మైకులన్నీ మూగబోయాయి. నేతలంతా సైలెంట్ అయ్యారు. 3 నెలల తర్వాత హుజూరాబాద్ రాజకీయ రణగణ ధ్వనులు ఆగిపోయాయి. ఇక మిగిలిందల్లా ఓటరు దేవుడి నిర్ణయం మాత్రమే.. 30వ తేదీ పోలింగ్ జరుగుతుంది. వచ్చే నెల 2వ తేదీ కౌంటింగ్ జరుగుతుంది. చివరి రోజు పార్టీలన్నీ ప్రచారాన్ని హోరెత్తించాయి. రాత్రి 7 గంటల తర్వాత నేతలు సైలెంట్ అయిపోయారు. బయటి నేతలు తమ సొంత ప్రాంతాలకు వెళ్లిపోయారు.
ఈ నెల 30వ తేదీ శనివారం పోలింగ్ జరుగుతుంది. ఈ నియోజకవర్గంలో మొత్తం రెండు లక్షల 36 వేల 873 మంది ఓటర్లు ఉన్నారు. పురుషుల కన్నా మహిళా ఓటర్లే ఎక్కువ. లక్షా 19 వేల 93 మంది మహిళా ఓటర్లు ఉంటే లక్షా 17 వేల 779 మంది పురుష ఓటర్లు ఉన్నారు. నాలుగు మండలాల్లో 306 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. మొత్తం 30 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు.
172 సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను, 63 అత్యంత సమస్యాత్మక కేంద్రాలను గుర్తించారు. రెండు వేల మంది పోలీసులు, 20 కంపెనీల కేంద్ర బలగాల సిబ్బంది ఉప ఎన్నిక బందోబస్తులో ఉంటారు. కరోనా నిబంధనలను పాటిస్తూ ఓటేయాల్సి ఉంటుంది. మాస్క్ తప్పనిసరి. రెండు డోస్‌ల వ్యాక్సిన్ తీసుకున్న వారిని, లేదంటే RTPCR టెస్ట్ చేయించున్న వారినే పోలింగ్ సిబ్బందిగా నియమిస్తున్నారు.
మరోవైపు ఇప్పటి వరకు 3 కోట్ల 29 లక్షల 36 వేల 827 రూపాయలను సీజ్ చేశారు అధికారులు. 1091 లీటర్ల మద్యాన్ని, 11 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. 30 గ్రాముల బంగారం, 14 కిలోల వెండిని సీజ్ చేశారు. 66 చీరలు, 50 టీ షర్ట్‌లను స్వాధీనం చేసుకున్నారు.
ఇవి కూడా చదవండి: LPG Gas Prices: దీపావళి ముందే గ్యాస్ బండకు రెక్కలు.. రూ.100 వరకు పెరగొచ్చంటున్న మార్కెట్ వర్గాలు..
Covid Lockdown: థర్డ్ వేవ్ భయాలు.. దేశంలోని ఆ నగరంలో మళ్లీ లాక్‌డౌన్..