హుజూరాబాద్ ప్రీమియర్ లీగ్‌లో ఒక టీమ్ తమ అభ్యర్థితో బరిలోకి దిగిపోయింది. అభ్యర్థి అనౌన్స్‌మెంట్‌తో గ్రౌండ్ అదిరిపోయేలా ఎంట్రీ ఇచ్చింది. ఒకవైపు గెల్లు శ్రీనివాస్ అభ్యర్థిత్వం ప్రకటించగా.. మరోవైపు హరీష్‌రావు హార్డ్ హిట్టింగ్ పంచ్‌లతో ప్రత్యర్థులపై పైచేయి సాధించింది గులాబీ టీమ్. మరి కమలం జట్టు ఈటలను బ్యాటింగ్ దింపినట్లే అంటున్నారు ఆ పార్టీ నాయకులు. మరి హస్తం టీమ్ మాత్రం ఇంకా తేల్చుకోలేని పరిస్థితిలో ఉండిపోయింది.
నోటిఫికేషన్ రానే వచ్చింది.. తెలంగాణ ఫోకస్ అంతా హుజూరాబాద్ చుట్టూ కేంద్రీకృతం అయింది. ఏ పార్టీ పస ఏంటో చూపించే హుజురాబాద్ బైపోల్‌కు రెడీ అయిపోయింది. ఆరు నెలలుగా హీటెక్కిస్తున్న ఈ నియోజకవర్గం ఇప్పుడు షెడ్యూల్‌లో మరింత వేడెక్కించబోతోంది.
తెలంగాణ మలిదశ ఉద్యమాన్నిఒక మలుపు తిప్పిన కరీంనగర్ జిల్లా.. ఇప్పుడు మరో మరోసారి చర్చకు కేంద్రంగా మారింది. అందరి కళ్లు కరీంనగర్ జిల్లా హుజురాబాద్ ఉప ఎన్నికపైనే ఫోకస్ పెట్టాయి. దాదాపుగా బీజేపీ అభ్యర్థిని ప్రకటించినట్లేగానే భావిస్తున్నాయి రాజకీయ వర్గాలు. రాజీనామా చేసి బీజేపీ నుంచి పోటీ చేసేందుకు ఈటల రాజేందర్ రెడీ అయినట్లే అని పార్టీ వర్గాలు కూడా అంటున్నాయి. మరోవైపు ఆరు సార్లు విజయం సాధించా, మళ్ళీ విజయ ఢంకా మోగిస్తానంటున్నారు మాజీ మంత్రి ఈటల రాజేందర్.
మొత్తం ఆరు సార్లు విజయం సాధించి నియోజకవర్గంపై పట్టు సాధించిన ఈటల రాజేందర్ ఈ సారి కూడా గెలుస్తారా లేదా అనే ఉత్కంఠ నెలకొంది. ఎందుకంటే టీఆర్‌ఎస్ కూడా హుజూరాబాద్‌ను ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. మంత్రులను అక్కడ మోహరించింది. ఏ షెడ్యూల్ లేకముందే అక్కడ టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ మకాం పెట్టాయి. కులాలవారీగా, ప్రాంతాలవారీగా మీటింగ్‌లు పెట్టి ఓట్లు కూడగడుతున్నాయి.
ఉప ఎన్నికల నగార మోగడంతో కాంగ్రెస్ పరిస్థితి ఏంటన్నది కూడా రాజకీయంగా ఆసక్తి రేపుతున్న అంశం. ఎవరిని దింపాలనే అంశంలో తేల్చుకోలేక పోతోంది. గత ఎన్నికల్లో ఆ పార్టీ నుండి పోటీ చేసిన కౌశిక్ రెడ్డి టీఆర్ఎస్ లో చేరిపోయారు. దీంతో కొత్త పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి మొదట్లో దీనిపై కొంత దృష్టిపెట్టినా.. ఎన్నికలకు సమయం ఉందని ఎంపిక వాయిదా వేస్తూ వచ్చారు. కానీ ఇప్పుడు నోటిఫికేషన్ కూడా వచ్చింది. ఈ నేపథ్యంలో అభ్యర్థి ఎవరు అన్నది ఉత్కంఠగా మారింది.
బలమైన అభ్యర్థి వేటలో ఉన్న కాంగ్రెస్ కొండా దంపతుల దింపాలని చూస్తున్నట్లుగా తెలుస్తోంది. తమ నియోజవకర్గాలకు దగ్గరగా ఉండటంతో పాటు సంబంధాలున్న నియోజకవర్గం కావటంతో కొండా సురేఖ వైపు రేవంత్ రెడ్డి మొగ్గుచూపుతున్నట్లు తెలుస్తోంది. కొండా సురేఖ కూడా ఓకే చెప్పినట్లు తెలుస్తోంది. ఒకట్రెండు రోజుల్లో అభ్యర్థిని కాంగ్రెస్ ఫైనల్ చేసే అవకాశం ఉంది.
ఇక మిగతా పక్షాల మాటెలా ఉన్నా.. పోటీ మాత్రం టీఆర్‌ఎస్, బీజేపీ అన్నట్టుగానే ఉండే అవకాశాలున్నాయి. మొన్నటి వరకు హుజురాబాద్‌లో తనకు తిరుగులేదన్నట్టుగా పోటీ చేస్తూ వచ్చిన ఈటల.. అనూహ్యంగా పార్టీ మారిన నేపథ్యంలో ఆయన భవిష్యత్ ఎలా ఉంటుందన్నది ఈ ఉపఎన్నిక అద్దం పట్టనుంది. అలాంటిది ఇప్పుడు షెడ్యూల్ వచ్చేసింది. ఇక ఈ హీట్ ఎలా ఉంటుందో ఊహించుకోవచ్చు. ఒక్కమాటలో చెప్పాలంటే.. హుజూరాబాద్ పొలిటికల్ లీగ్ ఇప్పుడు తెలంగాణ మొత్తానికీ పొలిటికల్ లీగ్ అనే చెప్పాలి.
ఇవి కూడా చదవండి: Vitamin D Deficiency: మీలో విటమిన్ డి లోపం ఉంటే మీ నాలుక గుర్తిస్తుంది.. ఎలానో తెలుసా..