Prashant Kishor – Congress: ప్రముఖ రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ రాజకీయ భవితవ్యంపై సస్పెన్స్ కొనసాగుతోంది. ప్రశాంత్ కిషోర్ వ్యవహారం కాంగ్రెస్ పార్టీలో కొత్త చిచ్చు రాజేస్తోంది. ఆయన్ను కాంగ్రెస్ పార్టీలో చేర్చుకోవడంపై ఇప్పటికే పార్టీ సీనియర్లతో ఆ పార్టీ అధినేత్రి సోనియాగాంధీ చర్చించినట్లు తెలుస్తోంది. అయితే ఈ విషయంలో ఆ పార్టీ సీనియర్లు భిన్నాభిప్రాయాలు వ్యక్తంచేశారట. ప్రశాంత్ కిషోర్ చేరికను కొందరు సీనియర్ నేతలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్లు సమాచారం. తమ అభ్యంతరాలను వారు పార్టీ అధినేత్రి సోనియాగాంధీకి తెలియజేసినట్లు తెలుస్తోంది. మరీ ముఖ్యంగా.. కాంగ్రెస్ పార్టీలో సమూల ప్రక్షాళన చేపట్టాలని డిమాండ్ చేస్తూ గత ఏడాది సోనియాగాంధీకి లేఖరాసిన జీ-23 నేతలు ప్రశాంత్ కిషోర్ చేరికను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఇటీవల వీరుందరూ మాజీ కేంద్ర మంత్రి కపిల్ సిబల్ నివాసంలో సమావేశమై ఈ అంశంపై చర్చించారు. పార్టీలో పీకే చేరికను ఎట్టి పరిస్థితిలోనూ అంగీకరించకూడదని వారు నిర్ణయించినట్లు తెలుస్తోంది.
అటు మరికొందరు కాంగ్రెస్ పార్టీ నేతలు మాత్రం ప్రశాంత్ కిషోర్‌ను పార్టీలో చేర్చుకోవాలని హైకమాండ్‌కు సూచిస్తున్నారు. రాజకీయ వ్యూహకర్త పీకేను పార్టీలో చేర్చుకుంటే అన్ని విధాలా పార్టీకి లబ్ధి చేకూరుతుందని వారు అభిప్రాయపడినట్లు సమాచారం.ఇటీవల జరిగిన పశ్చిమ బెంగాల్, తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో ప్రశాంత్ కిషోర్ రాజకీయ వ్యూహాలు తృణాముల్ కాంగ్రెస్ పార్టీ, డీఎంకేలకు బాగా అక్కరకు వారు చెబుతున్నారు. పార్టీ నేతల నుంచి భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్న తరుణంలో ప్రశాంత్ కిషోర్‌ను పార్టీలో చేర్చుకోవడమా? పీకే సారథ్యంలో ప్రత్యేక ప్రచార కమిటీని ఏర్పాటు చేయడమా? అనే అంశంపై కాంగ్రెస్ అధిష్టానం తర్జనభర్జనపడుతున్నట్లు సమాచారం.
ప్రశాంత్ కిషోర్‌తో కలిసి పనిచేసేందుకు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలకు ఎలాంటి అభ్యంతరాలు లేవని సమాచారం. 2017 యూపీ ఎన్నికల సమయంలోనూ పీకేతో వారిద్దరూ కలిసి పనిచేశారు. నాటి ఎన్నికల్లో సమాజ్‌వాది పార్టీతో కాంగ్రెస్ పార్టీ పొత్తు పెట్టుకుంది. అయితే ఆ ఎన్నికల ఫలితాలు కాంగ్రెస్ కూటమికి తీవ్ర అసంతృప్తిని కలిగించాయి. అందుకే పీకే కొన్ని సందర్భాల్లో మాత్రమే సక్సస్ అవుతున్నారని కొందరు నేతలు అభిప్రాయపడుతున్నారు. మొత్తానికి ప్రశాంత్ కిషోర్‌ను కాంగ్రెస్ పార్టీలో చేర్చుకోవాలా? వద్దా? అన్న అంశంపై సోనియాగాంధీ త్వరలోనే ఓ నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది.
Also Read..
Huzurabad Elections: హరీష్ రావుపై సంచలన ఆరోపణలు చేసిన ఈటెల.. బహిరంగ చర్చకు సిద్ధమంటూ సవాల్..
TS EAMCET 2021: విద్యార్థులకు కీలక సూచన.. ఇంజనీరింగ్ కౌన్సెలింగ్‌లో మార్పులు..