ఏపీ సీఎం జగన్‌పై టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యులు, మాజీ మంత్రి కిమిడి కళా వెంకట్రావు మండిపడ్డారు. అరాచకంగా, ఆటవిక పాలన సాగించిన అగ్రరాజ్యం అమెరికా మాజీ అధిపతి డోనాల్డ్ ట్రంప్‌కు పట్టిన గతే సీఎం జగన్‌కు పడుతుందని దుమ్మెత్తిపోశారు. తనను అర్ధరాత్రి అక్రమంగా, అన్యాయంగా అరెస్ట్ చేశారని ఆవేదన వ్యక్తం చేశారు.
హిందూ దేవాలయాలపై దాడులు జరుగుతుంటే కళ్లుండి కూడా చూడలేని గుడ్డివాడిలా సీఎం జగన్ వ్యవహరిస్తున్నారని కళా ధ్వజమెత్తారు. తమ పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు రామతీర్థం ఘటనపై స్పందించి, క్షేత్రస్థాయిలో పరిశీలనకు వస్తే విజయసాయిరెడ్డి కవ్వింపు చర్యలకు పాల్పడ్డారని ఆరోపించారు. ప్రజలు ఆగ్రహానికి గురై చెప్పు విసిరితే తప్పేముందని వెంకట్రావు ప్రశ్నించారు.
శాంతిభద్రతలకు విఘాతం కలిగించకుండా చూడాల్సిన పోలీసులు వైసీపీ కార్యకర్తల్లా వ్యవహరిస్తున్నారని కళా వెంకట్రావు విమర్శించారు. ముందస్తు నోటీసు లేకుండా అర్ధరాత్రి పోలీసు బలగాలతో వచ్చి అరెస్ట్ చేయడం హేయమైన చర్యగా అభివర్ణించారు. కక్ష సాధింపు చర్యలకు టీడీపీ నేతులను, శ్రేణులను భయపెట్టలేరని అన్నారు.