ బంపర్ మెజారిటీతో గెలుపొందడంతో జేసీ బ్రదర్స్ ఇప్పుడు పొలిటికల్‌గా సైలెంట్ మోడ్‌కి వెళ్లిపోయారు.

వైసీపీ అధినేత జగన్ విషయంలో గతంలో జేసీ చేసిన వ్యక్తిగత విమర్శలు సోషల్ మీడియాలో హల్‌చల్ చేశాయి. అదే విధంగా జగన్ సోదరి షర్మిల ప్రేమ వివాహాన్ని సైతం జేసీ దివాకర్‌రెడ్డి తక్కువ చేసి మాట్లాడిన సందర్భాలు కూడా ఉన్నాయి. రెడ్డి సామాజిక వర్గాన్ని ఉదహరిస్తు వైఎస్ జగన్‌పై ఆయన చేసిన వ్యాఖ్యలు  పెద్ద దుమారాన్నే రేపాయి.

రాయలసీమ రాజకీయాల్లో జేసీ దివాకర్‌రెడ్డి తన అభిప్రాయాలను చాల ధైర్యంగా వెల్లడించే నేత. ఎదుటివారిని తన మాటల గారడీతో ఇట్టే ఇరుకున పెడతారనే విషయం తెలిసిందే. అయితే రాజకీయంగా జేసీ బ్రదర్స్ కాస్త మౌనంగా ఉంటున్నారు. అయితే వీరికి పలు వ్యాపారాలున్నప్పటికీ.. వాటిలో ముఖ్యమైంది ట్రావెల్స్ బిజినెస్. దాదాపు వంద వరకు వీరి బస్సులు వివిధ రాష్ట్రాల్లో సర్వీసులు ఇస్తున్నాయి. గతంలో మహబూబ్‌నగర్‌ జిల్లాలో దగ్ధమై 40 మందికి పైగా సజీవ దహనం కావడానికి కారణమైన ఓల్వో బస్సు కూడా వీరిదే. అయితే వీరి బస్సులపై నిఘా పెట్టిన ఏపీ రవాణ సంస్ధ ఇటీవల 31 బస్సులను సీజ్ చేసింది. ఇంతకాలంలో జరగనిది ఒకేసారి 31 బస్సులను సీజ్ చేయడమంటే సాధారణమైన విషయం కాదు. వైసీపీ ప్రభుత్వం కావాలనే తమపై కక్షగట్టిందని, అధికారాన్ని అడ్డంపెట్టుకుని బస్సులను సీజ్ చేసిందని జేసీ బ్రదర్స్ ఆరోపిస్తున్నారు. అయితే బస్సులను సీజ్ చేసిన అధికారులు మాత్రం.. అధికంగా ప్రయాణికులను ఎక్కించుకోవడం, అధిక ధరలు వసూలు చేయడం, స్టేజ్ కేరియర్లుగా తిప్పడం వంటి కారణాలతోనే వారి బస్సులను సీజ్ చేసినట్టు చెబుతున్నారు. జేసీ బ్రదర్స్‌కు చెందిన దివాకర్ ట్రావెల్స్ బస్సుల్ని సీజ్ చేయడమే కాకుండా బస్సు పర్మిట్లను కూడా రద్దు చేశారు.

అయితే ఇదంతా రాజకీయంలో భాగమని చర్చ జరుగుతుంది. అంతరాష్ట్ర రూట్లలో తిరిగే పలు ట్రావెల్స్‌కు చెందిన బస్సులు కూడా ఇదే విధంగా నడుస్తున్నా.. జేసీ బ్రదర్స్‌కు చెందిన బస్సులను ఆపడం మాత్రం రాజకీయ కక్ష సాధింపులో భాగమేననే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. అంటే రాయలసీమ రాజకీయాల్లో కొరకరాని కొయ్యలుగా ఉన్న జేసీ బ్రదర్స్ ఆర్ధిక మూలాలను దెబ్బకొట్టడం ద్వారా పొలిటికల్ రివెంజ్ తీర్చుకుంటున్నారని విమర్శలు వస్తున్నాయి. ఇటీవల జేసీ చాల సైలెంట్‌గా ఉంటున్నారు. సరిగ్గా ఇదే రైట్ టైమ్ అనుకున్నారో ఏమోగానీ ఏకంగా 31 బస్సులను సీజ్ చేయడంతో పాటు పర్మిట్లు రద్దు చేయడం చూస్తుంటే.. దీనివెనుక ఎవరున్నారనే విషయంలో ఎన్నో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మొత్తానికి అనంతపురం జిల్లా రాజకీయాలను శాసించే జేసీ బ్రదర్స్‌కు చెక్ పెట్టేందుకే ఈ విధంగా బస్సులు సీజ్ చేశారనేది మాత్రం పబ్లిక్ టాక్.