రాష్ట్రమంతా ఒక వ్యవహారంపై మాటల తూటాలు పేలుతుంటే .. ఆ ఇద్దరి నేతల మధ్య మాత్రం మరో పంచాయతీ జరుగుతోంది. టీడీపీ సీనియర్ నేత యనమల, రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన మధ్య లేఖల యుద్ధం, మాటల యుద్ధం సమాంతరంగా కొనసాగుతోంది. రాష్ట్రంలో అప్పులు, వాటి లెక్కలు. ఈ పాయింట్‌పైనే ఇప్పుడు వీరి మధ్య వార్ జరుగుతోంది. మాజీ ఆర్థిక మంత్రి యనమల విడుదల చేసిన లెక్కలకు కౌంటర్ గణాంకాలు విడుదల చేశారు మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్. కరోనా సంవత్సరాన్ని కలిపి లెక్కలు గట్టి ఆర్థిక వృద్ధి కాలేదని ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారన్నారు. కరోనాకు ముందు ఏడాది 2019-20లో రాష్ట్ర స్థూల ఉత్పత్తి 7.23 శాతం వృద్ధి ఉన్నట్లు కొత్త చిట్టా విడుదల చేశారు. వ్యవసాయ రంగంలో 7.91 శాతం ; పారిశ్రామిక రంగంలో 10.24 శాతం వృద్ధి నమోదైందని చెప్పారు. 2020 – 21 సుస్థిర అభివృద్ధి లక్ష్యాల ఇండెక్సులో ఏపీకి 3వ ర్యాంకు వచ్చినట్లు గుర్తు చేశారు. నీతి ఆయోగ్ నివేదిక ప్రకారం పేదరిక నిర్ములన, అసమానతల తగ్గింపులో 5, 6 స్థానాల్లో నిలిచామన్నారు. తప్పుడు లెక్కలతో యనమల ప్రజలను బురిడీ కొట్టించలేరంటూ ఘాటుగా స్పందించారు.
బాధ్యత లేని ప్రతిపక్షంగా టీడీపీ వ్యవహరిస్తోందన్నారు. మాజీ ఆర్థికమంత్రిగా ఉండి ప్రజలను తప్పుదోవ పట్టించడం దుర్మార్గమన్నారు. గత టీడీపీ ప్రభుత్వం దిగిపోయే సమయానికి రాష్ట్ర GSDP కూడా క్షీణిస్తూ వచ్చిందన్నారు బుగ్గన. టీడీపీ చూపించిన నిరుద్యోగ రేటుపైనా ఆయన మండిపడ్డారు. యనమల పచ్చి అబద్దాలు ప్రచారం చేస్తున్నారన్నారు. ఏ లెక్కల ప్రకారం నిరుద్యోగ రేటు 6.5శాతమో చెప్పాలన్నారు. 2018-19లో 5.7శాతమున్న నిరుద్యోగ రేటు.. 2019-20 కల్లా 5.1శాతానికి దిగొచ్చిందన్నారు.
Also Read:పెళ్లయిన మరుక్షణమే ప్రియుడితో వధువు జంప్… ట్విస్ట్ ఏంటంటే