
వర్షాకాలం పోయి.. శీతాకాలం వస్తోంది.. ఈ మారుతున్న కాలంలో ఫ్లూ, దగ్గు, జలుబు సర్వసాధారణం. ఈ కాలానుగుణ ఫ్లూని ఎదుర్కోవటానికి అత్యంత ప్రభావవంతమైన మార్గాలలో ఒకటి మీ శరీరం రోగనిరోధక వ్యవస్థను బలోపేతం చేయడం. ఈ సీజన్‌లో, తెల్లవారుజామున నిద్రలేచి, తాజాగా కాచిన నీటిలో పసుపు, తేనె కలిపి త్రాగడం చాలా ప్రయోజనకరంగా పరిగణిస్తారు.. ఆయుర్వేద వైద్యంలో పసుపు, తేనెను ఎక్కువగా ఉపయోగిస్తారు. పసుపు, తేనెలో ఎక్కువ ఔషధ గుణాలు దాగున్నాయి. అందుకే.. వీటిని తీసుకోవడం ఆరోగ్యానికి చాలామంచిది. గోరువెచ్చని నీటిలో పసుపు, తేనె కలిపి తాగడం వల్ల శరీరంలోని కొవ్వు తగ్గుతుంది.. దీంతో బరువు కూడా తగ్గుతుంది.. ప్రతి రోజూ ఉదయం గోరువెచ్చని నీటిలో పసుపు, తేనె కలిపి తాగడం వల్ల ఎలాంటి ప్రయోజనాలు చేకూరుతాయో తెలుసుకోండి..

పసుపులో కర్కుమిన్ అనే శక్తివంతమైన యాంటీ ఇన్‌ఫ్లమేటరీ లక్షణాలతో కూడిన పదార్థం ఉంటుంది. పసుపు నీటిని క్రమం తప్పకుండా తాగడం వల్ల మీ శరీరంలో మంట తగ్గుతుంది. దీర్ఘకాలిక వ్యాధులను నివారించడంలో ఇది మీకు సాయపడుతుంది. కర్క్యుమిన్‌కు క్యాన్సర్‌ను నిరోధించే సామర్ధ్యం ఉందని ప్రయోగశాలల్లో నిర్వహించిన అనేక అధ్యయనాల్లో తేలింది.

బరువు తగ్గడంలో సహాయపడుతుంది: ప్రతి రోజూ ఉదయం గోరువెచ్చని నీటిలో పసుపు, తేనె కలిపి తాగడం వల్ల శరీరంలోని అదనపు కొవ్వు తొలగిపోతుంది. ఇది ఊబకాయాన్ని తగ్గించడంలో సహాయపడుతుంది- శరీరాన్ని స్లిమ్‌గా, ట్రిమ్‌గా ఉంచుతుంది.

రోగనిరోధక శక్తిని పెంచుతుంది: పసుపు - తేనెను ఉదయాన్నే తీసుకోవడం వల్ల శరీరంలో రోగనిరోధక కణాల ఉత్పత్తి పెరుగుతుంది. తద్వారా శరీరంలో రోగనిరోధక శక్తి పెరుగుతుంది. దీనివల్ల సీజనల్ వ్యాధులు శరీరంపై దుష్ప్రభావం చూపవు.

పసుపు నీటిని క్రమం తప్పకుండా తాగడం వల్ల జీర్ణ ఆరోగ్యం మెరుగుపడుతుంది. గ్యాస్ సమస్య తగ్గుతుంది. పసుపు జీర్ణ ఆరోగ్యాన్ని మెరుగుపరిచే యాంటీ ఇన్ఫమ్లేటరీ లక్షణాలను కలిగి ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. ప్రతిరోజూ ఖాళీ కడుపుతో పసుపు నీటిని తీసుకోవడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు అదుపులో ఉంటాయి. డయాబెటిక్ బాధితులకు మంచిది.