మాగంటీ..! మౌనమేలనోయి ? ఇక ఎండ్ కార్డేనా ?

అసలే కుదేలవుతున్న తెలుగుదేశం పార్టీలో ఓడిన నేతలు ఒక్కరొక్కరే అఙ్ఞాతంలోకి వెళ్ళిపోతున్నారు. ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తున్నట్లు చంద్రబాబుకు లేఖరాసిన తర్వాత గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అఙ్ఞాతంలోకి వెళ్ళిపోగా.. విశాఖతీరంలో గంటా రాజకీయం గుట్టుగానే సాగుతోంది. ఇంతలో మరో నేత అఙ్ఞాతంలోకి వెళ్ళిపోవడం తెలుగుదేశం పార్టీ అధినాయకత్వాన్ని అయోమయానికి గురిచేస్తోంది. 2019 సార్వత్రిక ఎన్నికల్లో  ఏలూరు ఎంపీ స్థానానికి పోటీ చేసి, ఓడిపోయిన మాగంటి బాబు అలియాస్ మాగంటి వెంకటేశ్వర రావు కొంత కాలంగా ఎవరికీ […]

మాగంటీ..! మౌనమేలనోయి ? ఇక ఎండ్ కార్డేనా ?
Follow us

|

Updated on: Nov 06, 2019 | 6:29 PM

అసలే కుదేలవుతున్న తెలుగుదేశం పార్టీలో ఓడిన నేతలు ఒక్కరొక్కరే అఙ్ఞాతంలోకి వెళ్ళిపోతున్నారు. ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తున్నట్లు చంద్రబాబుకు లేఖరాసిన తర్వాత గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అఙ్ఞాతంలోకి వెళ్ళిపోగా.. విశాఖతీరంలో గంటా రాజకీయం గుట్టుగానే సాగుతోంది. ఇంతలో మరో నేత అఙ్ఞాతంలోకి వెళ్ళిపోవడం తెలుగుదేశం పార్టీ అధినాయకత్వాన్ని అయోమయానికి గురిచేస్తోంది.
2019 సార్వత్రిక ఎన్నికల్లో  ఏలూరు ఎంపీ స్థానానికి పోటీ చేసి, ఓడిపోయిన మాగంటి బాబు అలియాస్ మాగంటి వెంకటేశ్వర రావు కొంత కాలంగా ఎవరికీ దొరకటం లేదు. మొన్నటి జనరల్ ఎలెక్షన్స్ తర్వాత పూర్తిగా అఙ్ఞాతంలోకి వెళ్ళిపోయారు. కనీసం ఫార్మాలిటీ కోసమైనా అగ్ర నేతలు జిల్లాకు వచ్చినప్పుడు మాగంటి బాబు కనిపించడం లేదు. ఇటీవల చంద్రబాబు తనయుడు, మాజీ మంత్రి నారా లోకేశ్ ఏలూరుకు వచ్చినా మాగంటి మచ్చుకైనా కనిపించలేదు.
మాగంటి ఫ్యామిలీ మొదట్నించి రాజకీయాల్లోనే వుంది. ఆయన తల్లి, తండ్రి గతంలో రాష్ట్ర మంత్రులుగా పనిచేశారు. మాగంటి బాబు కూడాగతంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి ప్రభుత్వంలో మంత్రిగా పనిచేశారు. ఆ తర్వాత టిడిపిలో  చేరి సీరియస్‌గానే పనిచేశారు. ఈ క్రమంలోనే 2014లో ఏలూరు ఎంపీ స్థానానికి పోటీచేసి ఎంపీగా అయిదేళ్ళు కొనసాగారు.
అయితే.. అయిదేళ్ళ కాలంలో టిడిపి ప్రభుత్వంలో తనకు తగిన గుర్తింపు, గౌరవం దక్కడం లేదని సన్నిహితుల దగ్గర మాగంటి బాబు వాపోయేవారు. గత ప్రభుత్వ హయాంలో పోలవరం ప్రాజెక్టుకు ప్రియారిటీ ఇస్తూ పలు కార్యక్రమాలు నిర్వహించినా స్థానిక ఎంపీగా తనకు ఎక్కడా స్థానం కలిపించడం లేదని మాగంటి కినుక వహించారు. పోలవరం ప్రకటనలలో తన ఫోటో ఎక్కడా వాడడం లేదని కొన్ని సందర్భాలలో ఆగ్రహం వ్యక్తం చేసిన ఉదంతాలు కూడా వున్నాయి.
చింతలపూడి నియోజకవర్గంలో ఓ మార్కెట్ కమిటీ ఛైర్మెన్ పోస్టు తన వర్గానికి ఇప్పించుకోవడంలో విఫలయత్నం చేసిన మాగంటి బాబు తన మాట నెగ్గకపోవడంతో ఆగ్రహంతో ఊగిపోయారు. ఆ సందర్భంలో మాజీ మంత్రి పీతల సుజాత మాటకు చంద్రబాబు ప్రాధాన్యత ఇవ్వడం మాగంటికి జీర్ణం కాలేదు. ఆ తర్వాత మొన్నటి ఎన్నికల్లో కాలికి బలపం కట్టుకుని తిరిగినా విజయం సాధించకపోవడానికి కారణం పలు నియోజకవర్గాలలో తెలుగుదేశం పార్టీ శ్రేణులు తనకు సహకరించకపోవడమే అని మాగంటి భావించారు.
అంతే ఆ తర్వాత క్రమంగా మాగంటి బాబు ఆఙ్ఞాతంలోకి వెళ్ళిపోయారు. చివరికి తన సొంత సామాజిక వర్గానికి చెందిన దెందులూరు మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ గత 50 రోజులుగా జైలులో వున్నా మాగంటి బాబు కనీసం పరామర్శకు కూడా రాలేదు. ఇటీవల చింతమనేనిని పరామర్శించేందుకు నారా లోకేశ్ స్వయంగా వచ్చి వెళ్ళారు. ఆ సందర్బంలోను మాగంటి కనిపించకపోవడంపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. పార్టీ సమీక్షా సమావేశాలకు కూడా మాగంటి బాబు హాజరు కావడం లేదు. తాను రాలేనని పార్టీ నేతలకు ఆయన సమాచారం ఇచ్చినట్లు ప్రచారం జరుగుతోంది. అయితే కారణం ఏదైనా జెన్యూన్ ఇష్యూ వుందా లేక పార్టీ పట్ల కినుక వహించారా అన్నది తేలాల్సి వుంది.
మాగంటి బాబు రాజకీయ జీవితం ఇక ముగిసినట్లేనన్న ప్రచారం ఏలూరులో జోరుగా సాగుతోంది. తన కుమారుడు రామ్‌జీని రాజకీయాల్లో యాక్టివ్ చేసే వరకైనా బాబు యాక్టివ్‌గా వుంటారని ఆయన అనుచర వర్గం భావించింది. అయితే ఇప్పుడు దానికి భిన్నంగా ఆయన సైలెంలయ్యారు. ఈ సైలెన్స్ శాశ్వతమా లేక ఆయన బిజెపిలో గానీ, వైసీపీలోగానీ చేరి తిరిగి యాక్టివ్ అయ్యి, తన తనయుడు రామ్‌జీని పొలిటికల్‌గా యాక్టివ్ చేస్తారా అన్నది వేచి చూడాల్సిన అంశం