ఏపీ రాజకీయాల్లో జనసేన పార్టీ(Janasena Party) దూకుడు పెంచింది. పవన్ కళ్యాణ్‌ను(Pawan Kalyan) ఉమ్మడి ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించాలని కోరుతున్న జనసేన మరో వైపు క్షేత్రస్థాయిలో తన పని తాను చేసుకుపోతోంది. ఈ కృషిలో పాలుపంచుకోవాలని చిరంజీవి ఫ్యాన్స్‌ను ఆ పార్టీ కోరింది. అభిమాన సంఘాలన్నీ రాజకీయ ప్రక్రియలో భాగం కావాలని మెగా అభిమానులను జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ పిలుపునిచ్చారు. మంగళగిరి జనసేన కార్యాలయంలో చిరంజీవి యువత ప్రతినిధులతో మనోహర్ సమావేశమయ్యారు. ఇందులో భాగంగా మెగా అభిమాన సంఘాల నాయకులతో నాదెండ్ల మనోహర్ మంగళగిరిలో సమావేశయ్యారు. అంతా ఇంటిగ్రేట్ అవ్వాల్సిన అవసరం ఉందని అన్నారు. ప్రకృతి విపత్తులు సంభవించినప్పుడు ముందుకు వెళ్లి బాధితులకు సాయం అందించడంలో చిరంజీవి అభిమానులు ఎప్పుడూ ముందుంటారని నాదెండ్ల మనోహర్ గుర్తు చేశారు.
అభిమాన సంఘాలు రాజకీయ ప్రక్రియలో భాగమై మరోసారి పొరపాటు జరగకుండా జాగ్రత్త వహించాలని సూచించారు. పవన్ కళ్యాణ్‌ని ముఖ్యమంత్రి చేయడానికి మెగా అభిమానులు కృషి చేయాలని కోరారు. వంద శాతం జనసేన జెండా మోసేందుకు అంతా సిద్ధంగా ఉండాలని అన్నారు. గ్రామస్థాయి వరకు పార్టీని తీసుకువెళ్లాలని సూచించారు.
పార్టీ ప్రయాణంలో అభిమానులకు స్థానం కల్పించే ఏర్పాటు చేస్తామని నాదెండ్ల చెప్పారు. పార్టీ క్రియాశీలక సభ్యులకు త్వరలో కిట్లు పంపిణీ చేస్తామని, అలాగే వచ్చే నెల నుంచి శిక్షణా తరగతులు ఉంటాయని.. అందులో అభిమాన సంఘాలు భాగస్వాములు కావాలన్నారు. క్షేత్రస్థాయిలో అభిమాన సంఘాలను పార్టీలో కలిపే ప్రక్రియను మూడు నెలల్లో పూర్తిచేద్దామన్నారు. జనసేన విజయంలో తమవంతు పాత్ర పోషించేందుకు చిరంజీవి యువత ప్రతినిధులు సంసిద్ధత వ్యక్తంచేశారు.
ఈ తరహా సమావేశాలను రానున్న రోజుల్లో మరిన్ని నిర్వహించి అభిమానులు, పార్టీ కార్యకర్తల మధ్య మరింత సమన్వయం సాధిద్దామని మనోహర్ ప్రకటించారు. మరో వైపు చిరంజీవి మద్దతు జనసేనకే ఉంటుందని మెగా బ్రదర్ నాగబాబు ప్రకటించిన వెంటనే మెగా అభిమాన సంఘాలతో మనోహర్ భేటీ కావడం ప్రాధాన్యత సంతరించుకుంది.