- Telugu News Photo Gallery Turning on TV or handing phone to your toddlers to keep them busy? Study reveals why it's dangerous
Parenting: అల్లరి చేస్తున్నారని పిల్లల చేతికి ఫోన్ ఇస్తున్నారా? వారి భవిష్యత్తుపై ఎలాంటి ప్రభావం పడుతుందో తెలుసా..
పిల్లలు తినడానికి మారం చేసినప్పుడు.. మీరు పనిలో ఉన్నప్పుడు విసిగిస్తున్నప్పుడు.. వారిని బిజీగా ఉంచడానికి చాలా మంది తల్లిదండ్రులు చేతికి మొబైల్ ఫోన్ ఇస్తుంటారు. లేదంటే టీవీ ఆన్ చేసి వారి దృష్టిని టీవీపైకి మళ్లిస్తుంటారు. కార్టూన్ చూస్తూ వారుబిజీగా ఉంటారు. చాలా ఇళ్లలో ఇది కనిపిస్తుంది. భోజన సమయాల్లోనే కాదు, పగటిపూట కూడా పిల్లల దృష్టి మరల్చడానికి మొబైల్ ఫోన్లు ఇస్తుంటారు. లేదా టీవీలో కార్టూన్లు పెడుతుంటారు. పిల్లలు ఇలా టెలివిజన్, స్మార్ట్‌ఫోన్‌లు, టాబ్లెట్‌ల వంటి గాడ్జెట్‌లలో మునిగిపోవడం తాత్కాలికంగా తల్లిదండ్రులకు ఉపశమనం కలిగించినా దీని పరిణామాలు భయంకరంగా ఉంటాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు..
Updated on: Feb 16, 2025 | 3:44 PM

ప్రపంచవ్యాప్తంగా ప్రజలలో స్క్రీన్ సమయం పెరుగుతోంది. రోడ్డు మీద, బస్సులో, రైలులో, కారులో, విమానంలో ఎక్కడైనా సమయం గడపడానికి మొబైల్‌ను ఒక మార్గంగా ఎంచుకున్నారు. సినిమా, వెబ్ సిరీస్, వీడియో గేమ్ ఇలా వాటిని చూస్తూ మునిగిపోవడం అలవాటై పోతుంది. ఇది క్రమంగా వ్యసనం దశకు చేరుకుంటుంది. ఇది పిల్లలపై మరింత తీవ్రమైన ప్రభావాన్ని చూపుతుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. మరీ ముఖ్యంగా దీర్ఘకాలంలో, ఇది చాలా హానికరం మారవచ్చని చెబుతున్నారు.

ఒక అధ్యయనంలో 12-48 నెలల వయస్సు గల పిల్లల తల్లిదండ్రులపై వివిధ డేటాను సేకరించారు. చాలా సందర్భాలలో, పిల్లలు రోజుకు కనీసం గంటసేపు మొబైల్ ఫోన్ లేదా టీవీ వంటి గాడ్జెట్ స్క్రీన్‌ని చూస్తూ గడుపుతున్నట్లు వీరి అధ్యయనంలో తేలింది. అయితే టీవీ ఆన్‌లో ఉన్నప్పటికీ పిల్లలు దానిని నిరంతరం చూడకపోవచ్చు, కానీ ఫోన్ విషయంలో ఇలా జరగదు.

దీనివల్ల పిల్లలు మాట్లాడటంలో ఇబ్బంది పడతారని పరిశోధనలో తేలింది. వాళ్ళు ఎక్కువ మాటలు చెప్పలేరు. కారణం ఏమిటంటే పిల్లలు మొబైల్ ఫోన్లలో వీడియోలు చూస్తున్నప్పుడు లేదా టీవీ చూస్తున్నప్పుడు, వాటిని చూస్తూనే ఉంటారు. ప్రత్యక్ష సంభాషణ వీరిలో ఉండదు. ఫలితంగా, వీరి భాషా నైపుణ్యాలలో ఎటువంటి మెరుగుదల ఉండదు. కొత్త పదాలు, వాక్యాలు నేర్చుకోవడం వీరిలో ఉండదు.

దీని నుంచి బయటపడాలంటే.. వాస్తవానికి, సమస్యను అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం. ఈ పనిని ఇంట్లో ఉండే పిల్లల సంరక్షకులు చేయాలి. పిల్లలు వీడియోలు చూడాల్సి వస్తే సంభాషణలు కలిగిన వాటిని చూపించాలి. దీని వల్ల వారు కొత్త పదాలను నేర్చుకోగలుగుతారు. కొత్తగా ఏదైనా నేర్చుకోవాలనే ఆసక్తిని వారిలో కలిగించాలి.

పిల్లలకు ఇలా మొబైల్ ఫోన్లు లేదా టీవీ ద్వారా మాత్రమే కాకుండా వివిధ కథల ద్వారా వారు కొత్త విషయాలను నేర్చుకునే అవకాశాలను ఎక్కువగా సృష్టించాలి. పిల్లలకు వచ్చే వివిధ ప్రశ్నలకు ఓపికగా సమాధానం ఇవ్వడం వల్ల వారి భాష, జ్ఞానంలో గణనీయమైన మెరుగుదలలు కనిపిస్తాయి.





























