చంద్రబాబు బస చేసిన అర్‌ అండ్‌ బీ గెస్ట్‌ హౌస్‌కు కరెంట్‌ కట్‌.. కాన్వాయ్‌ కారు బ్యాటరీతో నడిచిన జనరేటర్‌..

|

Feb 26, 2021 | 3:14 PM

చిత్తూరు జిల్లాలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పర్యటన రెండోరోజు కొనసాగుతుంది. జిల్లాలోని శాంతిపురం, రామకుప్పం మండలాల్లో..

చంద్రబాబు బస చేసిన అర్‌ అండ్‌ బీ గెస్ట్‌ హౌస్‌కు కరెంట్‌ కట్‌.. కాన్వాయ్‌ కారు బ్యాటరీతో నడిచిన జనరేటర్‌..
Follow us on

చిత్తూరు జిల్లాలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పర్యటన రెండోరోజు కొనసాగుతుంది. జిల్లాలోని శాంతిపురం, రామకుప్పం మండలాల్లో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు రెండో రోజు పర్యటన కొనసాగుతుంది. చంద్రబాబు బస చేసిన కుప్పం ఆర్‌అండ్‌బి అతిథి గృహం వద్దకు ప్రజలు, టీడీపీ కార్యకర్తలు భారీగా చేరుకుంటున్నారు. ప్రజల నుంచి అర్జీలను చంద్రబాబు స్వీకరించారు.

అయితే చిత్తూరు జిల్లా కుప్పంలో టీడీపీ అధినేత చంద్రబాబుకు షాక్ తగిలింది. ఆయన బస చేసిన ఆర్‌ అండ్ బి గెస్ట్‌ హౌస్‌కు ఉదయం నుంచి విద్యుత్‌ సరఫరా నిలిచిపోయింది. దీంతో టీడీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. విద్యుత్ శాఖ అధికారుల తీరును తప్పుబడుతున్నారు. కనీసం జనరేటర్ ద్వారానైన విద్యుత్ సరఫరా చేయకపోవడం అధికారుల తీరుకు పరాకాష్ట అంటూ మండిపడుతున్నారు. కాన్వాయ్ కారు బ్యాటరీతో జనరేటర్ నడుపుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని చెప్తున్నారు. పార్టీ జాతీయ అధ్యక్షునికి ఇంత అవమానమా అంటూ ప్రశ్నిస్తున్నారు.

ఇక సీఎం జగన్‌, వైసీపీ ప్రభుత్వంపై చంద్రబాబు నాయుడు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. కుప్పం జగన్ జాగీరు కాదని అన్నారు. కుప్పంలోనే మకాం వేసి..వైసీపీకి డిపాజిట్ రాకుండా చేస్తానని స్పష్టం చేశారు. పుంగనూరులో జరిగిన పంచాయతీ ఎన్నికల్లో బలవంతపు ఏకగ్రీవాలు చేశారని ఆరోపించారు. ఇసుక అమ్ముతూ పేదల రక్తాన్ని జలగల్లాగా తాగుతున్నారన్నారు. రాజధాని, ప్రత్యేక హోదా, పోలవరం, విశాఖ ఉక్కు మొత్తం పోయాయని మండిపడ్డారు. జెట్ స్పీడుతో వైసీపీపై పోరాటం చేద్దామని బాబు పిలుపునిచ్చారు.

నిత్యావసర వస్తువుల ధరల పెంపుతో జనం బెంబేలెత్తిపోతున్నారన్నారు. పోలవరం, విశాఖ, అమరావతి అన్ని పోయాయని.. పోవడం తప్ప తెచ్చేవి ఏమీ లేదని వ్యాఖ్యానించారు. పుంగనూరులో పెద్దిరెడ్డికి డిపాజిట్ కూడా లేకుండా చేస్తానని అన్నారు. గేరు మార్చి తన తడాక చూపిస్తానని హెచ్చరించారు. రైతులను నిండా ముంచుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎర్ర చందన, ఇసుక స్మగ్లింగ్ ద్వారా పెద్దిరెడ్డి దోచుకుంటున్నారని ఆరోపించారు.

డబ్బులు తెచ్చి కుప్పంలో ఓటర్లకు పంచి వ్యస్థను నాశనం చేశారన్నారు. తెగించి ముందుకు పోవాలని కార్యకర్తలకు తెలిపారు. రౌడీ రాజ్యం నడుస్తోందని చంద్రబాబు విమర్శలు గుప్పించారు. రెండో కుప్పం నియోజకవర్గం కడపల్లి పంచాయతీ పోడూరు గ్రామంలో పర్యటించిన చంద్రబాబు పీఈఎస్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన టీడీపీ కార్యకర్త క్రిష్ణప్ప కుటుంబాన్ని అన్ని విధాలుగా ఆదుకుంటామని భరోసా ఇచ్చారు. మృతి చెందిన క్రిష్ణప్ప కుటుంబానికి పార్టీ తరపున రూ.50 వేల ఆర్థిక సహాయం అందజేస్తామని చంద్రబాబు తెలిపారు.

ఇక చంద్రబాబు పర్యటనలో అడుగడుగునా హారతులు.. ఓటమి తట్టుకోలేని అభిమానుల విషాదాలు.. యువత కురిపించే పుష్పవర్షాలు.. చంద్రబాబుకు కుప్పంలో జన ఘన నీరాజనం లభించింది. ఓట్లుగా ఎందుకు కురవలేకపోయిందో కానీ.. కళ్లెదుట కనిపించేసరికి అభిమానం కట్టలు తెగి ప్రవహించింది. బాబును ఆప్యాయంగా అక్కున చేర్చుకుంది. నేను ఇంతకాలం రాష్ట్రంకోసం పని చేశా. రాష్ట్రం బాగు పడితే ప్రజలందరూ బాగు పడతారనేదే నా తాపత్రయం. ఆ యావలో మీకు నష్టం జరిగింది. పొరపాటు చేశా.. ఇప్పుడు సరిదిద్దుకుంటాను. కొత్తరక్తం ఎక్కిస్తాను’ అని కార్యకర్తలకు చంద్రబాబు భరోసా ఇచ్చారు.

కుప్పం పర్యటనలో భాగంగా ఆయన గుడుపల్లె, కుప్పం రూరల్‌ మండల కార్యకర్తలతో సమావేశమయ్యారు. వాళ్లు నాయకులపై పలు ఫిర్యాదులు చేశారు. కష్టకాలంలో తమకు అండగా నిలవడం లేదని, పంచాయతీ ఎన్నికల్లో ఓటమి వారి నిర్వాకం ఫలితమేనని ఆగ్రహావేశాలు వ్యక్తం చేశారు. అంతా విన్న చంద్రబాబు వారిని చల్లబరచడానికి ప్రయత్నించారు. ‘ఇప్పుడొద్దు. కొన్ని బహిరంగంగా మాట్లాడాల్సినవి ఉంటాయి. మరికొన్ని నాలుగ్గోడల మధ్య చర్చించుకోవాల్సినవి ఉంటాయి. ఇక్కడ మనం మాట్లాడుకొంటే ఉన్న నాలుకకు మందేస్తే కొండ నాలుక ఊడినట్లవుతుంది’ అన్నారు.

Read more:

టీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ మధ్య జాబ్స్‌ ఫైట్‌.. గన్‌పార్క్‌ దగ్గర కుర్చీ వేసుకుని కాంగ్రెస్‌ వెయిటింగ్‌..