టీఆర్‌ఎస్ పార్టీలో అసంతృప్తిగా ఉన్న కొందరు నేతలు బీజేపీ వైపు చూస్తున్నట్లుగా తెలుస్తోంది. గులాబీ గూటిలో పొసగని నాయకులు ఒక్కొక్కరుగా కమలం ముఖ్య నేతలతో రహస్యంగా సమావేశమవుతున్నారు. మరోవైపు, టీఆర్‌ఎ్‌సలో అసంతృప్తిగా ఉన్న నేతలను తమ వైపునకు తిప్పునేందుకు కమలనాథులు సైతం పావులు కదుపుతున్నారు. ఈటల రాజేందర్‌ను మంత్రి వర్గం నుంచి బర్తరఫ్ చేసిన అనంతరం రాష్ట్ర రాజకీయాల్లో రోజు రోజుకి రసవత్తర చర్చకొనసాగుతుంది.
ప్రభుత్వం నుంచి కేసుల ఒత్తిడి ఎదుర్కొంటున్న మాజీ మంత్రి, టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్, బీజేపీ ముఖ్య నేతలతో సమావేశం జరిగినట్లుగా తెలుస్తోంది. అత్యంత రహస్యంగా జరిగిన ఈ భేటీలో ఎల్లారెడ్డి మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్‌రెడ్డి కూడా ఉన్నట్లు విశ్వసనీయ సమాచారం. ఈటలతో పాటు మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్ రెడ్డి, మాజీ జడ్పీ చైర్మన్ తులా ఉమా మరి కొంత మంది నాయకులు చేరికపై చర్చ జరిగినట్లుగా తెలుస్తోంది.
భేటీ తర్వాత బండి సంజయ్‌తో జితేందర్ రెడ్డి గండిపేట్ ఫామ్‌హౌస్‌లో చర్చలు జరిపినట్లు సమాచారం. ఇక బీజేపీ జాతీయ నేత హామీతో ఈటలను బీజేపీలో చేర్చుకునేందుకు చర్చ జరుగుతోంది. ఇక జాతీయ పార్టీ హామీ ఓకే అయితే ఈటెల బీజేపీలో చేరేందుకు రూట్ క్లీయర్ కానుంది.
అయితే ఇప్పటికే ఈటల పలు పార్టీలకు చెందిన నేతలతో ఆయన భేటీ అయ్యారు. చేవెళ్ల మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డితో రహస్య మంతనాలు జరిపిన విషయం తెలిసిందే. అనంతరం పలువురు బీజేపీ నేతలను కూడా కలిశారు. ప్రస్తుతం ఫాంహౌస్‌లో కిషన్ రెడ్డితో పాటు పలువురు కీలక నేతలతో రహస్య మంతనాలు జరుపుతునట్లు తెలుస్తోంది. టీఆర్ఎస్‌లోని అసంతృప్తి నేతలను, ఉద్యమ కారులను బీజేపీలో చేరేలా చూస్తానని ఈటల మాట ఇచ్చినట్లుగా తెలుస్తోంది. ఈటల చేరికపై ఢిల్లీ నాయకత్వానికి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ సమాచారం ఇచ్చినట్లుగా సమాచారం. అయితే కేంద్ర నాయకత్వం మాత్రం పార్టీలో చేరుతున్న వారి లిస్ట్ అడిగినట్లుగా తెలుస్తోంది. నడ్డా, అమిత్ షా ల అప్పోయింట్మెంట్ దొరికిన వెంటనే ఢిల్లీకి నేతలు వెళ్లనున్నారు.
ఇదిలావుంటే ప్రస్తుతానికి ఇండిపెండెంట్ అభ్యర్థిగానే ఉపఎన్నికల్లో పోటీ చేయాలని ఈటల రాజేందర్ భావిస్తున్నట్లు ఆయన సన్నిహితులు చెబుతున్నారు. మరోవైపు కొత్త పార్టీని పెడతారన్న ఊహగానాలు కూడా వినిపిస్తున్నాయి. ఈటల పెట్టబోయే కొత్త పార్టీ బీసీల వేదికగా ఉంటుందని ప్రచారం జరుగుతోంది. కానీ ఇప్పటి వరకు దానిపై ఎలాంటి క్లారిటీ రాలేదు. అయితే తాజాగా ఈటల తన ట్విట్టర్ ఫ్రొఫైల్ పిక్ మార్చారు.అందులో మాత్రం కొత్త పార్టీ సంకేతాలు కనిపిస్తున్నాయి. ఈటల మెడలో కొత్త కండువా.. మారిన ట్విట్టర్ ప్రొఫైల్ పిక్.. అవును ఇది నిజం. మాజీ మంత్రి ఈటల రాజేందర్ తెలంగాణ రాజకీయాల్లో మరో ఆసక్తికర చర్చకు తెరలేపుతున్నారు. మెడలో కండువా మాత్రమే కాదు ప్రొఫైల్ పిక్‌లో తెలంగాణకు సంబంధించిన అనేక అంశాలను ఇందులో జోడించారు.