హర్యానాలో సీఎం మనోహర్ లాల్ ఖట్టర్ ప్రభుత్వంపై కాంగ్రెస్ పార్టీ పెట్టిన అవిశ్వాస తీర్మానం వీగిపోయిన సంగతి తెలిసిందే. అసెంబ్లీలో నిన్న 23 ఓట్లతేడాతో ఖట్టర్ ప్రభుత్వం నెగ్గింది. తమ ప్రయోజనాలను కాదని జన నాయక్ జనతా పార్టీ సభ్యులు, ఇతర ఇండిపెండెంట్ ఎమ్మెల్యేలు ప్రభుత్వానికి అనుకూలంగా ఓటు చేశారని ఆగ్రహించిన అన్నదాతలు వీరిని బాయ్ కాట్ చేయాలని నిర్ణయించారు. ఈ మేరకు సంయుక్త కిసాన్ మోర్చా గురువారం ఓ ప్రకటన విడుదల చేస్తూ ప్రభుత్వాన్ని సమర్థించిన జేజేపీ నేతలతో బాటు ఈ స్వంత్రంత్ర ఎమ్మెల్యేల ఇళ్లను కూడా ముట్టడించాలని, వీరు పాల్గొనే కార్యక్రమాలు, సభలు, సమావేశాలను బహిష్కరించాలని నిర్ణయించినట్టు పేర్కొంది. అంబాలా లో నేడు స్థానిక ఎమ్మెల్యే అసీం గోయెల్, సిర్సాలో ఇండిపెండెంట్ సభ్యుడు గోపాల్ గోయల్ కందా ఇళ్ల ముందు రైతులు ధర్నా నిర్వహించారు. ఇలాగే జన నాయక్ జనతా పార్టీ ఎమ్మెల్యేల ఇళ్ల ముందు కూడా నిరసన ప్రదర్శనలు చేస్తామని ఈ మోర్చా వెల్లడించింది.
నిజానికి జేజేపీ ఎమ్మెల్యేలు రైతు కుటుంబాల నుంచి వచ్చారని, అలాంటిది వారు తమకు వ్యతిరేకంగా ఈ ప్రభుత్వాన్ని సమర్థించడమేమిటని అన్నదాతలు అంటున్నారు. (అసెంబ్లీలో జన నాయక్ జనతా పార్టీ సభ్యులు 10 మంది ఉన్నారు). ఈ ఎమ్మెల్యేలు తమ గ్రామాలకు వచ్చినప్పుడు నల్ల జెండాలతో స్వాగతం చెప్పాలని, వీరిని ఎలాంటి సభలు, సమావేశాలు జరపకుండా అడ్డుకోవాలని రైతులు నిర్ణయించారు. జన నాయక్ జనతా పార్టీ నేత దుశ్యంత్ చౌతాలా ము త్తాత ,తండ్రి కూడా రైతు ప్రయోజనాల కోసమే పోరాడారని వారు గుర్తు చేశారు. లోగడ సాక్షాత్తూ సీఎం మనోహర్ లాల్ ఖట్టర్ ఓ కార్యక్రమంలో పాల్గొనేందుకు అంబాలాకు రాగా వారు ఆయనకు నల్ల జెండాలు చూపి ఆయన కాన్వాయ్ ని అడ్డుకోవడంతో ఆయన చేసేది లేక వెనుదిరగాల్సి వచ్చింది . ఆయన వచ్ఛే మార్గంలో వారు టైర్లు కూడా దహనం చేశారు,
మరిన్ని ఇక్కడ చదవండి: