కర్ణాటక కాంగ్రెస్‌లో ఆధిపత్య పోరు మరోసారి భగ్గుమంది. కన్నడ పీసీసీ చీఫ్ శివకుమార్, మాజీ సీఎం సిద్ధరామయ్య భిన్న ప్రకటనలు.. ఇప్పుడివే ఆ రాష్ట్ర పార్టీలో హాట్‌టాపిక్‌గా మారిపోయింది. పార్టీ ఫిరాయింపుదారులకు డోర్స్ క్లోజ్ చేశామన్న సిద్ధరామయ్య వ్యాఖ్యలకు విరుద్ధంగా డీకే శివకుమార్ కామెంట్లు విసరడం చర్చకు దారితీసింది. కాంగ్రెస్ సిద్ధాంతాలను అంగీకరించేవారెవరైనా మళ్లీ పార్టీలోకి రావొచ్చని ప్రకటించారు. ఇప్పుడీ వ్యాఖ్యలే కన్నడ కాంగ్రెస్‌లో సంచలనంగా మారాయి. కాంగ్రెస్-జేడీఎస్ కూటమి ప్రభుత్వాన్ని కూల్చేసిన 17 మంది ఎమ్మెల్యేలు మాత్రమే కాకుండా, కాంగ్రెస్ సిద్దాంతాలను అంగీకరించేవారెవరైనా తమ పార్టీలో చేరొచ్చని డీకే శివకుమార్ ప్రకటించారు.
తమ పార్టీలోకి రావాలనుకునేవారు దరఖాస్తులు పంపించాలని కోరారు. కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలతో చర్చించి, పార్టీ ప్రయోజనాలకు తగిన నిర్ణయం తీసుకుంటామని పేర్కొన్నారు. కాంగ్రెస్‌లో ఒక్కొక్కరికీ ఒక్కో అభిప్రాయం ఉండొచ్చని అంటూనే వ్యక్తిగత అభిప్రాయాల కన్నా పార్టీ నిర్ణయమే అందరికీ శిరోధార్యమని చెప్పారు శివకుమార్. అయితే కాంగ్రెస్-జేడీఎస్ ప్రభుత్వ కూల్చివేతకు కారకులైన 17 మంది ఎమ్మెల్యేల్లో.. ఎవరూ ఇప్పటి వరకు కాంగ్రెస్‌ను సంప్రదించలేదన్నారు.
ప్రజలకు ప్రయోజనం చేకూర్చే నిర్ణయాలు తీసుకున్నపుడు ప్రభుత్వాన్ని సమర్థిస్తామన్నారు. అయితే కాంగ్రెస్ సిద్ధాంతాలు నచ్చిన వారు ఎవరైనా పార్టీలో చేరొచ్చన్న శివకుమార్ వ్యాఖ్యలపై స్పందించారు సిద్ధరామయ్య.. నేను శివకుమార్‌తో మాట్లాడుతాను.. నేను నా వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నాను. బీజేపీలోకి వెళ్లిపోయిన ఎమ్మెల్యేలను తిరిగి తీసుకునే ప్రసక్తే లేదని అసెంబ్లీలో ప్రకటించానన్నారు.
దీంతో కన్నడ పీసీసీ చీఫ్..మాజీ సీఎం సిద్ధరామయ్యల విభిన్న ప్రకటనలు పార్టీలో చర్చనీయాంశంగా మారాయి. ఇదిలా ఉంటే వీరిద్దరి మధ్యలోకి బీజేపీ ఎంటరైంది. ప్రజా ప్రయోజనాలు మాని.. పదవుల కోసం.. పార్టీలో ఆధిపత్యం కోసం కొట్లాడుకుంటున్నారని కమలదళం విమర్శలు గుప్తిస్తోంది.