నందిగ్రామ్ లో బీజేపీ అభ్యర్థి సువెందు అధికారి ర్యాలీపై తృణమూల్ కాంగ్రెస్ కార్యకర్తలు దాడి చేశారని కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ఆరోపించారు. నందిగ్రామ్ లోని సోనా చుర ప్రాంతంలో ఈ ఎటాక్ జరిగిందన్నారు. పోలీసుల సమక్షంలోనే బీజేపీ కార్యకర్తలపై దాడి జరిగినా ఖాకీలు ప్రేక్షకపాత్ర వహించారని., ఓ బీజేపీ సభ్యుడు తీవ్రంగా గాయపడ్డాడని ఆయన అన్నారు. ఈ కార్యకర్తను తోటివారు ఆసుపత్రికి తరలించగా టీఎంసీ గూండాలు అక్కడ కూడా గుమికూడి నానా యాగీ చేశారని అన్నారు. సీఎం మమతా బెనర్జీ ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికల్లో ఫైట్ చేయాలనీ, సువెందు అధికారి పాదయాత్ర ఈ రోజు ప్రారంభమైందని ఆయన చెప్పారు. ఈ యాత్రను అడ్డుకోవడానికి తృణమూల్ కాంగ్రెస్ యత్నిస్తోందన్నారు. తన కళ్ళ ముందే తమ యువమోర్చా నాయకుడొకరిపై ఎటాక్ జరిగిందని, ఇక్కడ వెంటనే పారా మిలిటరీ బలగాలను మోహరించాలని తాను ఎలెక్షన్ కమిషన్ ని కోరుతున్నానని ఆయన అన్నారు.
అటు-తన ఇంటివద్ద, డజనుకు పైగా బాంబు దాడులు జరిగాయని, ముగ్గురు బీజేపీ కార్యకర్తలు గాయపడ్డారని రాష్ట్ర బీజేపీ ప్రధాన కార్యదర్శి అర్జున్ సింగ్ తెలిపారు.మొత్తం 15 చోట్ల టీఎంసీ గూండాలు ఈ ఎటాక్ లు చేశారన్నారు. పోలీసులకు ఫిర్యాదు చేసినా ప్రయోజనం లేకపోయిందని ఆయన చెప్పారు. అయితే ఈ ఆరోపణలను తృణమూల్ కాంగ్రెస్ నేతలు ఖండించారు. ఎన్నికల తరుణంలో ఈ విధమైన ఆరోపణలు చేయడం రాజకీయ ప్రయోజనాలకేనన్నారు. ఈ బాంబు దాడులకు ఆధారాలు చూపాలని వారు డిమాండ్ చేశారు. ఇలా ఉండగా పురూలియాలో ప్రధాని మోదీ పాల్గొన్న ఎన్నికల ర్యాలీకి పెద్ద సంఖ్యలో ప్రజలు హాజరయ్యారు. రాష్ట్రంలో మమతా బెనర్జీ అపసవ్య పాలనపై మోదీ మండిపడ్డారు. కేంద్రం ఈ రాష్ట్రానికి ఇచ్చిన గ్రాంట్లను ప్రభుత్వం వినియోగించుకోలేకపోయిందని ఆయన ఆరోపించారు.
మరిన్ని ఇక్కడ చదవండి: Jagapathi Babu and Aamani : ‘ఆహా’కోసం జగపతి బాబు వెబ్ సిరీస్.. జగ్గూభాయ్ కు జోడీగా అలనాటి అందాల నటి ఆమని