MLC Election Result 2021 Date: రేపే గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్‌.. ఎమ్మెల్సీ ఓట్లను ఎలా లెక్కిస్తారంటే..

తెలంగాణలో రెండు పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాలకు పోలింగ్‌ ఈ నెల 14 ముగిసిన విషయం తెలిసిందే. ఇక ఈ నెల 17న పోలైన ఓట్లను లెక్కించనున్నారు అధికారులు. ఇందుకోసం..

MLC Election Result 2021 Date:  రేపే గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్‌.. ఎమ్మెల్సీ ఓట్లను ఎలా లెక్కిస్తారంటే..
Mlc Counting

Edited By: Ram Naramaneni

Updated on: Mar 16, 2021 | 1:17 PM

MLC Election Result: తెలంగాణలో రెండు పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాలకు పోలింగ్‌ ఈ నెల 14 ముగిసిన విషయం తెలిసిందే. ఇక ఈ నెల 17న పోలైన ఓట్లను లెక్కించనున్నారు అధికారులు. ఇందుకోసం ఎన్నికల సంఘం అన్ని ఏర్పాట్లు సిద్ధం చేసింది. బ్యాలెట్‌ రూపంలో భద్రంగా ఉన్న అభ్యర్థుల అదృష్ట రేఖలు ఏ విధంగా ఉన్నాయో 17న తేలిపోనుంది.

ఎమ్మెల్సీ ఓట్ల లెక్కింపు ఇలా..
ముందుగా పోస్టల్ బ్యాలెట్ పేపర్లు ఓపెన్ చేస్తారు. పోస్టల్‌ బ్యాలెట్‌ లెక్కించిన తర్వాత బ్యాలెట్ బాక్సులు ఓపెన్ చేస్తారు. పోలయిన ఓట్లను 25 చొప్పున కట్టలుగా కడతారు. మొత్తం ఓట్లను కట్టలు కట్టడానికి 8 నుంచి 10 గంటలు పట్టే అవకాశం ఉంది. ఒక్కో కౌంటింగ్ టేబుల్ పై 40 కట్టలు అంటే వెయ్యి ఓట్లు పెడతారు. 8 హాళ్లలో కౌంటింగ్, ఒక్కో హల్ లో 7 టేబుల్స్ , మొత్తం 56 టేబుళ్ళు ఉపయోగిస్తారు.

ఇక కౌంటింగ్ ప్రక్రియ మొదలయ్యాక ముందుగా చెల్లని ఓట్లు పక్కన పెడతారు. ఆ తర్వాత మొదటి ప్రాధాన్యత ఓట్లు లెక్కిస్తారు. మొదటి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు పూర్తి కావడానికి 24 గంటల నుంచి 36 గంటలు పట్టే అవకాశం ఉంది. దీనికోసం మూడు షిఫ్ట్ ల్లో కౌంటింగ్ సిబ్బంది విధులు నిర్వర్తించనున్నారు. రెండు నియోజకవర్గాల్లోనూ అభ్యర్థులు భారీగా పోటీ పడటంతో కౌంటింగ్‌ ప్రక్రియ ఆలస్యం అయ్యే అవకాశం ఉంది.

ఈ నెల 14న హైదరాబాద్‌-రంగారెడ్డి్-మహబూబ్‌నగర్‌, నల్గొండ-వరంగల్‌-ఖమ్మం స్థానాలకు ఎన్నికలు జరిగాయి. ఉదయం 8 గంటలకు ప్రారంభమైన పోలింగ్‌ సాయంత్రం 4 గంటలకు ముగిసింది. 4 గంటలలోపు క్యూలైన్లలో ఉన్నవారికి ఓటు వేసేందుకు అవకాశం కల్పించారు.

హైదరాబాద్‌-రంగారెడ్డి-మహబూబ్‌నగర్‌ స్థానంలో మొత్తం 93 మంది అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. టీఆర్‌ఎస్‌ తరఫున సురభి వాణీదేవి, బీజేపీ నుంచి రామచందర్‌రావు, కాంగ్రెస్‌ తరఫున చిన్నారెడ్డితో పాటు స్వతంత్ర అభ్యర్థి ప్రొఫెసర్‌ నాగేశ్వర్‌ మధ్య గట్టి పోటీ నడిచింది.

ఇక నల్గొండ-వరంగల్‌-ఖమ్మం స్థానంలో మొత్తం 71 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. వీరిలో టీఆర్‌ఎస్‌ తరఫున పల్లా రాజేశ్వర్‌రెడ్డి, బీజేపీ నుంచి గుజ్జుల ప్రేమేందర్‌రెడ్డి, కాంగ్రెస్‌ తరఫున రాములు నాయక్‌, యువతెలంగాణ పార్టీ నుంచి రాణి రుద్రమరెడ్డి తదితరులు పోటీ పడ్డారు.

Read More:

మున్సిపల్‌ ఫలితాలతో వైసీపీ నేతల్లో ఫుల్‌ జోష్‌… ఆ మేయర్‌ పీఠం వైసీపీదేనన్న ఎంపీ భరత్‌