పాట్నా: బీహార్ లో కాంగ్రెస్ పార్టీకి భారీ షాక్ తగిలింది. బాలాకోట్ దాడులపై కాంగ్రెస్ పార్టీ సందేహాలు వ్యక్తం చేయడం పట్ల ఆ పార్టీకి చెందిన నేతలో ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్టీ సీనియర్ నేత, అధికార ప్రతినిధి వినోద్ శర్మ పార్టీకి రాజీనామా చేసి షాక్ ఇచ్చారు. ఈ మేరకు ఆయన కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీకి లేఖ రాశారు. వైమానిక దళ దాడులను ప్రశ్నించడం వల్ల క్షేత్రస్థాయిలో ఎంతో మంది కార్యకర్తలు నిరాశకు గురయ్యారన్నారు. ఈ విషయంపై గత నెల రోజులుగా రాహుల్‌కు లేఖలు పంపినట్లు ఆయన తెలిపారు. అయినా తమ విన్నపాన్ని ఏమాత్రం పట్టించుకోలేదన్నారు. పార్టీ ప్రాథమిక సభ్యత్వంతో పాటు అన్ని పదవులకు రాజీనామా చేస్తున్నాను. వైమానిక దాడులకు ఆధారాలు అడగడం పట్ల నేను మనస్తాపానికి గురయ్యాను. కాంగ్రెస్ వైఖరిపై నిరాశతో ఉన్నాను. దేశ రక్షణలో భాగంగా భద్రతా బలగాలు చేపట్టే ప్రతి చర్యని మనం సమర్థించాలి. దాడులను రాజకీయం చేయోద్దు అని వినోద్ శర్మ అన్నారు
పుల్వామా దాడికి ప్రతీకారంగా భారత వైమానిక దళం పాకిస్థాన్‌లోని జైష్ ఎ మహ్మద్ ఉగ్రస్థావరాలను నేలమట్టం చేసిన విషయం తెలిసిందే. దీనిపై విపక్షాలు పలు అనుమానాలు లేవనెత్తడంతో రాజకీయ దుమారం చెలరేగింది. దాడులకు సంబంధించిన ఆధారాలను బహిర్గతం చేయాలని కొందరు నేతలు డిమాండ్ చేశారు. అలాగే దాడుల్లో మరణించిన ఉగ్రవాదుల సంఖ్యను కూడా తెలపాలని కోరారు. దీంతో దాడుల్ని రాజకీయ లబ్ధి కోసం వాడుకుంటున్నారని అధికార, విపక్షాలు ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటున్న విషయం తెలిసిందే.