Jinnah Tower Guntur: ఏపీ రాజకీయాలు ఇప్పుడు సోము వీర్రాజు చేసే వ్యాఖ్యల చుట్టూ తిరుగుతున్నాయి. విజయవాడ సభ మహిమో ఏంటో కానీ ఏపీ బీజేపీ ఏం చేసినా సంచలనమవుతోంది. ఏం మాట్లాడినా చర్చకు దారితీస్తోంది. మద్యంపై సోము వీర్రాజు వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టించాయి. దీనిపై గల్లీ టు ఢిల్లీ చర్చ జరుగుతుండగానే పార్టీ జాతీయ కార్యదర్శి సత్యకుమార్ జిన్నా టవర్‌పై పెట్టిన ట్వీట్ ఏకంగా భూకంపమే సృష్టిస్తోంది. దీని ప్రకంపనలు తెలంగాణకూ పాకాయి. గుంటూరులో జిన్నా టవర్ పేరేంటని దేశద్రోహి పేరు ఉండటం ప్రజలకే అవమానమంటున్నారు బీజేపీ నాయకులు. పేరు మారుస్తారా? కూల్చమంటారా అంటూ అల్టిమేటమిచ్చారు. దేశవిభజనకు.. లక్షలమంది ఊచకోతకు కారకుడు అయిన జిన్నా దేశద్రోహి అంటోంది భారతీయ జనతా పార్టీ. టాప్ టు బాటమ్ లీడర్స్ అంతా దీనిపైనే ఫోకస్ పెట్టి మరీ దేశభక్తిని రగిలించే ప్రయత్నంలో ఉన్నారు.
అయితే తాజాగా ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు మరో కామెంట్ చేశారు. ఆజాదీగా అమృత మహోత్సవం సందర్బంగా ఆయన ట్వీట్ చేశారు. ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ జరుపుకుంటున్న ప్రస్తుత తరుణంలో ఇప్పటికీ దేశ విభజనకు కారకులైన వారి పేర్లతో రాష్ట్రంలో జంక్షన్లు/రోడ్లు ఉండటం దురదృష్టకరమన్నారు. గుంటూరు జిల్లా కేంద్రంలోని జిన్నా టవర్ పేరును వెంటనే మార్చాలని బీజేపీ నేతలు డిమాండ్ చేస్తున్నారు. అఖండ భారతాన్ని ముక్కలు చేసి పాకిస్థాన్ దేశం కోసం కృషి చేసిన జిన్నా అని మండిపడుతున్నారు.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆజాది కా అమృత్ మహోత్సవ్‌లో భాగంగా ఆనాటి స్వతంత్ర్య సమరయోధులను గుర్తు చేసుకుంటున్న ఈ సమయంలోనైనా ఆ పేరును తొలిగించాలన్నారు. దేశద్రోహుల పేర్లు ఉంటే భవిష్యత్ తరాలకు మనం ఎలాంటి సందేశం ఇచ్చినట్లని ప్రశ్నించారు. జిన్నా టవర్ స్థానంలో స్వాతంత్ర్య సమరయోధుని పేరు పెట్టాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు.
ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ జరుపుకుంటున్న ప్రస్తుత తరుణంలో ఇప్పటికీ దేశ విభజనకు కారకులైన వారి పేర్లతో రాష్ట్రంలో జంక్షన్లు/రోడ్లు ఉండటం దురదృష్టకరం.
వెంటనే రాష్ట్ర ప్రభుత్వం స్పందించి, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అలాంటి పేర్లను మార్చాలని కోరుతున్నాను.@ysjagan @AndhraPradeshCM pic.twitter.com/79JDSTZxF5
— Somu Veerraju / సోము వీర్రాజు (@somuveerraju) December 30, 2021
ఇవి కూడా చదవండి: Omicron: ఒమిక్రాన్ ఇన్ఫెక్షన్‌లతో డెల్టాకు చెక్.. సౌతాఫ్రికా నిపుణుల తాజా అధ్యయనంలో సంచలనాలు!