సిట్టింగ్ ఎమ్మెల్యే రాజీనామా చేయలేదు. అదింకా ఆమోదం పొందనే లేదు. ఎన్నికల కమిషన్‌కు సీటు ఖాళీ అయినట్లు సమాచారం.. ఉప ఎన్నిక ఊసే లేదు.. కానీ ఆ హాట్ సీటు బరిలో ఉద్ధండులు దిగుతారంటూ ప్రచారం జోరందుకుంది. ఆలూ లేదు చూలు లేదు. కొడుకు పేరు సోమలింగం అన్నారట. సరిగ్గా అలాగే వుంది గన్నవరం నియోజకవర్గం పరిస్థితి చూస్తుంది. వల్లభనేని వంశీ రాజీనామాపై క్లారిటీ లేదు. ఆయన పార్టీ మారడం ఇంకా వందశాతం పిక్చర్ బయటికి రాలేదు.. కానీ గన్నవరం ఉప ఎన్నికపై ఊహగానాలు మొదలయ్యాయి. ఉప ఎన్నిక వస్తే నేరుగా చినబాబే బరిలో దిగుతారని కొందరంటుంటే.. సేనాని యుద్దానికొస్తారని మరికొందరు క్యాంపెయిన్ మొదలుపెట్టారు.
గన్నవరం రాజకీయాలు రోజురోజుకు వేడెక్కుతున్నాయి. ఎమ్మెల్యే పదవికి, టీడీపీ సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు ఎమ్మెల్యే వల్లభవనేని వంశీ చంద్రబాబుకు బహిరంగ లేఖ రాశారు. అయితే ఆయన ఎమ్మెల్యే పదవికి ఎప్పుడు రాజీనామా చేస్తారనేది క్లారిటీ లేదు. ప్రకటన చేసిన తర్వాత నుంచి ఆయన అండర్ గ్రౌండ్‌లోకి వెళ్లిపోయారు. ఆ తర్వాత ఆయన నుంచి కామెంట్స్ లేవు. వాట్సాప్‌లో రాజీనామాకు కారణాలు చెప్పారు. కానీ ఆయన ఎమ్మెల్యే పదవికి ఇంకా రాజీనామా చేయలేదు. కానీ అంతలోనే వంశీ రాజీనామాపై, గన్నవరం ఉప ఎన్నికపై ఊహగానాలు జోరందుకున్నాయి.
గన్నవరం టీడీపీ సిట్టింగ్ సీటు. మొన్నటి ఎన్నికల్లో వంశీ కేవలం 838 ఓట్ల తేడాతో వైసీపీ అభ్యర్థి యార్గగడ్డ వెంకట్రావుపై గెలిచారు. వైసీపీ నుంచి పోటీ చేసిన యార్లగడ్డ వెంకట్రావుకి లక్షా 3 వేల 43 ఓట్లు వచ్చాయి. వంశీకి లక్షా 3 వేల 881 ఓట్లు పడ్డాయి. ఇక్కడ జనసేన పోటీ చేయలేదు. వామపక్షాల కూటమిలో భాగంగా పోటీ చేసిన సీపీఐకి 6675 ఓట్లు పోలయ్యాయి.
ఒక వేళ వల్లభనేని వంశీ రాజీనామా చేస్తే ఏం జరుగుతుంది? అనే దానిపై పలు రకాలు ఊహగానాలు బెజవాడ రాజకీయ వీధుల్లో చక్కర్లు కొడుతున్నాయి. వంశీ రాజీనామా చేసి ఏ పార్టీలోకి వెళుతారు? అనే దానిపై ఇంకా క్లారిటీ లేదు. ఒక రోజు ఆయన బీజేపీ నేత సుజనా చౌదరిని కలిశారు . ఆ వెంటనే ఏపీ సీఎం జగన్‌ను కలిశారు. దీంతో ఆయన వైసీపీలోకి వెళతారా? లేక బీజేపీలోకి వెళతారా? అనేది క్లారిటీ లేదు. నవంబర్ 3న వైసీపీలో చేరతారన్న ప్రచారం మాత్రం బలంగా వినిపిస్తోంది.
గన్నవరం నియోజకవర్గం తెలుగుదేశానికి కంచుకోట. మొదట్లో కమ్యూనిస్టులు ఈ స్థానంపై ఆధిపత్యం ఉండేది. క్రమంగా వారు ప్రాభవాన్ని కోల్పోయారు. 2009, 2014 సహా మొన్నటి ఎన్నికల్లో టీడీపీ హ్యాట్రిక్ విజయాన్ని నమోదు చేసింది. 2009లో దాసరి బాలవర్ధన్ రావు ఇక్కడి నుంచి గెలిచారు. 2014, 2019 ఎన్నికల్లో వంశీ విజయం సాధించారు. ప్రస్తుతం దాసరి బాలవర్ధన్ రావు టీడీపీలో లేరు. ఆయన వైసీపీలో ఉన్నారు.
ఒక వేళ వంశీ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి….గన్నవరానికి ఉప ఎన్ని క వస్తే….. టీడీపీకి బలమైన సామాజిక వర్గం ఓటు బ్యాంకు ఉన్న గన్నవరం నియోజకవర్గం ఉప ఎన్నికలో నారా లోకేష్ పోటీ చేస్తారనే ప్రచారం ఒకటి నడుస్తోంది. మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావుకు కూడా ఉప ఎన్నిక టికెట్ ఇవ్వవచ్చని అంటున్నారు. కానీ ఆయన నందిగామ నుంచి మారే ముందు ఫ్యూచర్‌పై లోతుగా ఆలోచించక మానరు.
ఉప ఎన్నికలో వంశీ ఏ పార్టీ తరపున బరిలోకి దిగుతారా? లేదా? అనేది సస్పెన్స్. వైసీపీ ఇంచార్జ్‌గా యార్లగడ్డ వెంకట్రావు ఏం చేస్తారనేద ఇంకో ఆసక్తికరం అంశం. వైసీపీ టికెట్ ఇవ్వకపోతే యార్లగడ్డ టీడీపీ నుంచి పోటీ చేస్తారు అనే ఊహగానాలు ఉన్నాయి. మరోవైపు గత ఎన్నికల్లో రెండు స్థానాల నుంచి పోటీ చేసి.. రెండు చోట్ల ఓటమి పాలైన జనసేనాని పవన్ కల్యాణ్ కూడా గన్నవరం నుంచి పోటీ చేయాలని అనుకుంటున్నట్లు తెలుస్తోంది. అయితే టిడిపితో కాస్త సఖ్యతతోనే పవన్ వుంటున్న నేపథ్యంలో పోటీకి దిగుతారా లేదా అన్నది సందేహమే.
మొత్తానికి వంశీ రాజీనామా చేయలేదు. ఉప ఎన్నిక రాలేదు. కానీ పార్టీ అభ్యర్థుల విషయం చర్చించే వరకూ విషయం వెళ్లింది. అయితే అగ్గిరాజేసి సైలెంట్‌యైన వంశీ రాబోయే రోజుల్లో ఏం చేయబోతున్నారనేది ఆసక్తికరంగా మారింది.