ఈటల మెడలో కొత్త కండువా.. మారిన ట్విట్టర్ ప్రొఫైల్ పిక్.. అవును ఇది నిజం. మాజీ మంత్రి ఈటల రాజేందర్ తెలంగాణ రాజకీయాల్లో మరో ఆసక్తికర చర్చకు తెరలేపుతున్నారు. మెడలో కండువా మాత్రమే కాదు ప్రొఫైల్ పిక్‌లో తెలంగాణకు సంబంధించిన అనేక అంశాలను ఇందులో జోడించారు. ఎప్పటి నుంచో ఈటల కొత్త పార్టీ పెడతున్నారన్న ప్రచారంకు కొత్త ఊపునిస్తున్నట్లుగా ఆయన ట్విట్టర్ ప్రొఫైల్ పిక్ ఉంది. ఈటల కాంగ్రెస్‌లో లేక బీజేపీలో చేరుతారా .. కొత్త పార్టీని పెడతారా అంటూ రకరకాలుగా జరుగుతున్న చర్చలకు ఆయన చెక్ పెట్టారు. దీంతో ఆయన వర్గంకు ఓ క్లారిటీ వచ్చినట్లుగా కనిపిస్తోంది. కొత్త పార్టీపై సోషల్ మీడియా ద్వారా ఈ విషయాన్ని స్పష్టం చేశారు. ఈటల ట్విట్టర్‌లోని తన ప్రొఫైల్‌లో ఆ విషయాన్ని ఫోటో ద్వారా తెలియజేశారు.
ఈటల రాజేందర్‌ను అధిష్టానం మంత్రివర్గం నుంచి తొలగించినా.. ప్రస్తుతానికి టెక్నికల్‌గా టీఆర్ఎస్ పార్టీ సభ్యుడిగా, ఆ పార్టీ నుంచి గెలుపొందిన ఎమ్మెల్యేగానే కొనసాగుతున్నారు. అయితే ఓ వైపు టీఆర్ఎస్ పార్టీ మరోవైపు ఈటల ఎవరికి వారు ఈ అంశంపై ఎత్తుకు పై ఎత్తులను వేస్తున్నారు. తనంతట తానుగా పార్టీ నుంచి వెళ్ళిపోయేలా ఆ పార్టీ ఆలోచిస్తూ ఉంటే, పార్టీయే తనను గెంటివేసే వరకు వేచి చూడాలని ఈటల భావిస్తున్నట్లుగా కనిపిస్తోంది. అయితే ఇదే సమయంలో ఆయన భవిష్యత్తు కార్యాచరణపై ఫోకస్ చేసినట్లుగా ఈ కొత్త ఫ్రొఫైల్ చూస్తే అర్థమవుతోంది. ఇప్పటికే పలు పార్టీలకు చెందిన వ్యక్తులతో ఆయన వరుసగా చర్చలు జరుపుతున్నట్లుగా తెలుస్తోంది.
ఇదే సమయంలో ట్విట్టర్ ప్రొఫైల్‌లో ఆయన పెట్టుకున్న ఫ్రొఫైల్ ఇమేజ్ ఇప్పుడు అనేక రకాల అంశాలకు తెరలేపుతోంది. ట్విట్టర్ ఇమేజ్‌లో ఈటల మెడలో నీలి కండువా వేసుకొవడంతోపాటు ఆ పక్కనే తెలంగాణ మ్యాప్‌లో పిడికిలి కనిపిస్తోంది. రాష్ట్ర మ్యాప్‌లో కాషాయం రంగు ఉండేలా చూసుకున్నారు. దీంతో పాటు తెలంగాణ రాష్ట్ర సెంటిమెంట్ కోసం తెలంగాణ తల్లి చిత్రాన్ని కూడా ఇమేజ్‌లో పెట్టుకున్నారు. ఆ పక్కనే తెలంగాణ అమరవీరుల స్థూపాన్ని పెట్టుకున్నారు.
బీసీల గొంతుకగా ఉన్న జ్యోతిబా ఫూలే చిత్రంతోపాటు రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఫోటో ఉంది. ఇక ‘జై తెలంగాణ‘ అనగానే స్ఫూర్తిగా నిలిచే ప్రొఫెసర్ జయశంకర్ చిత్రపటాన్ని కూడా పెట్టుకున్నారు. పచ్చని, పసిడి తెలంగాణ సాధనను తలపించేలా మొత్తం చిత్రానికి హైలైట్‌గా నిలిచే పిడికిళ్ళు, ఉద్యమ సన్నివేశం, యావన్మంది ప్రజలు రాష్ట్ర సాధనకు ఉద్యమంలో కలిసి నడిచిన ఫోటోను వాడారు. నీలి, ఆకు పచ్చ రంగులో కనిపించే కండువా అటు బహుజనులకు, ఇటు రైతులకు ప్రతీకగా ఉంటుందనే తన మెడలో ఈటల వేసుకున్నట్లు తెలుస్తోంది. ఈటల కొత్త ట్విట్టర్ ప్రొఫైల్ మరో కొత్తకు తెరలేపుతోంది.