AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

నాగార్జునసాగర్‌ ప్రజలకు సీఎం కేసీఆర్‌ కృతజ్ఞతలు.. ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తామని స్పష్టం

నాగార్జునసాగర్ అసెంబ్లీ స్థానం బరిలో టీఆర్ఎస్ పార్టీ ఘనవిజయంపై సీఎం కేసీఆర్ స్పందించారు. తమ అభ్యర్థి నోముల భగత్ ను గెలిపించినందుకు..

నాగార్జునసాగర్‌ ప్రజలకు సీఎం కేసీఆర్‌ కృతజ్ఞతలు.. ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తామని స్పష్టం
Cm Kcr
K Sammaiah
|

Updated on: May 02, 2021 | 5:31 PM

Share

దుబ్బాక ఉప ఎన్నికల్లో ఓటమి, జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో సగం సిట్టింగ్‌ స్థానాలు కోల్పోవడం వంటి పరిణామాలు టీఆర్‌ఎస్‌ శిబిరంలో నిరుత్సాహాన్ని నింపాయి. ఆ తర్వాత వచ్చిన రెండు పట్టభద్రుల ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ అభ్యర్థుల విజయం, తాజాగా నాగార్జునసాగర్‌ ఉప ఎన్నికలో గులాబీ రెపరెపలు టీఆర్ఎస్ పార్టీకి ఎంతో ఊరటనిచ్చింది.

నాగార్జునసాగర్ అసెంబ్లీ స్థానం బరిలో టీఆర్ఎస్ పార్టీ ఘనవిజయంపై సీఎం కేసీఆర్ స్పందించారు. తమ అభ్యర్థి నోముల భగత్ ను గెలిపించినందుకు నాగార్జునసాగర్ నియోజకవర్గ ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తామని స్పష్టం చేశారు. త్వరలోనే నాగార్జునసాగర్ ను సందర్శిస్తానని, ప్రజల సమస్యల్ని పరిష్కరిస్తానని సీఎం కేసీఆర్ వెల్లడించారు. లిఫ్ట్ ఇరిగేషన్ స్కీంలను శరవేగంగా పూర్తిచేస్తామని అన్నారు.

టిఆర్ఎస్ అభ్యర్థి నోముల భగత్ కు ఆశీర్వచనమిచ్చి, భారీ మెజారిటీతో గెలిపించినందుకు నాగార్జున సాగర్ నియోజకవర్గ ప్రజలందరికీ సిఎం కెసిఆర్ హృదయపూర్వక కృతజ్జతలు, ధన్యవాదాలు తెలిపారు. టిఆర్ఎస్ ప్రభుత్వ విధానం ప్రకారం, ఎన్నికల సందర్భంలో ఇచ్చిన ప్రతి వాగ్ధానాన్ని నెరవేరుస్తామని సిఎం తెలిపారు. త్వరలోనే ఎమ్మెల్యే భగత్ తోపాటు నాగార్జున సాగర్ నియోజక వర్గం సందర్శించి ప్రజల సమస్యలన్నీ పరిష్కరిస్తామని సిఎం స్పష్టం చేశారు.

దేవరకొండ, నాగార్జున సాగర్, మిర్యాలగూడ, హుజూర్ నగర్, కోదాడ నియోజకవర్గాల పరిధుల్లో ఇటీవల మంజూరు చేసిన లిఫ్టు ఇరిగేషన్ స్కీంలను శరవేగంగా పూర్తిచేసి ప్రజలకు నీరందిస్తామని సిఎం తెలిపారు. ఎన్నికల సందర్భంలో పార్టీ నాయకులు సేకరించిన ప్రజా సమస్యన్నింటిని కూడా సత్వరమే పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.

ఎవరు ఎన్నిరకాల దుష్ప్రచారం చేసినా.. టిఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల పట్ల తమ విశ్వాసాన్ని ప్రస్పుటంగా ప్రకటించిన ప్రజలకు సిఎం హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. రెట్టించిన ఉత్సాహంతో మున్ముందు ప్రజాసేవకు టిఆర్ఎస్ పార్టీ మరింతగా పునరంకితమౌతుందని.. సిఎం మారోమారు ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు.

విజయం సాధించిన అభ్యర్ధి నోముల భగత్ కు సిఎం కెసిఆర్ హృదయ పూర్వక అభినందనలు తెలిపారు. చక్కగా ప్రజాసేవ చేసి మంచి రాజకీయ భవిష్యత్తుకు పునాదులు వేసుకోవాలని నోముల భగత్ కు సిఎం సూచించారు. నోముల భగత్ విజయం కోసం కృషి చేసిన టిఆర్ఎస్ పార్టీ నాయకులకు కార్యకర్తలకు సిఎం అభినందనలు తెలిపారు.

నోముల నర్సింహయ్య మరణంతో నాగార్జున సాగర్ నియోజకవర్గానికి ఉప ఎన్నిక నిర్వహించడం తెలిసిందే. టీఆర్ఎస్ తరఫున నోముల తనయుడు భగత్ పోటీ చేయగా, కాంగ్రెస్ తరఫున సీనియర్ నేత జానారెడ్డి, బీజేపీ నుంచి పానుగోతు రవికుమార్ నాయక్ పోటీ చేశారు.